తిరుగు ప్రయాణంలోనూ తిప్పలే!
ఆలస్యంగా నడిచిన రైళ్లు సకాలంలో చేరుకోలేకపోయిన ప్రయాణికులు
సిటీబ్యూరో సంక్రాంతికి సొంత ఊళ్లకు వెళ్లిన ప్రయాణికులు తిరుగు ప్రయాణంలోనూ తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి నగరానికి చేరుకోవలసిన పలు రైళ్లు గంటలతరబడి ఆలస్యంగా నడిచాయి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లు, రెగ్యులర్‌గా నడిచే రైళ్లు సైతం పట్టపగలు చుక్కలు చూపించాయి. సోమవారం ఉదయం 7 గంటలకు సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్‌లకు చేరుకోవలసిన కొన్ని రైళ్లు చాలా ఆలస్యంగా నడిచాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గంటలతరబడి రైళ్లలోనే పడిగాపులు కాయాల్సి వచ్చిందని ప్రయాణికులు విస్మయం వ్యక్తం చేశారు. తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు రావలసిన స్పెషల్ ట్రైన్ సోమవారం ఉదయం 7.30కు సికింద్రాబాద్‌కు చేరుకోవలసి ఉండగా రెండున్నర గంటలు ఆలస్యంగా ఉదయం 10 గంటలకు అది సికింద్రాబాద్‌కు చేరుకుంది. అలాగే నర్సాపూర్–సికింద్రాబాద్ స్పెషల్ ట్రైన్ ఉదయం 8.50 కి సికింద్రాబాద్‌కు చేరుకోవలసి ఉండగా రెండు గంటలు ఆలస్యంగా 10.15 కు వచ్చింది. కాకినాడ–సికింద్రాబాద్ కాకినాడ స్పెషల్ ట్రైన్ ఉదయం 8.20 కి సికింద్రాబాద్‌కు చేరుకోవలసి ఉండగా, ఉదయం 10 గంటలకు వచ్చింది. అలాగే రెగ్యులర్ రైళ్లు కూడా ఆలస్యంగానే నడిచాయి. ఉదయం 6.35 కు సికింద్రాబాద్‌కు రావలసిన నారాయణాద్రి ఉదయం 7 గంటలకు, కాకినాడ–సికింద్రాబాద్ మధ్య నడిచే కోకనాడ ఎక్స్‌ప్రెస్ ఉదయం 7 గంటలకు రావలసి ఉండగా, 8.15 కు స్టేషన్‌కు చేరుకున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే రైళ్లు ఆలస్యంగా రావడంతో సాయంత్రం తిరిగి వెళ్లవలసిన రైళ్లు కూడా ఆలస్యంగానే బయలుదేరాయి.
గంటలతరబడి రైళ్లలోనే...
పండుగ సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లిన ప్రయాణికుల సంతోషాన్ని రైలు ప్రయాణం హరించి వేసింది. గంటల తరబడి పిల్లలు, పెద్దవాళ్లు, మహిళలు రైళ్లలోనే పడిగాపులు కాయాల్సి వచ్చింది. సికింద్రాబాద్ స్టేషన్‌లో రద్దీ దృష్ట్యా కొన్ని రైళ్లు ఆలస్యంగా చేరుకోగా, మరికొన్ని నిర్ణీత స్టేషన్‌ల నుంచే ఆలస్యంగా బయలుదేరడం వల్ల హైదరాబాద్‌కు రావడానికి ఎక్కువ సమయం పట్టింది. ప్రతి రోజు వందలాది రైళ్లు రాకపోకలు సాగించే సికింద్రాబాద్ స్టేషన్‌లో ప్రతి క్షణం ప్లాట్‌ఫామ్‌లన్నీ రద్దీగానే ఉంటాయి. సుమారు 120 ఎంఎంటీఎస్ రైళ్లు, మరో 100 ప్యాసింజర్ రైళ్లు, మరో 80 ఎక్స్‌ప్రెస్ రైళ్లు సికింద్రాబాద్ నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి. సంక్రాంతి వంటి రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో ప్రయాణికులు నరకం చవి చూడాల్సి వస్తుంది. చాలా వరకు మౌలాలీ, చర్లపల్లి, పగిడిపల్లి, తదితర స్టేషన్‌లలోనే ఆగిపోతున్నాయి. దీంతో ప్రయాణికులు హైదరాబాద్ శివార్లలోకి చేరుకున్నా ఇళ్లకు వెళ్లలేని పరిస్థితి నెలకొంటోంది.