
‘అరేయ్..ఒరేయ్ అంటోంది’.. అందుకే..
హైదరాబాద్: ప్రేమించి పెళ్లి చేసుకొని ఇద్దరు కొడుకులు పుట్టిన తర్వాత మరో పెళ్లి చేసుకునేందుకు తనను వదిలేశాడని, తనకు న్యాయం చేయాలనిదీక్ష చేపట్టిన బాధితురాలు సుజాత శనివారం కూడా అత్తింటి ముందు బైఠాయించింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి... ఫిలింనగర్ కు చెందిన సుజాత, భగత్ సింగ్ కాలనీకి చెందిన బీజేపీ నేత ఎస్పీ శ్రీను కుమారుడు అశోక్ 2004లో ప్రేమ వివాహం చేసుకున్నారు.
వీరికి ఆకాష్ (9), ప్రదీప్ (1) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. కొద్దిరోజుల క్రితం అశోక్ భార్యను ఇంట్లోనుంచి వెళ్లగొట్టాడు. దీంతో ఆమె మూడు నెలలుగా న్యాయం కోసం పోరాడుతోంది. గతంలో కూడా ఒకసారి అశోక్ ఇంటి ముందు మౌనదీక్ష చేపట్టగా అత్తింటివారు న్యాయం చేస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే వారిచ్చిన హామీ నెరవేరకపోవడంతో రెండువారాల క్రితం పోలీస్ స్టేషన్లో బైఠాయించగా మళ్లీ వంచించారు.
దీంతో శుక్రవారం సుజాత తమ ఇద్దరు పిల్లలుతో కలిసి అత్తింటి ముందు నిరసనకు దిగింది. ఇంట్లోకి వెళ్లేందుకు యత్నించిన ఆమెను భర్త అశోక్ అడ్డుకుని కొట్టి బయటకు తోసేయడంతో గాయపడింది. పోలీసులు అశోక్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ తనకు న్యాయం జరిగే వరకు దీక్ష కొనసాగిస్తానని బాధితురాలు హెచ్చరించింది.
2004లో తనను అశోక్ పెళ్ళి చేసుకున్నాడని ఇద్దరు పిల్లలు పుట్టారని ఇటీవలనే మరో పెళ్ళి చేసుకోవడానికి తనను దూరం చేస్తూ అత్తమామలతో కలిసి వేధింపులకు పాల్పడుతున్నారని తెలిపింది. తనను రోడ్డు పాలు చేశారంటూ మూడు నెలలుగా పోరాడుతున్నా న్యాయం జరగడం లేదని ఆమె పేర్కొంది. తాము పెళ్లి చేసుకున్నట్లు ఆధారాలు కూడా ఉన్నాయని వెల్లడించింది.
ఇదిలా ఉండగా...తాను సుజాతతో సహజీవనం చేశానని, పెళ్ళి చేసుకోలేదని నిందితుడు అశోక్ వెల్లడించారు. పదేళ్లు జైలుకైనా వెళ్తాను కాని ఆమెను పెళ్ళి మాత్రం చేసుకోనని తెలిపాడు. తాను శంషాబాద్‌లో సుజాతకు ఒక ప్లాట్ కూడా కొనిచ్చానని అశోక్ వెల్లడించాడు. రెండో కొడుకు తన వల్లే పుట్టిన మాట వాస్తవమేనని పెద్దల సమక్షంలో ఒప్పుకోవడం కూడా జరిగిందన్నాడు. తాను తల్లిదండ్రులతో మాట్లాడితే సూజత ఓర్వడం లేదని, ‘ఒరేయ్... అరేయ్..’ అని సంబోధిస్తూ తనకు విలువనివ్వడం లేదని అందుకే విరక్తి కలిగిందని అశోక్ చెప్పాడు.