వైఎస్‌ఆర్ మరణించలేదు: రఘువీరా
Published Sat, Jul 8 2017 12:32 PM | Last Updated on Sat, Jul 7 2018 3:19 PM
హైదరాబాద్: దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 68వ జయంతి సందర్భంగా నగరంలోని ఇందిరాభవన్‌లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, రఘువీరారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కేవీపీ, పళ్లం రాజు, దానం నాగేందర్, షబ్బీర్‌అలీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అత్యంత చరిష్మా ఉన్న నాయకులు.
గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీని నిలబెట్టిన నాయకుడు. దేశంలో ఎవరు చేయని విదంగా సంక్షేమ, అబివృద్ది కార్యక్రమాలను విజయవంతంగా చేపట్టిన వ్యక్తి ఆయన. ఉచిత విద్యుత్, ఉచిత విద్య, ఆరోగ్యశ్రీ , లక్షలాది ఎకరాలకు సాగు నీరు అందించే ప్రాజెక్ట్‌లు అందించిన ఘనత ఆయనది. ఎమ్మెల్యేలకే కాదు, సామాన్య ప్రజానీకానికి అందుబాటులో ఉన్న ఏకైక ముఖ్యమంత్రి. ఆయన బాటలోనే 2019లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి కృషిచేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ మరణించలేదు. తెలుగురాష్ట్రాల ప్రజల గుండెల్లో గుడికట్టుకొని ఉన్నారు. ప్రతీ సంక్షేమ కార్యక్రమంలో ఆయన ముద్ర ఉంది. కాంగ్రెస్ పుస్తకంలో ప్రత్యేక పేజీ సంపాదించాడు. నాయకత్వం అంటే ఏమిటో రాబోయే తరాలకు చూపించిన మహనేత అని గుర్తుచేసుకున్నారు.
Advertisement
Advertisement