సాక్షి, హైదరాబాద్ / బంజారాహిల్స్: ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుడు నందుకుమార్‌కు చెందిన హోటల్ డెక్కన్ కిచెన్‌కు అనుబంధంగా ఉన్న రెండు నిర్మాణాలను జీహెచ్‌ఎంసీ అధికారులు ఆదివారం కూల్చేశారు. నందుకుమార్ ప్రస్తుతం జైల్లో ఉన్న నేపథ్యంలో ఆయన ఆస్తులపై ఆధికారులు ఆరా తీశారు. దీంతో ఫిల్మ్ నగర్‌లో ఉన్న డెక్కన్ కిచెన్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
జీహెచ్‌ఎంసీ సర్కిల్–18 పరిధి, జూబ్లీహిల్స్ డివిజన్ ఫిలింనగర్ రోడ్ నం.1లోని ప్లాట్ నంబర్ 2 (ఇంటి నంబర్ 8–2–293/82/ఎఫ్/2)లో సినీ నటుడు దగ్గుబాటి రానాకు వెయ్యి గజాల స్థలం ఉంది. ఈ స్థలాన్ని నందుకుమార్‌కు చెందిన డబ్ల్యూ3 హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ లీజుకు తీసుకుంది. పక్కనే ఉన్న దగ్గుబాటి వెంకటేష్‌కు చెందిన ప్లాట్ నంబర్ 3లోని వెయ్యి గజాల స్థలాన్ని కూడా నందుకుమార్ లీజుకు తీసుకుని డెక్కన్ కిచెన్ పేరుతో రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్నాడు.
దగ్గుబాటి రానా ఫిర్యాదు
తమ స్థలంలో, జీహెచ్‌ఎంసీ నుంచి అనుమతులు తీసుకోకుండా నిర్మాణాలు చేపడుతున్నారని రానా గతంలో జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. తాజాగా శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నారని, వెంటనే అడ్డుకోవాలని రానా ఇటీవల మరోసారి ఫిర్యాదు చేశారు. దీంతో జీహెచ్‌ఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయినప్పటికీ నందకుమార్ నిర్మాణ పనులను కొనసాగిస్తుండటంతో ఆదివారం జీహెచ్‌ఎంసీ సర్కిల్–18 టౌన్‌ప్లానింగ్ ఏసీపీ రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది జేసీబీల సహాయంతో కూల్చివేతలు చేపట్టారు.
సుమారు 3 గంటల పాటు కూల్చివేతల ప్రక్రియ కొనసాగింది. నందకుమార్ భార్య సహా కుటుంబ సభ్యులు కూల్చివేతలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. తాము చట్ట ప్రకారం లీజుకు తీసుకున్నామని, కోర్టు స్టే సైతం ఉందని చెప్పారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
చదవండి: (రాజకీయాలు చేయడానికి మా ఇళ్లకు వచ్చారా?.. జనసేన నాయకులపై లబ్ధిదారుల ఫైర్)
Comments
Please login to add a commentAdd a comment