19న ‘సీఆర్‌డీఏ’ గ్రామాల్లో జగన్ పర్యటన
‘భూ సమీకరణ’ బాధితులకు ప్రతిపక్ష నేత అండ
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 19న రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోని గ్రామాల్లో పర్యటించనున్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. సీఆర్‌డీఏ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం మొండిగా తమ భూములను లాక్కునేందుకు ప్రయత్నించడాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే ఆ ప్రాంతంలో రైతులు 33 వేల ఎకరాలను ల్యాండ్ పూలింగ్‌కు (సమీకరణకు) ఇచ్చారని ప్రభుత్వమే ప్రకటించింది.
పూలింగ్‌కు ఇవ్వకుండా వ్యవసాయాన్నే నమ్ముకున్న రైతుల వద్ద మిగిలి ఉన్న భూములను కూడా ఇప్పుడు భూసేకరణ పేరిట లాక్కునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుండడం దుర్మార్గమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఆర్‌డీఏ పరిధిలో బలవంతపు భూసేకరణ వల్ల భూములను కోల్పోతున్న రైతులకు అండగా నిలవడానికి జగన్ అక్కడ పర్యటిస్తారని రామకృష్ణారెడ్డి వివరించారు. బాధిత రైతాంగంతో ముఖాముఖి మాట్లాడుతారని తెలిపారు. ఇప్పటికే భూములను త్యాగం చేసిన రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శించారు.