సోము వీర్రాజును బాబు అడ్డుకుంటున్నారా?
హైదరాబాద్: బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖకు అధ్యక్షుడి నియామకం ఎందుకు జరగడం లేదు. దేశవ్యాప్తంగా దాదాపు 24 రాష్ట్రాల్లో ఆయా శాఖల అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియ ముగిసినప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఎందుకు ఆగిపోయింది. ఇందుకు ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయా అంటే.. ఔనని వినిపిస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక సజావుగా జరగకుండా టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అడ్డుకుంటున్నారని తెలుస్తోంది.
సంస్థాగత ఎన్నికల్లో భాగంగా వరుసక్రమంలో నాలుగైదు రాష్ట్రాలు మినహా బీజేపీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అధ్యక్షుల నియామకాలను పూర్తి చేసింది. ఇటీవలికాలంలోనే జి. కిషన్ రెడ్డి స్థానంలో తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా లక్ష్మణ్ ను నియమించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఏపీ రాష్ట్ర శాఖ కు కూడా అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ పూర్తి కావలసి ఉంది. అయితే ఆ ప్రక్రియ పూర్తి కాకుండా వాయిదా పడింది.
ఏపీ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ప్రస్తుతం విశాఖపట్నం లోక్ సభ సభ్యుడు కంభంపాటి హరిబాబు ఉన్నారు. ఆయన పదవీ కాలం పూర్తికావడంతో ఆయన స్థానంలో కొత్త వారిని నియమించాల్సి ఉంది. ఆ ఎంపిక కోసం పార్టీ సంస్థాగతంగా అన్నీ సిద్ధం చేసింది కూడా. ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్షుడిని చేయాలని మెజారిటీ నేతలు నిర్ణయించారు. అయితే చివరి నిమిషంలో ఆయన పేరును ప్రకటించకుండా వాయిదా వేశారు.
సోము వీర్రాజును బీజేపీ అధ్యక్షుడిగా నియమించకుండా చంద్రబాబునాయుడు శతవిధాలా ప్రయత్నిస్తున్నట్టు కమలం వర్గాల్లో బాగా వినిపిస్తోంది. రాష్ట్రంలో బీజేపీ మిత్రపక్షంగా వ్యవహరిస్తున్నందున ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా తన కనుసన్నల్లో తనమాట వినేవారినే నియమించేలా చూసుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. 2014 సాధారణ ఎన్నికలకు ముందు టీడీపీ-బీజేపీ-జనసేన ల మధ్య పొత్తు కోసం ఎన్నో ప్రయత్నాలు చేసిన సోము వీర్రాజు ఆ తర్వాత కాలంలో అధికార టీడీపీపై పలుసార్లు విమర్శలు గుప్పించారు. చంద్రబాబు వ్యవహార శైలిని పలు సందర్భాల్లో ప్రశ్నించారు. ఆ పరిణామాలు చంద్రబాబుకు ఏమాత్రం మింగుడు పడలేదు.
ఏపీ రాష్ట్ర శాఖకు సోము వీర్రాజును అధ్యక్షుడిగా నియమిస్తే మిత్రపక్షాల మధ్య సమస్యలు తలెత్తుతాయని బీజేపీ పెద్దల ముందు చెప్పడం ద్వారా చంద్రబాబు ఆయన నియామకాన్ని చివరి నిమిషంలో అడ్డుకున్నారని అంటున్నారు. సోము వీర్రాజు టీడీపీ సర్కారుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, అలాంటి నేతను పార్టీ అధ్యక్షుడిని చేస్తే ఇరు పార్టీల మధ్య సంబంధాలు బెడిసికొడతాయని చంద్రబాబు బీజేపీ నాయకత్వానికి చెబుతున్నట్టు వినిపిస్తోంది.
ప్రస్తుతం ఏపీ కేబినేట్ లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న బీజేపీ నేత కామినేని శ్రీనివాస్ తనకు ఎంతో అనుకువగా, అనుకూలంగా ఉంటారని, అలాకాకుండా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించే నేతను ఎంపిక చేయొద్దని చంద్రబాబు బీజేపీకి చెందిన ఓ జాతీయ స్థాయి నేత ముందు చెప్పుకున్నారని వినికిడి. అలాగని రాష్ట్ర శాఖ అధ్యక్ష బాధ్యతలు దగ్గుబాటి పురందేశ్వరికి కూడా అప్పగించరాదని ఆయన గట్టిగా కోరినట్టు బీజేపీలో గుప్పుమంటోంది. రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలన్న విషయంలో చంద్రబాబే కొన్ని పేర్లను బీజేపీ నాయకత్వానికి సూచించారని కూడా బలంగా ప్రచారం జరుగుతోంది. బీజేపీ అంతర్గత విషయాల్లో చంద్రబాబు జోక్యమేంటని పార్టీలోని కొందరు సీనియర్లు జాతీయ నాయకత్వం ముందు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.