రైతు దీక్ష విజయవంతం: పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రైతు దీక్షను విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. సోమవారం పార్టీ ప్రధాన కార్యదర్శులు గాదె నిరంజన్ రెడ్డి, కె.శివకుమార్, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు పెద్ద పటోళ్ల సిద్ధార్థ రెడ్డి తదితరులు బంజారాహిల్స్ రోడ్ 10లోని ఎంపీ కార్యాలయంలో ఆయనను కలిశారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ఎత్తిన పిడికిలి దించొద్దు.. ఇదే స్ఫూర్తిని నాలుగేళ్ల పాటు కొనసాగించాల్సిందేనని అన్నారు. రైతులకు అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు.
దివంగత మహానేత వైఎస్సార్ పాలనను రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలు అనుక్షణం స్మరించుకుంటున్నారని తెలిపారు. ఈ విషయా న్ని గుర్తించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రెండవ విడత రైతు భరోసా యాత్రను అనంతపురం జిల్లాలో కొనసాగిస్తున్నారన్నారు. కష్టా ల్లో ఉన్న అన్ని జిల్లాల్లోని రైతాంగానికి భరోసా కల్పించేందుకు మరిన్ని కార్యక్రమాలు చేపట్టాల్సి ఉందని చెప్పారు. తెలంగాణలో వైఎస్సార్ సీపీ జెండా రెపరెపలాడేందుకు అందరూ కలసికట్టుగా పనిచేయాలని ఆయన పార్టీ వర్గాలకు పిలుపునిచ్చారు.