దెయ్యాలంటూ.. అర్ధరాత్రి హల్‌చల్
హైదరాబాద్ : 'ఇది బూత్‌బంగ్లా.. ఇందులో దెయ్యాలున్నాయి' అంటూ అర్ధరాత్రి సమయంలో ఓ బంగ్లా వద్దకు వచ్చి హంగామా సృష్టిస్తున్న 25 మంది యువకులను పంజగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.... నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కొంత మంది యువకులు సోమాజిగూడ కుందన్‌బాగ్‌లోని ఓ పురాతన భవనం వద్దకు ఫొటోలు తీసుకున్నారు. వాటిని ఫేస్‌బుక్, వికీపీడియా యూట్యూబ్‌ల్లో పెట్టారు. 'ఇది బూత్‌బంగ్లా.. ఇందులో దెయ్యాలున్నాయి. ఎవరికైనా దమ్ముంటే అర్ధరాత్రి వేళ ఈ ఇంట్లోకి వెళ్లాలి' అంటూ సవాల్ విసురుతున్నారు.
అంతటితో ఆగకుండా అర్ధరాత్రి వేళ ఆ ఇంట్లోకి వెళ్లి బిగ్గరగా అరవడం, రాళ్లతో కొట్టడం, బాటిల్స్ విసరడం వంటివి చేస్తున్నారు. మరో ఇంట్లో ఉంటున్న ఆ ఇంటి యజమాని శారద ఇచ్చిన సమాచారంతో పోలీసులు నిఘా పెట్టారు. ఆదివారం అర్ధరాత్రి అక్కడ హంగామా సృష్టిస్తున్న 25 మంది యువకులను అదుపులోనికి తీసుకున్నారు. పంజగుట్ట ఏసీపీ వెంకటేశ్వర్లు సోమవారం వారికి కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు మళ్లీ ఇంటి చర్యలు తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోసారి ఇలాంటి తప్పు చేయమని ఆ యువకులతో ప్రమాణం చేయిం చారు. కాగా, ఆ బంగ్లాలో ఎలాంటి దుష్టశక్తులు లేవని, భయాందోళనకు గురికావద్దంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తామని చేయనున్నట్లు ఏసీపీ తెలిపారు.