చంద్రబాబు ఆస్తుల ప్రకటన ఓ జోక్ | YCP Leader Bhumana Karunakar Reddy Fires on AP CM Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ఆస్తుల ప్రకటన ఓ జోక్

Published Fri, Oct 21 2016 12:54 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM

చంద్రబాబు ఆస్తుల ప్రకటన ఓ జోక్ - Sakshi

చంద్రబాబు ఆస్తుల ప్రకటన ఓ జోక్

ధ్వజమెత్తిన వైఎస్సార్‌సీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి
 ప్రకటించింది పిసరంత... దాచుకుంది కొండంత

 
 సాక్షి, హైదరాబాద్:
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం తన కుమారుడు లోకేష్‌బాబు ద్వారా చేయించిన తమ కుటుంబ ఆస్తుల ప్రకటన వ్యవహారం ఓ జోక్ అని, అదంతా ఫార్సు అని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీలో ‘షోకేస్ బాబు’గా చెలామణి అవుతున్న లోకేష్ చెప్పిన ఆస్తులు పిసరంతేనని, వాస్తవానికి వారి వద్ద గుట్టలుగుట్టలుగా అవినీతి సొమ్ము ఉందని దుయ్యబట్టారు. కరుణాకర్‌రెడ్డి గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... లోకేష్ చేసింది ఆస్తుల ప్రకటన కాదని అది వారి కుటుంబ దారిద్య్ర ప్రకటన అని ఎద్దేవా చేశారు.
 
 అమరావతి నిర్మాణానికి రాష్ట్రంలో ప్రజలు తలా ఒక ఇటుక ఇచ్చిన విధంగా లోకేష్ చేసిన తమ కుటుంబ ఆస్తుల ప్రకటనను చూసి జనం జాలిపడి ఐదున్నర కోట్ల మంది తలో రూ.100 లు ఇచ్చి వారి దారిద్య్రాన్ని పోగొట్టాలనే విధంగా ఆలోచిస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. చంద్రబాబును ఆదర్శంగా తీసుకుని... దేశంలో తనకంటే పేదవాడు లేడని రిలయన్స్ అంబానీ, దేశంలో తానే దారిద్య్ర రేఖకు దిగువ ఉన్నానని అదానీ ప్రకటిస్తే ఆశ్చర్యపడాల్సిన పని లేదని ఎద్దేవా చేశారు.
 
 పక్కదారి పట్టించేందుకే ప్రకటన
 చంద్రబాబు తన ఆస్తులపై తొలిసారిగా 2011 సెప్టెంబర్ 2వ తేదీన రాష్ట్రమంతా దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్థంతి జరుపుకుంటూ ఉండగా ప్రకటన చేశారని, ఇపుడు కూడా కృష్ణా నదీ జలాలపై బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చిన రోజునే తన కుమారుడి చేత ప్రకటింప జేశారని భూమన గుర్తుచేశారు. ఏదైనా ముఖ్యమైన పరిణామం చోటు చేసుకునే రోజునే దానిపై మీడియాలో ప్రచారం రాకుండా, జనంలోకి ఆ అంశం  వెళ్లకుండా పక్కదారి పట్టించేందుకే ఇలా ఆస్తుల ప్రకటన చేస్తుంటారని దుయ్యబట్టారు.
 
 వాస్తవానికి 13 ఏళ్ల క్రితమే మీడియారంగంలో అత్యంత విశ్వనీయత కలిగిన తెహల్కా డాట్ కామ్ సంస్థ చంద్రబాబు దేశంలోనే అత్యంత ధనవంతుడైన రాజకీయవేత్తగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. గత 17 ఏళ్లలో అవినీతితో దేశంలోనే భారీ ఆస్తులు కూడబెట్టిన కుటుంబం చంద్రబాబుదని చెప్పారు. హెరిటేజ్ ఆస్తుల విలువ పాడిపరిశ్రమ వల్ల పెరగలేదని, ఆయన చేసిన పాడు పరిశ్రమ వల్ల పెరిగిందని భూమన చెప్పారు.
 
 ఏం చూసి  ఆదర్శంగా తీసుకోవాలి?
 ఆస్తుల ప్రకటన జరగ్గానే టీడీపీ నేతలు చంద్రబాబును దేశంలో అందరూ ఆదర్శంగా తీసుకోవాలని పల్లవి ఎత్తుకున్నారని ఇంతకంటే దారుణం మరొకటి ఉండదని భూమన అభిప్రాయపడ్డారు. ‘ఏం చూసి చంద్రబాబును ఆదర్శంగా తీసుకోవాలి? ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టినందుకా? ఓటుకు కోట్లు కేసులో కూరుకు పోయి కేంద్రం వద్ద సాగిలపడినందుకా? రెండున్నరేళ్లు పూర్తయినా ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయనందుకా? ఒక్క పరిశ్రమా సాధించనందుకా? 600 ఎన్నికల హామీలు నెరవేర్చనందుకు, రుణ మాఫీ చేయకుండా రైతుల ఉసురు పోసుకున్నందుకా? ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అనైతికంగా సంతలో పశువుల మాదిరిగా కొన్నందుకా? ఒక్క నిరుద్యోగికి ఉద్యోగం ఇవ్వనందుకా? రూ. 2000లు నిరుద్యోగ భృతి ఇస్తానని ఇవ్వనందుకా? ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలో టీడీపీ వంది మాగధులు సమాధానం చెప్పాలి’ అని భూమన సూటిగా ప్రశ్నలు సంధించారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement