ఫేస్బుక్లో అమ్మాయిలకు వల.. బ్లాక్మెయిల్
హైదరాబాద్: ఫేస్బుక్ ద్వారా పరిచయం చేసుకుని అమ్మాయిలను డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేస్తున్న మజీద్ అనే వ్యక్తిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అమ్మాయిల పేరుతో నకిలీ ఫేస్బుక్ ఎకౌంట్లు తెరిచి.. దాదాపు 200 అమ్మాయిలను మానసికంగా వేధించినట్టు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
18 నెలల నుంచి మజీద్ ఈ ఆగడాలు సాగిస్తున్నాడు. అమ్మాయిల పేరుతో నకిలీ ఫేస్బుక్ ఎకౌంట్లు ఓపెన్ చేసి కార్పొరేట్ స్కూళ్లలో చదువుతున్న టీనేజ్ అమ్మాయిలను లక్ష్యంగా చేసుకునేవాడు. అమ్మాయిలతో చాటింగ్ చేస్తూ వారి వ్యక్తిగత సమాచారం రాబట్టేవాడు. వారి నగ్న ఫొటోలు పంపమనేవాడు. అనంతరం డబ్బులు ఇవ్వకుంటే ఈ ఫొటోలను పోర్న్సైట్లో పెడతానంటూ వారిని బెదిరించాడు. ఫోన్ నెంబర్లు తీసుకుని అమ్మాయిల తల్లిదండ్రులను కూడా బ్లాక్ మెయిల్ చేశాడు. మీ అమ్మాయి నగ్న చిత్రాలు తన దగ్గర ఉన్నాయని, వీటిని ఆన్ లైన్ లో పెడతానని బెదిరించేవాడు. ఇలా ఓ అమ్మాయి నుంచి 86 వేల రూపాయలు వసూలు చేశాడు. తనను వెంకటేశ్వరరెడ్డిగా పరిచయం చేసుకున్న మజీద్ ఓ అమ్మాయిని ఇదేవిధంగా బ్లాక్ మెయిల్ చేసేందుకు ప్రయత్నించాడు. ఆ అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పడంతో వారు సైబరాబాద్ కమిషనర్ ను ఆశ్రయించారు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు వెలుగు చూసింది. సైబరాబాద్ పోలీసులు నిందితుడు మజీద్ను అరెస్ట్ చేశారు. మజీద్ చర్యల వల్ల ఎందరో అమ్మాయిలు మానసిక క్షోభ అనుభవించారని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. సోషల్ మీడియా వాడకం గురించి పిల్లలకు పాఠశాలల యాజమాన్యాలు, తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు చెప్పాలని సూచించారు.