ఖమ్మం అర్బన్: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సారథ్యంలో ఈ నెల 10న నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో రైతు దీక్ష చేపట్టనున్నట్టు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆకుల మూర్తి తెలిపారు. శుక్రవారం ఖమ్మంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో దీక్షకు సంబంధించిన పోస్టర్‌లను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. రైతు దీక్షలో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతు సోదరులు పాల్గొని జయప్రదం చేయాలని మూర్తి పిలుపు నిచ్చారు.
ఆకాల వర్షాల వల్ల రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పంటలు చేతికందే దశలో నేలపాలయ్యాయన్నారు. ఇలాంటి పరిస్థితిలో రైతులకు అండగా ఉండాల్సిన పాలకులు పట్టించుకోక పోవడంతో వారు అప్పుల ఊబిలో చిక్కుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. టీఆర్‌ఎస్ అధికారంలొకొచ్చిన 11 నెలల్లోనే రాష్ట్రంలో 800 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటే పాలకులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి షర్మిలా సంపత్, జిల్లా అధికార ప్రతినిధి మందడపు వెంకటేశ్వరరావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు కీసర పద్మజారెడ్డి, నగర మహిళా విభాగం అధ్యక్షురాలు కొత్త గుండ్ల శ్రీలక్ష్మి తదితరులు పాల్గొని మాట్లాడారు.