నందుకుమార్‌ను ప్రశ్నించనున్న ఈడీ | MLA Poaching Case: ED Questions Nandakumar In Chanchalguda Jail | Sakshi
Sakshi News home page

నందుకుమార్‌ను ప్రశ్నించనున్న ఈడీ

Published Mon, Dec 26 2022 2:52 AM | Last Updated on Mon, Dec 26 2022 3:32 PM

MLA Poaching Case: ED Questions Nandakumar In Chanchalguda Jail - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్యేలకు ఎర’కేసులో కీలక నిందితుడు నందుకుమార్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సోమవారం చంచల్‌గూడ జైల్లో ప్రశ్నించనుంది. ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు పెద్ద మొత్తంలో డబ్బులు ఆశచూపారని, ఇందులో మనీలాండరింగ్‌కు అవకాశం ఉందన్న అనుమానాలతో ఈడీ రంగంలోకి దిగింది. ఇదే ప్రధానాంశంగా నందుకుమార్‌ను ప్రశ్నించేందుకు ఈడీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సుమిత్‌ గోయల్‌ నేతృత్వంలోని ఇద్దరు అధికారుల బృందం సన్నద్ధమైంది.

ఈ వ్యవహారంలో పెద్ద మొత్తంలో డబ్బులు ఆఫర్‌ చేసినట్టు ఎఫ్‌ఐఆర్‌ నమోదైన నేపథ్యంలో ఈ డబ్బులు ఎక్కడి నుంచి సమకూర్చాలనుకున్నారు? ఆర్థిక లావాదేవీల వెనుక ఎవరెవరు ఉన్నారన్న అంశాలపై ప్రధా నంగా ప్రశ్నించే అవకాశం ఉంది. నందుకుమార్‌ చెప్పే అంశాలే ఇప్పుడు ఈడీ అధికారుల దర్యా ప్తులో కీలకంగా మారనున్నాయి.

ఇప్పటివరకు ఈ కేసులో ప్రధాన నిందితులైన రామచంద్రభారతి, సింహయాజీ, నందుకుమార్‌లతో సత్సంబంధాలు న్న వారు... ఈ డీల్‌ సందర్భంగా రామచంద్రభారతి, నందుకుమార్, సింహయాజీ ప్రస్తావించిన పేర్లు, ఆ సమయంలో వారు ఎవరెవరితో ఫోన్‌లో మాట్లాడారు.. ఎవరితో టచ్‌లో ఉన్నారు.. అన్న అంశాల ఆధారంగానే ‘సిట్‌’బృందం దర్యాప్తు చేసింది. సిట్‌ బృందాలు కేరళ, కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో జరిపిన సోదాల్లోనూ కేవలం ఈ కేసుతో లింకులున్న వ్యక్తుల గురించి ఆరా తీయడంపైనే దృష్టి పెట్టింది.

సిట్‌ ఇప్పటివరకు చేసిన దర్యాప్తులో నందుకుమార్‌ భార్యతోపాటు ఇద్దరు న్యాయవాదులను ప్రశ్నించింది. కానీ, ఎక్కడా డబ్బు ప్రస్తావన రాలేదు. నిందితుల అరెస్టు సమయంలో పెద్దమొ త్తంలో డబ్బులు ఇవ్వజూపారని మాత్రమే సైబరా బాద్‌ పోలీసులు వెల్లడించారు. కానీ, ఘటనా స్థలంలో మాత్రం నగదు పట్టుబడిన ఆధారాలు వెల్లడించలేదు. రూ. వందల కోట్లు ఆశజూపి బేరసారాలు జరిపినట్లు ఆరోపణల నేపథ్యంలో ఈడీ విచారణలో డబ్బు అంశంతో మరేమైన కొత్త కోణాలు వెలుగులోకి వస్తాయా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సోమ, మంగళవారాల్లో నందుకుమార్‌ ఇచ్చే వాంగ్మూలం కొత్త మలుపులకు దారితీసే అవకాశం ఉన్నట్టు చర్చ జరుగుతోంది.  

మరోసారి పైలెట్‌ రోహిత్‌రెడ్డి
ఎమ్మెల్యేల ఎర కేసు ఫిర్యాదుదారుడు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి మంగళవారం మరోసారి ఈడీ అధికారుల విచారణకు హాజరుకానున్నా రు. గత వారంలో రెండు రోజులపాటు రోహిత్‌రెడ్డిని ప్రశ్నించిన ఈడీ ఈనెల 27న మరోమారు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement