హైదరాబాద్‌లో యోగా కేంద్రం
- కేంద్ర ప్రభుత్వం సుముఖత
- ఆయుష్ మంత్రి శ్రీపద్‌ను కలసిన వేణుగోపాలాచారి
- శంషాబాద్ వద్ద స్థలం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడి
- నేచర్ క్యూర్ ఆసుపత్రి ఆధునీకరణకు ఆర్థికసాయం అందించాలని విజ్ఞప్తి
సాక్షి, న్యూఢిల్లీ:
హైదరాబాద్‌లో యోగా అధ్యయన, అభ్యాస కేంద్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఎస్.వేణుగోపాలాచారి శనివారం కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి శ్రీపద్ నాయక్‌ను కలసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా యోగాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రోత్సహిస్తున్నారని, అందులో భాగంగా హైదరాబాద్‌లో యోగా అధ్యయన, అభ్యాస కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని వేణుగోపాలాచారి మంత్రిని కోరారు. శంషాబాద్ విమానాశ్రయం వద్ద ఈ కేంద్రం ఏర్పాటుకు అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు.
ఎయిర్‌పోర్ట్ వద్ద ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే పక్కరాష్ట్రాల వారికి కూడా సౌకర్యంగా ఉంటుందన్నారు.పలు దశాబ్దాలుగా తెలంగాణలో యూనానీ మందుల వాడకం విరివిగా ఉందని మంత్రికి వివరించారు. అలాగే హైదరాబాద్‌లోని బేగంపేట వద్ద ఉన్న నేచర్ క్యూర్ ఆసుపత్రి ఆధునీకరణ పనులకు కేంద్రం ఆర్థికసాయం అందించాలని కోరారు. యోగా అధ్యయన, అభ్యాస కేంద్రం ఏర్పాటు చేయడానికి తగిన ప్రతిపాదనలు పంపితే వెంటనే అనుమతులను మంజూరు చేస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు.