నిరుద్యోగులకు సీఎం బకాయి 1.22 లక్షల కోట్లు | YS Jagan's open letter to CM Chandrababu | Sakshi
Sakshi News home page

నిరుద్యోగులకు సీఎం బకాయి 1.22 లక్షల కోట్లు

Published Sun, May 7 2017 1:41 AM | Last Updated on Sat, Jul 28 2018 3:39 PM

నిరుద్యోగులకు సీఎం బకాయి 1.22 లక్షల కోట్లు - Sakshi

నిరుద్యోగులకు సీఎం బకాయి 1.22 లక్షల కోట్లు

వెంటనే చెల్లించాలని సీఎంకు వైఎస్‌ జగన్‌ బహిరంగ లేఖ
- ఎన్నికల్లో వారికిచ్చిన వాగ్దానాలు నెరవేర్చండి
- ఇంటికో ఉద్యోగం.. నెలకు రూ.2వేల భృతి ఎక్కడ?
- ఇప్పటికే ఒక్కో నిరుద్యోగికీ రూ.70 వేలు ఇవ్వాలి
- నిరుద్యోగుల గోడు వినే తీరిక చేసుకోండి
- ప్రభుత్వోద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోండి
- గ్రూప్‌–2 అభ్యర్థులు ఏం చెబుతున్నదీ వినిపించుకోండి
- ఉపాధి లేక వలసలు పోతున్నా కనిపించడం లేదా?
- నిరుద్యోగులలో అసంతృప్తి సమాజానికి మంచిది కాదు
- ఉద్యోగాలివ్వకపోగా ఉన్నవి తీసేస్తారా..
- మీ నుంచి స్పందన లేకే మరో లేఖ రాస్తున్నా..


సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నిరుద్యోగులకు రూ. 1.22 లక్షల కోట్లు బకాయి ఉన్నారని వైఎస్సార్సీపీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇంటికో ఉద్యోగమిస్తామని, నెలనెలా రూ. 2వేల చొప్పున నిరుద్యోగ భృతి కల్పిస్తామని వాగ్దానం చేసిన చంద్రబాబు నేటికీ వాటిని నెరవేర్చలేదని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు రాష్ట్రంలోని నిరుద్యోగుల గోడు వినేందుకు తీరిక చేసుకోవాలని, ఎన్నికల్లో వారికి చేసిన వాగ్దానాలు నెరవేర్చాలని, బకాయిలు చెల్లించడంతో పాటు నెల నెలా రూ.2000 నిరుద్యోగ భృతిని చెల్లించాలని జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ప్రభు త్వోద్యోగాల భర్తీకి వెంటనే చర్యలు తీసుకో వాలని కోరారు. ఈమేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఒక బహిరంగ లేఖను రాశారు. శనివారం రాత్రి ఈ లేఖను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ కేంద్ర కార్యాలయం పత్రికలకు విడుదల చేసింది. లేఖలో ఏమున్నదంటే..

నిరుద్యోగుల గోడు వినే తీరిక లేదా?
‘‘ఎన్నికల సమయంలో మీరు ఇంటికో ఉద్యోగం/ఉపాధి కల్పిస్తానని, అది దొరికేంత వరకూ ప్రతి ఇంటికీ రూ.2000 నిరుద్యోగ భృతి ఇస్తానని వాగ్దానం చేశారు. జాబు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలం టూ మీరే ఊరూరా ఊదరగొట్టారు. నరేంద్ర మోదీ, పవన్‌ కల్యాణ్‌లు మీ వాగ్దానాలను బలపర్చినట్లుగా స్వయంగా మీరు సంతకం చేసి ఇంటింటికీ కరపత్రాన్ని పంచారు. 2014 జూన్‌లో మీరు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మే 2017 వరకూ 35 నెలలు గడిచి పోయాయి. అయినా ఏ ఒక్కరికీ నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ఇవే విషయాలను ప్రస్తావి స్తూ ఈ ఫిబ్రవరి 22న మీకు బహిరంగ లేఖ రాశాను. అయినా మీ ప్రభుత్వంలో చలనం లేదు. నిరుద్యోగభృతి అంటూ ఈ మార్చిలో ప్రవేశ పెట్టిన 2017–18 బడ్జెట్‌లో ప్రకటించి కూడా నిరుద్యోగులకు ఈ రోజు వరకూ ఇంటి కి రూ 2000లు ఇచ్చే బాధ్యతను నెరవేర్చ లేదు. మొక్కుబడిగా మీరు గ్రూప్‌ పరీక్షలు జరుపుతున్నారు కాబట్టే నిరుద్యోగుల్లో భరోసా గాని, ఆశ గానీ కనిపించడం లేదు.

మీరు గానీ, మీ ఆధ్వర్యంలోని ఏపీపీఎస్సీ అధికారులు గానీ నిరుద్యోగుల గోడును, వారి అభిప్రాయాలను పట్టించుకునే పరిస్థితిలో లేరు. తీవ్ర ఆందోళనలో ఉన్న గ్రూప్‌–2 అభ్యర్థులు ఏం చెబుతున్నారన్నది వినిపించుకునేందుకు కూడా మీ ప్రభుత్వం సిద్ధంగా లేక పోవటం నన్నెంతగానో బాధించింది. ఈ నేపథ్యంలో , నిరుద్యోగుల అభిప్రాయాలకు విలువ ఇవ్వాలని కోరుతున్నాను. ప్రభుత్వోద్యోగాలన్నింటి భర్తీకి వెంటనే చర్యలు తీసుకోండి. వారికి ఇప్పటి వరకు చెల్లించాల్సిన నిరుద్యోగ భృతిని బకాయిలతో సహా చెల్లించండి అని మరోసారి అడుగుతూ ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను.

మీ నిర్లక్ష్యం..నిరుద్యోగులకు ప్రాణ సంకటం..
ఈ 35 నెలల కాలంలో నిరుద్యోగులకు మీరు పడిన బకాయి ఇంటింటికీ ఇప్పటికే రూ 70 వేల మేరకు ఉంది. ఆ బకాయిని వెంటనే చెల్లించడంతో పాటుగా రాష్ట్రంలోని మొత్తం 1 కోటి 75 లక్షల ఇళ్ల వారికి కుల, మత , ప్రాంత, పార్టీ భేదాలకు అతీతంగా నిరుద్యోగ భృతి చెల్లించండి. 35 నెలలుగా 1 కోటి 75 లక్షల ఇళ్లకు రూ.2000 మేరకు మీరు చెల్లించాల్సిన బకాయీ రూ.1 లక్షా 22 వేల కోట్ల మేరకు ఉంది. మీరు ఇస్తానన్న నిరుద్యోగ భృతిలో గాని, ఇళ్ల సంఖ్యలో గాని కోతలు పెట్టకుండా భృతి ఇవ్వండి. ఎన్ని ఉద్యోగాలున్నాయి అనే విషయం మీద సమాచారం మీ వద్ద ఉన్నా దానిని ఎందుకు మరుగు పరుస్తున్నారు? రాష్ట్ర విభజన జరిగేనాటికి ఏపీ ప్రభుత్వంలో రాష్ట్ర స్థాయి, మల్టీ జోనల్, జోనల్, జిల్లా స్థాయిల్లో మొత్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలు 1,42,828.

ఈ పోస్టుల భర్తీ మీద మీ ప్రభుత్వ విధానం ఏమిటన్న ప్రశ్నకు మూడేళ్లు గడిచిపోయినా నిరుద్యోగులకు సమాధానం రావడం లేదు. గత ఏడాది 10 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ జరిగినా ఇంకా 17 వేలకు పైగా పోస్టుల భర్తీ జరగాల్సి ఉంది. ఈ పోస్టులన్నింటితో పాటు ఖాళీగా ఉన్న పోలీసు తదితర ఉద్యోగాల నోటిఫికేషన్లు ఎందుకు ఇవ్వడం లేదన్నది మీకే బాగా తెలుసు. ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కటంలో మీకు ఉన్న అనుభవం నిరుద్యోగులకు ప్రాణ సంకటంగా మారుతోందన్న విషయాన్ని ఇప్పటికైనా గమనించాలని కోరుతున్నాను.

ఉన్నవి ఊడబెరికారు..మానవత్వం ఉందా..?
పైగా... మీరు అధికారంలోకి రాగానే 6000 మంది ఆదర్శ రైతులను, 1500 మంది గృహ నిర్మాణ శాఖ వర్క్‌ ఇన్స్‌పెక్టర్లను, గ్రామీణా భివృద్ధి శాఖలో కంప్యూటర్‌ ఆపరేటర్లుగా పనిచేస్తున్న 2106 మందిని, ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్‌ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న 4000 మందిని, ఆయుష్‌లో 800 మందిని, ఆరోగ్య మిత్రలుగా పనిచేస్తున్న 1900 మందిని తొలగించారు. బాబు వచ్చాడు జాబు పోయిందని ఈ కుటుంబాల వారంతా విలవిలలాడుతున్నా మీకు కనీస కనికరం, మానవత్వం లేదు.  తీవ్ర నిరుద్యోగం, నిరుద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి ఏ సమాజానికీ మంచిది కాదు. ఉపాధి లభించక ప్రజలు భారీ సంఖ్యలో వేరే రాష్ట్రాలకు వలస పోతున్న పరిస్థితి రాష్ట్రమంతా కనిపిస్తోంది. ఈ లేఖలో గొంతెమ్మ కోర్కెలు లేవు. మీరు ఇచ్చిన మాటనే మీరు మూడేళ్లుగా మరిచి పోవటం వల్ల మరోసారి ఈ ఉత్తరం రాస్తున్నాను.’’ అని ఆ లేఖలో జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.

ఎన్ని హామీలో..  ఒక్కటన్నా నెరవేర్చారా?
మీ ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగులకు మీరు ఇచ్చిన వాగ్దానాల్లో మరి కొన్నింటి గతి ఏమయిందో గమనించడానికి వీలుగా వాటిని ఉదహరిస్తున్నాను.
► ప్రతి జిల్లా కేంద్రంలో రాష్ట్ర, కేంద్ర సర్వీ సులకు,  ప్రభుత్వ రంగ సంస్థలకు, బ్యాంకుల పోటీ పరీక్షలకు, శిక్షణ ఇప్పిం చేందుకు, స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేస్తాం.
► ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేస్తాం. పబ్లిక్‌ సర్వీ స్‌ కమిషన్‌ ఛైర్మన్‌గా ఉన్నత చదువులు చదివిన వారిని, నీతి నిజాయితీ కలిగిన వారిని సమర్థులను నియమించి ఉద్యోగ నియామకాలు, పారదర్శకంగా జరిగేటట్లు చర్యలు తీసుకుంటాం.
► ప్రతి సంవత్సరం రిక్రూట్‌మెంట్‌ క్యాలండర్‌ను ప్రకటింపజేసి నిర్ణీత సమయాల్లో ఉద్యోగ నియామకాలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటాం.
► ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తు ఫారాలకు ఎటువంటి అప్లికేషన్‌ ఫీజు ఉండదు. ప్రభుత్వ ఉద్యోగాలకు రాత పరీక్ష, మౌఖిక పరీక్షలకు ఉచిత బస్‌పాస్‌ సౌకర్యం కల్పిస్తాం.
► నిరుద్యోగులకు స్వయం ఉపాధి కొరకు లక్ష రూపాయల లోపు రుణాలను వడ్డీ లేకుండా బ్యాంకుల ద్వారా ఏర్పాటు చేయిస్తాం.
► నిరుద్యోగులకు రూ.లక్షకు పైగా రూ.50 లక్షల వరకూ మూడు శాతం వడ్డీ రాయితీతో బ్యాంకు రుణాలు ఏర్పాటు చేస్తాం.
► ఖాళీగా ఉన్న అన్ని ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, ప్రతి సంవత్సరం డీఎస్సీని నిర్వహిస్తాం’ ఈ వాగ్దానాల్లో ఒక్కటంటే ఒక్కటి అమలయితే ఒట్టు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement