సరి‘హద్దు’ల సంగతేంటి?
- నూతన ఠాణాలకు దిక్సూచీలు ఎక్కడ?
- ఐదు నెలలు గడిచినా వెలువడని ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన పోలీస్‌స్టేషన్ల సరిహద్దులను ఇప్పటివరకు గుర్తించలేదు. పాత పోలీస్‌స్టేషన్ల పరిధి నుంచి కొన్ని గ్రామాలు, ప్రాంతాలను విడదీసి నూతన పోలీస్‌స్టేషన్ కిందకు తీసుకు వచ్చారు. అయితే వీటిని గుర్తిస్తూ సంబంధిత నూతన పోలీస్‌స్టేషన్‌కు సరిహద్దు కేంద్రాలను ఉత్తర్వులుగా జారీ చేయాలి. ఆ పోలీస్‌స్టేషన్ కిందకు వచ్చే గ్రామాలు, వాటి వివరాలు పొందుపరుస్తూ నోటిఫికేషన్ జారీ చేయాలి. 5 నెలలు గడిచినా ఇప్పటివరకు ఉత్తర్వులు విడుదల కాకపోవడంతో పాత పోలీస్‌స్టేషన్ల పేరు మీదే నూతన ఠాణాల అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు. దీని వల్ల భవిష్యత్‌లో కేసుల విచారణలో న్యాయపరమైన సమస్యలు ఎదురవుతాయని పోలీస్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రెండు విభాగాల మధ్య..
92 నూతన పోలీస్‌స్టేషన్లను కొత్త జిల్లాల్లో భాగంగా ఏర్పాటు చేశారు. దసరా నుంచి కార్యక్రమాలు ప్రారంభించిన ఈ పోలీస్ స్టేషన్లకు ఇప్పటివరకు ఎఫ్‌ఐఆర్ అథారిటీ కూడా కల్పించలేదు. సరిహద్దు రేఖలు, కేసు నమోదు అధికారం లేకపోవడంతో పేరుకే పోలీస్ ఠాణాగా ఉందని ఎస్పీలు ఉన్నతాధికా రుల దృష్టికి తీసుకువచ్చారు. అయితే ఈ సమస్యపై హోంశాఖ–న్యాయశాఖ సమన్వయంతో ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే హోంశాఖ నుంచి సంబంధిత సరిహద్దు–ఎఫ్‌ఐఆర్ అధికార ఉత్తర్వుల ఫైలును న్యాయశాఖకు పంపారని ఉన్నతాధికారులు తెలిపారు. అయితే న్యాయశాఖలోనే నోటిఫికేషన్ కోసం ఫైలు పెండింగ్‌లో ఉందని స్పష్టం చేశారు. రెండు విభాగాల మధ్య సమన్వయ లోపం వల్లే అధికారిక ఉత్తర్వులు రావడం లేదని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి ఉత్తర్వులు వెలువడేలా కృషి చేయాలని ఎస్పీలు, కమిషనర్లు కోరుతున్నారు.