హైదరాబాద్: పెద్దనోట్ల రద్దు వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందుల విషయంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరినట్టు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. నోట్ల రద్దు తదనంతర పరిస్థితులు, ప్రజల ఇబ్బందులను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. పార్టీ ప్రతినిధుల బృందంతో కలిసి వైఎస్ జగన్ మంగళవారం రాజ్‌భవన్‌లో తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 15.25 లక్షల కోట్ల విలువచేసే పాతనోట్లను రద్దు చేయగా.. అందులో కేవలం రూ. 5.5లక్షల కోట్ల కొత్త కరెన్సీ మాత్రమే ఆర్బీఐ పంపిణీ చేసిందని అన్నారు. రద్దు చేసిన నోట్ల విలువతో పోలిస్తే.. ఇది 33శాతం మాత్రమేనని పేర్కొన్నారు. నోట్ల రద్దు తర్వాత ఆంధ్రప్రదేశ్‌ళో రూ. 60వేల కోట్లకుపైగా పాతనోట్లు డిపాజిట్ అయ్యాయని, కానీ ఈ నెల 15వరకు కేవలం రూ. 14,740 కోట్లు మాత్రమే రాష్ట్రానికి వచ్చాయని చెప్పారు. ఏపీ జనాభా ప్రకారం రాష్ట్రానికి రూ. 24వేల కోట్ల కొత్త కరెన్సీ రావాల్సిన అవసరముందన్నారు. పాతనోట్ల డిపాజిట్లకు అనుగుణంగా కొత్త కరెన్సీ అందుబాటులోకి రాకపోతే.. అసంఘటిత రంగానికి చెందిన రైతులు, రైతుకూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముందని పేర్కొన్నారు. నోట్ల రద్దు విషయంలో ప్రజల కష్టాలను చంద్రబాబు పట్టించుకోవడం లేదని, కనీసం మీరైనా స్పందించి రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా డబ్బులు వచ్చేలా చూడాలని గవర్నర్‌ను కోరినట్టు చెప్పారు.
నోట్ల రద్దు విషయం చంద్రబాబుకు ముందే తెలుసునని, అందువల్లే ఆయన, ఆయన అనుచరులు ఈప్రభావం పడకుండా ముందుగానే అన్నీ చక్కబెట్టుకున్నారని వైఎస్ జగన్ అన్నారు. నోట్ల రద్దుపై ప్రధాని మోదీ ప్రకటన చేయడానికి కేవలం రెండురోజుల ముందే హెరిటేజ్ షేర్లను ఫ్యుచర్ గ్రూప్‌కు చంద్రబాబు అమ్ముకున్నారని పేర్కొన్నారు. నోట్ల రద్దు విషయం ముందే తెలియడంతోనే ఈ విషయంలోనూ క్రెడిట్ కోసం ఆయన ప్రధానికి లేఖ రాశారని అన్నారు.