‘హోదా’ కోసం 10న కలెక్టరేట్ల వద్ద ధర్నాలు | YSR Congress Party Status on 10th may Collectorates Protests | Sakshi
Sakshi News home page

‘హోదా’ కోసం 10న కలెక్టరేట్ల వద్ద ధర్నాలు

Published Fri, May 6 2016 2:55 AM | Last Updated on Mon, Feb 17 2020 5:16 PM

‘హోదా’ కోసం 10న కలెక్టరేట్ల వద్ద ధర్నాలు - Sakshi

‘హోదా’ కోసం 10న కలెక్టరేట్ల వద్ద ధర్నాలు

* వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు
* తూర్పు గోదావరి జిల్లాలో ధర్నాలో పాల్గొననున్న విపక్ష నేత వైఎస్ జగన్
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మరింత ఒత్తిడే లక్ష్యం
* ప్రజా ఉద్యమంగా ప్రత్యేక హోదా ఆందోళన: బొత్స

సాక్షి, హైదరాబాద్: విభజన తరువాత దారుణంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని విధాలా సంజీవని అయిన ప్రత్యేక హోదా కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల 10వ తేదీన అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు నిచ్చింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్‌సిన్హా తేల్చిచెప్పిన నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, విపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో సమావేశమయ్యారు.

ప్రత్యేక హోదా డిమాండ్‌తో ఆందోళన చేయాలని నిర్ణయించారు. అనంతరం పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథితో కలసి కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందిగా కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచడానికి ఈ ధర్నాను చేపడుతున్నట్లు చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం నిష్క్రియాపరత్వాన్ని విడనాడి హోదా కోసం కేంద్రంతో గట్టిగా పోరాడాలని కూడా ఈ ధర్నా ద్వారా కోరతామన్నారు. పదో తేదీన 13 జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఉదయం 11 గంటలకు తమ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించి కలెక్టర్లకు వినతిపత్రాలను సమర్పిస్తామని తెలిపారు. వైఎస్ జగన్ తూర్పు గోదావరి జిల్లాలో జరిగే ధర్నాలో పాల్గొంటారని వెల్లడించారు. ఈ ఆందోళన ఇంతటితో ఆగదని, భవిష్యత్తులో దీన్నొక ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకెళతామని బొత్స వివరించారు. ఐదు కోట్ల ఏపీ ప్రజల ప్రయోజనాలు ఇమిడి ఉన్న అంశం కనుక ఈ ధర్నాలకు ప్రజలు పూర్తి మద్దతు తె లియజేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
 
చంద్రబాబు నోరెందుకు మెదపడం లేదు?
తొలి నుంచీ ప్రత్యేక హోదా కోసం గట్టిగా అడగాలని, పోరాడాలని వైఎస్సార్‌సీపీ చెబుతూ ఉంటే చంద్రబాబు తాత్సారం చేస్తూ వస్తున్నారని బొత్స విమర్శించారు. ‘కేంద్రం వైఖరి వెల్లడైన తర్వాత కూడా చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదు? అసలు టీడీపీ ప్రభుత్వ వైఖరి ఏమిటి?’ అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా ? లేక తన వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యమా? అని తాము సూటిగా ప్రశ్నిస్తున్నామని, సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ‘ప్రత్యేక హోదా కోసం ఓ వారం రోజులు, లేదా కనీసం ఓ రెండురోజులు రాష్ట్రంలో రైల్వేలతో సహా స్తంభింపజేద్దాం సిద్ధమేనా? మాతో కలసి వస్తారా?’ అని బొత్స అధికారపక్షాన్ని ప్రశ్నించారు.

తమ నేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలోనూ, రాష్ట్రంలోనూ పోరాటం చేస్తున్నారని, అవకాశం ఉన్న ప్రతి వేదికపైనా ఈ అంశాన్ని లేవనెత్తుతున్నారని తెలిపారు. నిన్నటికి నిన్న తెలంగాణలో ఏపీ ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రాజెక్టులు కడుతూ ఉంటే చంద్రబాబు పట్టించుకోలేదని, జగన్ కర్నూలులో దీక్ష చేస్తానన్న తరువాతే మాట్లాడారని గుర్తుచేశారు. ఇతర రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలను చూసి, వారు తమ ప్రాంత సమస్యలు వచ్చినప్పుడు ఎలా పోరాడతారో చూసి.. చంద్రబాబు నేర్చుకోవాలని బొత్స సూచించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement