
అయ్యో చిన్నారి..!
పని బాలికకు చిత్రహింసలు
అచేతన స్థితిలో జార్ఖండ్ చిన్నారి
ఆశ్రయం కల్పించిన దివ్యదిశ ప్రతినిధులు
సికింద్రాబాద్ : ఇంట్లో పనిచేసే జార్ఖండ్ బాలికను యజమానురాలు చిత్రహింసలకు గురిచేసింది. పోలీసుల వివరాలు.. నగరానికి చెందిన శ్రీనివాస్ పలాస్ అనే ఏజెంటు జార్ఖండ్‌కు చెందిన రేష్మాబిర్లా (13) తండ్రితో ఇళ్లలో పాచిపని చేయించడానికి ఒప్పందం చేసుకున్నాడు. కొంతమేర అడ్వాన్స్ తీసుకున్న రేష్మ తండ్రి ఆమెను శ్రీనివాస్ పలాస్‌కు అప్పగించాడు. కొంతకాలం క్రితం బాలికను అతడు సోమాజిగూడ సెల్లా మేరీ కళాశాల సమీపంలోని వ్యాపారవేత్త భార్య అనితా రాంపురియా ఇంట్లో పాచిపని కోసం చేర్పించాడు. కాగా బుధవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఒకటో నంబర్ ప్లాట్‌ఫామ్‌పై కూర్చున్న రేష్మాబిర్లాను గుర్తించిన జీఆర్‌పీ కానిస్టేబుల్ ఆమెను దివ్యదిశ చైల్డ్‌హెల్ప్ డెస్క్ ప్రతినిధులకు అప్పగించాడు. సంస్థ ప్రతినిధులు నింబోలి అడ్డాలోని బాలికల వసతి గృహంలో ఆశ్రయం కల్పించారు. వంటిపై కాలిన, కొట్టిన దెబ్బల గాయాలను చూపించిన బాలిక తనను అనితా రాంపురియా అనే మహిళ చిత్రహింసలు పెట్టిన తీరును వివరించింది. రోజూ మూడు కార్లను శుభ్రం చేయడంతో పాటు ఇంటి పని మొత్తం చేయాలని వేధించేదని బాలిక కంటతడి పెట్టింది. బాలిక పరిస్థితిని సమీక్షించిన రైల్వే సికింద్రాబాద్ ఎస్పీ జనార్దన్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. కేసును విచారణ జరిపి బాలికను గృహ హింసకు గురిచేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులకు రైల్వే ఎస్పీ సిఫారసు చేసినట్టు తెలిసింది.
మరో నలుగురికి ఆశ్రయం..
రేష్మాబిర్లాతో పాటు మరో నలుగురు బాలలకు దివ్య దిశ ప్రతినిధులు వసతిగృహంలో బుధవారం ఆశ్రయం కల్పించారు. బిహార్‌కు చెందిన వసీమ్ (11), మహ్మద్ రెహాన్‌తోపాటు మరో ఇద్దరు చిరునామా సైతం చెప్పే పరిస్థితిలో లేని బాలలను చేరదీసి వసతిగృహానికి తరలించారు. వీరంతా బిహార్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. నగరంలో వివిధ కర్మాగారాల్లో పనికోసం వచ్చినట్టు భావిస్తున్నారు. వీరిని నగరానికి తీసుకువచ్చిన వారికోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.