కమిటీ వల్ల మీకేంటి నష్టం?
ఎన్‌జీటీ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నిజ నిర్ధారణ కమిటీ వంటి దేనని, దాని పనిని దాన్ని చేయనివ్వాలని స్పష్టం చేసింది. కమిటీ తన నివేదికను ఎన్‌జీటీకి ఇవ్వడంపై అభ్యంతరం ఉంటే, కమిటీ నుంచి తామే నివేదికను తెప్పించుకుంటామని తేల్చిచెప్పింది. ఈ విషయంలో స్పష్టతనిచ్చేందుకు అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) గడువు కోరడంతో కోర్టు అందుకు అంగీకరిస్తూ విచారణను గురువారానికి వాయిదా వేసింది. బుధవారం ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనా థన్, న్యాయమూర్తి జస్టిస్ తెల్లప్రోలు రజనీ తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
అటవీ, పర్యావరణ చట్ట నిబంధ నలకు విరుద్ధంగా పాలమూరు ప్రాజెక్టు పనులను ప్రభుత్వం చేపట్టిందని, ఈ వ్యవ హారంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన బీరం హర్షవర్ధన్‌రెడ్డి అనే వ్యక్తి ఎన్‌జీటీలో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ ఉల్లంఘనలను, ప్రాజెక్టు తీరు తెన్నులను తెలుసుకునేందుకు వీలుగా స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలంటూ ఓ అనుబంధ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ అనుబంధ పిటిషన్‌పై సానుకూలంగా స్పందించిన ఎన్‌జీటీ గత నెల 30న ఎన్‌జీటీ విశ్రాంత సభ్యులు ప్రొఫెసర్ ఏఆర్ యూసఫ్ చైర్మన్‌గా ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఎన్‌జీటీ ఇచ్చిన ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బుధవారం ఈ వ్యాజ్యంపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.
దీనికి ఏఏజీ సమాధానమిస్తూ, తాము కేవలం తాగునీటి ప్రాజెక్టును మాత్రమే చేపడుతున్నామని, సాగునీటి ప్రాజెక్టును చేపట్టబోమని హామీ ఇచ్చామని తెలిపారు. అయినప్పటికీ ఎన్‌జీటీ స్వతంత్ర కమిటీని నియమించిందని, జూలై 19 నాటికి నివేదిక ఇవ్వాలని ఎన్‌జీటీ ఆదేశించిందని చెప్పారు. ధర్మాసనం స్పందిస్తూ, ‘ఎన్‌జీటీకి నివేదిక ఇవ్వడంపై ప్రభుత్వానికి అభ్యంతరం ఉంటే, మేమే ఆ కమిటీ నుంచి నివేదిక తెప్పించుకుంటాం. అందుకు సంబంధించి ఆదేశాలు ఇస్తాం..’అని స్పష్టం చేసింది.