ఆటకేదీ ఆదరణ?
సిటీలోని ప్రముఖ స్టేడియాలు...
♦ అంబర్‌పేట స్టేడియం
♦ గోల్కొండ ప్లేగ్రౌండ్
♦ పటేల్ ప్లేగ్రౌండ్, శాలిబండ
♦ విక్టరీ ప్లే గ్రౌండ్ , చాదర్‌ఘాట్
♦ విజయనగర్ కాలనీ స్పోర్టింగ్ గ్రౌండ్
♦ ఎన్టీఆర్ స్టేడియం, ఇందిరాపార్కు
పట్టణ ప్రణాళిక విభాగం నిబంధనల మేరకు లేఔట్లలో 10 శాతం ఖాళీ స్థలాలుండాలి. వీటిని ఆటస్థలాలు, ఉద్యానవనాలకు వినియోగించాలి. కానీ నగరంలో ఈ నిబంధన కాగితాలకే పరిమితమైంది. ఖాళీ స్థలాలు 3 శాతం మించి లేవు. ఉన్న వాటిల్లోనూ ఆటస్థలాలకు వినియోగిస్తున్నవి తక్కువే. అసలే అరకొరగా ఉన్న ఆటస్థలాలు ఏటికేడు అదృశ్యమవుతున్నాయి. కబ్జా కోరల్లో చిక్కుకుంటున్నాయి. నగరంలో ఒకప్పుడు 725 ప్లేగ్రౌండ్స్ ఉండగా, అవి 600కు తగ్గాయి. తీరా క్షేత్ర స్థాయిలో చూస్తే ప్రస్తుతం 521 మాత్రమే ఉన్నాయి. వీటిలో ఎన్ని ఉంటాయో, పోతాయో తెలియని పరిస్థితి. పాలకులు, అధికారులు వీటి పరిరక్షణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అరకొర సౌకర్యాలు...
ప్రస్తుతం ఉన్న ఆటస్థలాల్లో సదుపాయాలు లేక క్రీడాకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అన్ని సౌకర్యాలున్నాయని జీహెచ్‌ఎంసీ సెలవిస్తుండగా, వాస్తవంలో మాత్రం భిన్నంగా ఉంది. ఆటస్థలాలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లకు ఆసక్తి కొద్దీ వెళ్లే పేద క్రీడాకారులకు క్రీడాపరికరాలు అందుబాటులో ఉండడం లేదు. దీంతో వారు సొంతంగా పరికరాలు కొనుక్కోలేక క్రీడాసక్తిని చంపుకోవాల్సి వస్తోంది. ఆరుబయట ఆటస్థలాలు లేక, అపార్టుమెంట్లలో కొనసాగుతున్న విద్యాసంస్థల్లోనూ క్రీడలకు అవకాశాల్లేక భవిష్యత్ తరాలు ఆటలకు దూరమవుతున్నాయి.
పాయింట్ అవుట్...
► జోన్‌కు ఐదు చొప్పున ఐదు జోన్లలో 25 ప్లేగ్రౌండ్స్‌ను ఆధునిక హంగులతో అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు.
► 46 ఏళ్ల పాటు నిరాటంకంగా నిర్వహించిన సమ్మర్ కోచింగ్ క్యాంప్‌లకు 2015లో స్వస్తి పలికారు. 2014లో 1260 సమ్మర్ కోచింగ్ క్యాంప్‌లు ఏర్పాటు చేయగా, 2015లో ఒక్కటి కూడా ఏర్పాటు చేయలేదు.
► కనీసం 10 శాతం ఖాళీ స్థలాలుండాల్సి ఉండగా, మూడు శాతం కూడా లేని దుస్థితి. ఉన్న వాటిలోనూ ఆటస్థలాలు 25 శాతమే. అక్కడక్కడ కొన్ని ఖాళీ స్థలాలు పిల్లలు ఆడుకునేందుకు ఉపయోగపడుతుండగా, వాటినీ లేకుండా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
► క్రీడాకారులకు ఎంతో సదుపాయంగా ఉన్న ఎన్టీఆర్ స్టేడియంలో సైతం కళాభారతి నిర్మించాలనే ప్రతిపాదనలు చేశారు. ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో ఉంది.
► 1000 జిమ్‌లు ఏర్పాటు చేస్తామని ప్రకటించి ఏడాదైనా వాటి జాడ లేదు. వీటి కోసం బడ్జెట్‌లో భారీగా నిధులు కూడా కేటాయించారు.
► ఆయా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, ఆటస్థలాల నిర్వహణ, ఇతరత్రా సదుపాయాల కోసం ఈ ఆర్థిక సంవత్సరం రూ.3 కోట్లు కేటాయించగా.. రూ.కోటి మాత్రమే ఖర్చు చేశారు.
► స్పోర్ట్స్ విభాగం పేరిట ఈ ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో రూ.60 కోట్లు కేటాయించారు. అంతర్జాతీయ స్థాయిలో స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ల ఆధునీకరణ తదితర పనులు వీటిలో ఉన్నాయి. కానీ ఇదీ కార్యరూపం దాల్చలేదు.
► క్రీడా విభాగానికి సంబంధించిన 99 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అద్దెకు ఆటస్థలాలు
నగరంలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించాలని, నానాటికీ తగ్గిపోతున్న ఆటస్థలాలను అభివృద్ధి చేయాలని జీహెచ్‌ఎంసీ ప్రస్తుత కమిషనర్ జనార్దన్‌రెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విద్యాసంస్థలకు ఆటస్థలాలను అద్దెకిచ్చేందుకు నిర్ణయించారు. అయినప్పటికీ విద్యాసంస్థల నుంచి పెద్దగా స్పందన రావడం లేదు.
ప్రోత్సాహం కరవు
అరవింద్, అంబర్‌పేట
నగరంలో క్రీడాకారులకు సరైన ప్రోత్సాహం లేదు. ఆటస్థలాలకు క్రీడా పరికరాలు సరఫరా చేయడం లేదు. ఎవరి క్రీడా పరికరాలు వారే తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఆటస్థలాల అభివృద్ధిలో జీహెచ్‌ఎంసీ అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. గ్రౌండ్స్‌లో ఏదైనా పాడైపోతే మరమ్మతులకే నెలల సమయం పడుతోంది. ఈ పరిస్థితి మారాలి. ఆటస్థలాల అభివృద్ధికి కృషి చేసే వారికే నా ఓటు.
కాంక్రీట్ జంగిల్‌గా మారిన భాగ్యనగరిలో ‘ఆట’విడుపునకు అంగుళం స్థలం కూడా దొరకని పరిస్థితి. ‘కబ్జా’ సర్పం పడగవిప్పి ఆటస్థలాలు అదృశ్యమవుతున్నాయి. కొన్ని ఉన్నా వాటిలో సదుపాయాల లేమి. అరకొర వసతులతో క్రీడాకారులకు అష్టకష్టాలు. అభివృద్ధి ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమైన.. పాలకుల నిర్లక్ష్యం, యంత్రాంగం వైఫల్యాల ఫలితమిది. గ్రేటర్ ఎన్నికల వేళ.. అభివృద్ధి మంత్రం జపిస్తూ.. హామీలతో అదరగొడుతున్న నాయకులారా.. ఆటస్థలాల్లో మౌలిక సదుపాయాలు కల్పించే వారికే తమ ఓటు అంటున్నారు సిటీజనులు.
- సాక్షి, సిటీబ్యూరో, అంబర్‌పేట
భ్రమలో అధికారులు..
రజినీకాంత్, బాగ్ అంబర్‌పేట
ఇండోర్, అవుట్‌డోర్ స్టేడియంలు అసలైన క్రీడాకారులకు అందుబాటులో ఉండడం లేదు. వ్యాయామం, విశ్రాంతి కోసం వచ్చే వారితో మైదానాలు నిండిపోతున్నాయి. దీంతో అక్కడ ప్రాక్టీస్ చేసుకోలేని పరిస్థితి నెలకొంది. ఆట స్థలాలున్నాయి.. క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామనే భ్రమలో జీహెచ్‌ఎంసీ అధికారులున్నారు. ఆటస్థలాలు క్రీడాకారులకు అందుబాటులో ఉండేలా చొరవ తీసుకొనే నాయకులకే నా ప్రాధాన్యం.