స్థానిక ఎన్నికలు ప్రతిష్టాత్మకం | ys jagan mohan reddy meeting with party leaders on local elections | Sakshi
Sakshi News home page

స్థానిక ఎన్నికలు ప్రతిష్టాత్మకం

Published Wed, Sep 7 2016 2:48 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

మంగళవారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో నేతలతో సమీక్షిస్తున్న వైఎస్ జగన్ - Sakshi

మంగళవారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో నేతలతో సమీక్షిస్తున్న వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్‌లో పాలకవర్గాలు ఖాళీగా ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు త్వరలో జరుగనున్న ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని...

పార్టీ నేతలతో వైఎస్ జగన్
సేవాదృక్పథం, విధేయత ప్రాతిపదికగా ఎంపిక
గెలుపే లక్ష్యంగా పని చేయాలి
యథాతథంగా ‘గడప గడపకూ వైఎస్సార్’
టీడీపీతో రాజీలేని పోరాటం: కన్నబాబు

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో పాలకవర్గాలు ఖాళీగా ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు త్వరలో జరుగనున్న ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, గెలుపే లక్ష్యంగా పని చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ నేతలను కోరారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో వెలువడుతుందని భావిస్తున్న నేపథ్యంలో ఆయన అధ్యక్షతన మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎన్నికలు జరిగే జిల్లాల అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సమన్వయకర్తలు, ముఖ్యనేతలతో ఆయన సమావేశమయ్యారు.

ఎక్కడెక్కడ సమస్యలున్నాయో పార్టీ నేతలు సమష్టిగా కూర్చుని చర్చించి వాటిని అధిగమించేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. ఆలస్యం చేయకుండా ఈ నెల 11వ తేదీ నుంచే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన సన్నాహక కార్యక్రమాలు మొదలు పెట్టాలని కూడా జగన్ కోరారు. మూడు గంటలపాటు సాగిన ఈ సమావేశానంతరం వివరాలను తూర్పు గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు విలేకరులకు వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడో జరగాల్సి ఉన్నా రాష్ట్ర ప్రభుత్వమే జాప్యం చేస్తూ వచ్చిందని విమర్శించారు.

ఇపుడు కూడా కోర్టు ఆదేశాల మేరకు నవంబర్ నెలాఖరు వరకూ జరిపి తీరాల్సి ఉందన్నారు. సేవాదృక్పథం, పార్టీ పట్ల విధేయత ప్రాతిపదికగా అభ్యర్థుల ఎంపికజరగాలని జగన్ సూచించినట్లు చెప్పారు. ఎన్నికల్లో ఇతర పార్టీలతో కలిసి పని చేసే అంశంపై తరువాత నిర్ణయం తీసుకుంటామని కూడా తమ అధ్యక్షుడు చెప్పారని తెలిపారు. అలాగే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘గడప గడపకూ వైఎస్సార్’ కార్యక్రమాన్ని మున్సిపల్ ఎన్నికల పేరుతో నిలిపి వేయరాదని, యథాతథంగా కొనసాగించాల్సిందేనని జగన్ సూచించారని ఆయన చెప్పారు.

టీడీపీతో రాజీలేని పోరాటం
రాష్ట్రంలో ప్రజా కంటకమైన పాలన సాగిస్తున్న టీడీపీపై వైఎస్సార్ కాంగ్రెస్ రాజీలేని పోరాటం చేస్తుందని కన్నబాబు తెలిపారు. గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో తాము తిరుగుతున్నపుడు తమకన్నా ముందుగా ప్రజలు బాబు మోసాల గురించి ఏకరువు పెడుతున్నారని చెప్పారు. ఓటర్ల తనిఖీ పేరుతో వేలా ది ఓట్లను తొలగించినట్లుగా సమాచారం ఉందని, అందువల్ల పార్టీ శ్రేణులు ఇప్పటినుంచే రంగంలోకి దిగి సరిచూసుకోవాలని సూచించారు. తుని పరిసరాల్లో దివీస్ లాబొరేటరీ కోసం రైతుల భూములను బలవంతంగా సేకరించాలని చూడటం దారుణమని కన్నబాబు విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement