సీఎం విశాఖలో ఉండి లాఠీఛార్జీ చేయించారు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని తెలుగు కార్మికులందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యాలయంలో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ జగన్.. వైఎస్ఆర్ టీయూసీ జెండా ఎగురవేశారు. దివంగత మహానేత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్లో కార్మికుల సంక్షేమం ప్రశ్నార్థకమైందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో ఉండగానే.. జీతాలు పెంచాలని కోరిన బ్రాండిక్స్ కార్మికులపై విచక్షణారహితంగా లాఠీఛార్జీ చేశారని విమర్శించారు. ముఖ్యమంత్రి విశాఖలోనే ఉండి కార్మికులపై లాఠీఛార్జీ చేయించారని ఆరోపించారు. సీఎం తీరు ఇలా ఉంటే న్యాయం కోసం ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు. కార్మికులంతా ఒక్కటవుదామని, మన రాజ్యం తెచ్చుకుందామని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 'ఎస్' అంటే శ్రామికులు అని గుర్తుచేశారు. యువత, శ్రామికులు, రైతులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏపీ, తెలంగాణ ట్రేడ్ యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. వివిధ కార్మిక సంఘాల నేతలను వైఎస్ జగన్ సన్మానించారు.