
ఏం సాధించారని సంబరాలు?
సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఏం సాధించారని సంబరాలు చేసుకుంటున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇది మాటలు ఎక్కువ, చేతలు తక్కువ ప్రభుత్వమని.. ఎన్నికలకు ముందు ఇచ్చిన పలు వాగ్దానాల అమలు సవ్యంగా లేదని విమర్శించారు. బుధవారం పార్టీ నాయకులు డీజీ నరసింహారావు, టి.జ్యోతి, జి.రాములుతో కలసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల అభివృద్ధికి ప్రభుత్వం ఈ రెండేళ్లలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు.
కేజీ టు పీజీ అమలుపై ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. దళితులకు భూ పంపిణీ ఏమాత్రం ముందుకు సాగడం లేదని, రెండు పడకల ఇళ్లకు అతీగతీ లేదని విమర్శించారు. ప్రాజెక్టుల పేరుతో 4,5 లక్షల ఎకరాల రైతుల భూ మిని ప్రభుత్వం కాజేస్తోందని ఆరోపించా రు. అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తే ప్రాజెక్టుల నిర్వాసితుల పునరావాసానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలు 123, 214 ఏ విధంగా నష్టదాయకమో రుజువుచేసేందుకు సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. కొత్త జిల్లాల ఏర్పాటును తమ పార్టీ స్వాగతిస్తోందని, అయితే ఈ ప్రక్రియ పారదర్శకంగా సాగడం లేదని అన్నారు.
మేము అంతర్జాతీయ వాదులం...
కమ్యూనిస్టు పార్టీలుగా తమది జాతీయస్థాయి కాదని, అంతర్జాతీయ వాదులమని ఒక ప్రశ్నకు తమ్మినేని బదులిచ్చారు. సీపీఎంకు జాతీయహోదా విషయంలో ప్రభుత్వం నిర్ణయించే ప్రాతిపదికలు వేరని, డబ్బు, కులం, మతం, తదితర అంశాలతో వీటిని నిర్ధారిస్తుంటారన్నారు. తమకు ప్రజ లు ఇచ్చే హోదాలే ముఖ్యమని, సీట్లు, ఓట్లు కాదని అన్నారు.