ఇక బాదుడే..!
ప్రత్యేక రైళ్లు నడిపేందుకే రైల్వే శాఖ మొగ్గు
సువిధ తరహాలో రద్దీ రూట్లలో స్పెషల్ రైళ్లు
అందుకే కొత్త రైళ్లు లేవు
ప్రయాణికులకు అదనపు భారం తప్పదు
భవిష్యత్తులో ప్రయాణికుల రద్దీ మేరకే ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఏటేటా కొత్త రైళ్లను తగ్గించి, అవసరాన్ని బట్టి అదనపు బోగీలు, ప్రత్యేక రైళ్లు మాత్రమే నడిపేందుకు ైరె ల్వే పరిమితం కానుంది. ప్రస్తుతం వివిధ మార్గాల్లో సువిధ తరహాలో నడుస్తున్నట్లుగానే ఇక నుంచి అదనపు చార్జీలతోనే ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రయాణికుల రద్దీని బట్టి, ప్రయాణ తేదీని బట్టి చార్జీలు పెరుగుతాయి. ఒకవైపు చార్జీలు పెంచకుండా, ప్రజలపైన ఎలాంటి అదనపు భారాన్ని మోపకుండానే రైల్వే బడ్జెట్ సమర్పించినట్లు కనిపిస్తున్నప్పటికీ పరోక్షంగా ప్రత్యేక రైళ్ల ద్వారా ఖజానా నింపుకోవాలనే వ్యూహం దాగున్నట్లు తెలుస్తోంది. - సాక్షి, సిటీబ్యూరో
సిటీబ్యూరో: గత రెండేళ్లుగా దక్షిణమధ్య రైల్వేకు కొత్త రైళ్లు లేవు. హైదరాబాద్ నుంచి షిరిడీ, బెంగళూరు, విశాఖ, న్యూఢిల్లీ తదితర మార్గాల్లో ప్రయాణికుల రద్దీ అనూహ్యంగా పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం కొత్త రైళ్లను వేయకపోవడం గమనార్హం. గతంలో ప్రకటించిన సికింద్రాబాద్ నుంచి హజ్రత్ నిజాముద్దీన్, హైదరాబాద్ నుంచి గుల్బర్గా ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పట్టాలెక్కకపోవడంలోని ఆంతర్యం కూడా ఇదే అయి ఉండవచ్చుననే అభిప్రాయం వినిపిస్తోంది. సాధారణ చార్జీలపైన ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడపడం కంటే అదనపు చార్జీలతో నడపడం వల్ల ఆదాయం పెరుగుతుంది. ప్రయాణికులకు అదనపు సదుపాయం అందజేసినట్లుగా ఉంటుంది. పైగా ప్రభుత్వం చార్జీలను పెంచకుండానే సేవలందజేస్తుందనే సానుభూతి కూడా దక్కుతుంది. ఈ ఉద్దేశ్యంతోనే కొత్త రైళ్లపై ప్రస్తుతానికి వెనక్కి తగ్గినట్లు తెలుస్తుంది.
భవిష్యత్తులో అంతా ‘ప్రత్యేకమే...’
జంటనగరాల నుంచి ప్రతి రోజు 2.5 లక్షల మంది ప్రయాణికులు వివిధ మార్గాల్లో రాకపోకలు సాగిస్తారు. వేసవి సెలవులు, పండుగలు, జాతరలు, పుష్కరాలు వంటి ప్రత్యేక రోజుల్లో 50 వేల నుంచి లక్ష మంది అదనంగా ఉంటారు. ప్రయాణికుల రద్దీని బట్టి ఇప్పటి వరకు సాధారణ ఏసీ, నాన్ ఏసీ చార్జీలపైనే అదనపు రైళ్లు నడుపుతున్నారు. సంక్రాంతి, దసరా, దీపావ ళి వంటి ప్రత్యేక రోజుల్లో అన్ని వర్గాల ప్రయాణికులకు ఈ అదనపు రైళ్లు ఎంతో ఊరటనిస్తాయి. బస్సులు, ఇతర ప్రజా రవాణా వాహనాల కంటే తక్కువ చార్జీలతో ఎక్కువ దూరం పయనించే అవకాశం లభిస్తుంది. కానీ భవిష్యత్తులో అలాంటి సదుపాయం ఉండదు. ప్రధాన మార్గాల్లో నడిచే ప్రత్యేక రైళ్లన్నీ ఏదో ఒక పేరుతో (ఇప్పుడు సువిధ) నడుస్తూ రెట్టింపు చార్జీలను రాబట్టుకోనున్నాయి. ఈ క్రమంలోనే అధిక చార్జీలతో తీర్ధయాత్రలు, పర్యటనల కోస ఉదయ్ (ఉత్కృష్ట్ డబుల్ డెక్కర్ ఎయిర్ కండీషన్డ్ యాత్రి ఎక్స్‌ప్రెస్) పేరుతో ఆధ్మాత్మిక రైళ్లను నడిపేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
చార్జీలు పెంచకుండానే....
తాజా బడ్జెట్‌లో అంత్యోద సూపర్‌ఫాస్ట్ రైళ్లను ప్రకటించారు. ఏయే మార్గాల్లో ఇవి నడుస్తాయనే విషయాన్ని స్పష్టం చేయలేదు. అన్‌రిజర్వ్‌డ్ ప్యాసింజర్స్ కోసం ఈ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. అంటే ప్రయాణికుల రద్దీ బాగా ఉండి, అప్పటికే ఆ మార్గంలో నడిచే రైళ్లలో వెయిటింగ్ లిస్టు వందల్లో పెరిగిపోయినప్పుడు ఈ అంత్యోదయ అన్‌రిజర్వ్‌డ్ సూపర్‌ఫాస్ట్ రైళ్లను నడుపుతారు. చార్జీలు ఎక్కువైనా సరే అప్పటికప్పుడు బయలుదేరాలనుకొనేవాళ్లకు ఇవి అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం సువిధ రైళ్లు అలాగే నడుస్తున్నాయి.
ఇక ప్రస్తుతం నడుస్తున్న దురంతో, రాజధాని తరహాలో ‘హమ్‌సఫర్’ పూర్తి ఏసీ రైళ్లు రానున్నాయి. వీటిల్లోనూ ప్రస్తుతం ఉన్న చార్జీల కంటే భారం అధికంగానే ఉండనుంది. తేజాస్ పేరుతో ప్రవేశపెట్టనున్న సూపర్‌ఫాస్ట్ రైళ్లు గంటకు 130 కిలోమీటర్‌ల కంటే ఎక్కువ వేగంతో పరుగులు తీస్తాయి. బడ్జెట్‌లో ప్రకటించిన ఈ రైళ్లు దక్షిణమధ్య రైల్వేలో ఏయే మార్గాల్లో నడుస్తాయనే అంశంపైన ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేదు. భవిష్యత్తు అవసరాలను బట్టే ఈ రైళ్లు అందుబాటులోకి వస్తాయని దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు ఁసాక్షి*తో అభిప్రాయపడ్డారు.