పోలీస్‌ విచారణ ఆపండి | BJP Challenges TS High Court Single Judge Order Over MLA Poaching Case | Sakshi
Sakshi News home page

పోలీస్‌ విచారణ ఆపండి

Published Fri, Nov 11 2022 2:00 AM | Last Updated on Fri, Nov 11 2022 2:00 AM

BJP Challenges TS High Court Single Judge Order Over MLA Poaching Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో స్టేను ఎత్తివేస్తూ.. పోలీస్‌ దర్యాప్తు నకు అనుమతిస్తూ.. సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను భారతీయ జనతా పార్టీ హైకోర్టులో సవాల్‌ చేసింది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి ఈ రిట్‌ అప్పీల్‌ దాఖలు చేశారు. ‘మొయినాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అక్టోబర్‌ 26న నమోదైన (ఎఫ్‌ఐ ఆర్‌ నంబర్‌ 455/2022) కేసులో పోలీసులు పక్షపాతం, అన్యాయంగా విచారణ సాగిస్తున్నారు.

బీజేపీని దోషిగా నిలబెట్టాలనే సీఎం, టీఆర్‌ఎస్‌ ముఖ్యుల ఆదేశాలతో దర్యాప్తు సాగుతోంది. కావాలనే బీజేపీపై నిందమోపుతూ అప్రతిష్టకు గురి చేస్తున్నారు. పంచనామా తతంగం అంతా 26న సాగగా.. సాక్షు లతో సంతకాలు 27న చేయించారు. కేసు నమోదు చేసిన అనంతరం సమాచారం ఇచ్చిన పైలట్‌ రోహిత్‌రెడ్డితో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలను సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ ప్రగతిభవన్‌కు తరలించారు’అని అప్పీల్‌ పేర్కొన్నారు

సీఎం చేతికి సీడీలు..: ‘పోలీసులు స్వాధీనం చేసుకున్న వస్తువులను, ఆధారాలను సీజ్‌ చేసి ఉంచాలి. అయితే అవన్నీ సీఎం కేసీఆర్‌ చేరవేయడంతో పాటు.. ఆయన మీడియా సమావేశంలో అందరికీ ఆడియో, వీడియో ఫుటేజీ సీడీలను పంచిపెట్టారు. బీజేపీ జాతీయ స్థాయి నేతలపై ముఖ్యమంత్రి తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్ర, జాతీయ స్థాయి పత్రికలు, చానెళ్లతో పాటు సోషల్‌ మీడియాలోనూ ఇవి విస్తృత ప్రచారం అయ్యాయి.

ఈ నేపథ్యంలో ‘ఎమ్మెల్యేలకు ఎర’కేసులో బీజేపీకి పిటిషన్‌ వేసే అర్హత(లోకల్‌ స్టాండి) ఉంది. సింగిల్‌ జడ్జి కూడా అర్హతపై లోతైన విచారణ సాగాల్సి ఉందని చెప్పారు. తాజాగా ప్రభుత్వం పోలీసుల అధికారులతో ఏర్పాటు చేసిన సిట్‌పైనా మాకు నమ్మకం లేదు. ఈ పరిస్థితుల నేపథ్యంలో సింగిల్‌ జడ్జి గత నెల 29న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించాలి. సీబీఐతో విచారణకు ఆదేశాలు జారీ చేయాలి’అని బీజేపీ కోరింది. దీనిపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపే అవకాశం ఉంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement