మైనింగ్ ఆపకుంటే దీక్షకు దిగుతా: వైఎస్ జగన్
గుంటూరు: రైతుల కడుపుకొట్టి చెరువు మట్టితో టీడీపీ నేతలు వ్యాపారాలు చేస్తున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సుద్దపల్లిలో రైతుల దీక్షకు మద్దతు తెలిపిన వైఎస్ జగన్ అక్కడే ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ మూడు రోజులుగా చేబ్రోలు మండలం సుద్దపల్లిలో రైతులు దీక్ష చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికార పార్టీ నేతల అక్రమ క్వారీలకు వ్యతిరేకిస్తూ దీక్ష చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని అన్నారు. ఎమ్మేల్యే నరేంద్ర వ్యాపారానికి చంద్రబాబు మద్దతిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాకింత నీకింత అంటూ కమిషన్లు తీసుకుంటున్నారని చెప్పారు. చెరువులో మైనింగ్ వెంటనే ఆపేయాలని లేదంటే తానే దీక్ష చేస్తానని వైఎస్ జగన్ హెచ్చరించారు.