సీఎస్‌కు ఏడాది పొడిగింపు!
- సీఎం విజ్ఞప్తికి ప్రధాని సానుకూలం
- ఇప్పటికే ఆగస్టు వరకు పెంపు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ పదవీకాలాన్ని ఏడాదిపాటు పొడిగించే అవకాశాలున్నాయి. పొడిగింపు విషయమై ముఖ్యమంత్రి చేసిన విజ్ఞప్తికి ప్రధాని నరేంద్ర మోదీ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. అయితే, ఐఏఎస్‌ల సర్వీసు నిబంధనల ప్రకారం పదవీకాలాన్ని ఏడాదిపాటు ఒకేసారి పెంచే వెసులుబాటు లేదు. దీంతో పదవీకాలాన్ని మూడు నెలలకోసారి పొడిగించే అవకాశం ఉన్నట్లుగా అఖిల భారత సర్వీసు అధికారుల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుంచి రాజీవ్‌శర్మ సీఎస్‌గా కొనసాగుతున్నారు. ఈ ఏడాది మే నెలాఖరున ఆయన పదవీ కాలం ముగిసింది.
మూడు నెలలపాటు సీఎస్ పదవీకాలం పొడిగిస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆగస్టు 31న సీఎస్ పదవీకాలం ముగుస్తుంది. కొత్త రాష్ట్రం కావటంతో అనుభవజ్ఞుడైన అధికారి సేవలు మరికొంత కాలం అవసరమని, ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకొని రాజీవ్‌శర్మ పదవీకాలాన్ని పొడిగించాలని కేసీఆర్ ప్రధానిని కోరారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది మే 31 వరకు రాజీవ్‌శర్మ సీఎస్‌గా కొనసాగించే అవకాశాలున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఆయన తర్వాత సీఎస్ రేసులో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రదీప్ చంద్రకు ఈ అవకాశం లేకుండా పోయింది. ప్రదీప్ చంద్ర డిసెంబర్‌లో రిటైరవనున్నారు.
రాజీవ్‌శర్మ తరువాత సీఎస్ పదవి ఎవరిని వరిస్తుందనే ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. రాష్ట్ర కేడర్‌లో ఉన్న ఐఏఎస్‌ల్లో సీనియారిటీ ప్రకారం రాజీవ్‌శర్మ, ప్రదీప్ చంద్ర 1982 బ్యాచ్‌కు చెందినవారు. ఎస్‌పీ సింగ్, బీపీ ఆచార్య, ఆర్‌ఆర్ ఆచార్య, ఎంజీ గోపాల్, బినయ్‌కుమార్, వీకే అగర్వాల్, టి.రాధా 1983 బ్యాచ్‌కు చెందినవారు. వీరిలో టి.రాధా ఇప్పటికే రిటైరయ్యారు. హైకోర్టులో కేసు ఉందనే కారణంతో బీపీ ఆచార్యకు స్పెషల్ సీఎస్ పదోన్నతి పెండింగ్‌లో ఉంది. సీనియర్ అధికారి ఎంజీ గోపాల్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిటైర్ కానున్నారు. దీంతో రాజీవ్‌శర్మ తర్వాత బినయ్‌కుమార్, ఆర్ ఆర్ ఆచార్య, ఎస్‌పీ సింగ్ సీఎస్ రేసులో ఉంటారని ఐఏఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.