
త్వరలో మా అభ్యర్థిని ప్రకటిస్తాం
హైదరాబాద్ : వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని తెలంగాణ వైఎస్ఆర్ సీపీ నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ వైఎస్ఆర్ సీపీ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వరంగల్ ఉప ఎన్నికపై చర్చించారు.
భేటీ అనంతరం పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వరంగల్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీలకు గుణపాఠం తప్పదన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని ఆయన అన్నారు. తమ అభ్యర్థిని త్వరలో ప్రకటిస్తామని, విజయం తమదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.