కేసీఆర్ ఆత్మవిమర్శ చేసుకోవాలి: గట్టు
వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు
హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఈ రెండేళ్ల పాలనపై ఆత్మవిమర్శ చేసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. గురువారం తెలంగాణ ఆవిర్భావ వేడుకలు లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. త్రివర్ణపతాకాన్ని ఎగురవేసిన అనంతరం అమరవీరులకు నివాళులు అర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి మాట్లాడుతూ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం భారీ ప్రకటనలు గుప్పించి పలు పథకాలపై ప్రచారం చేసుకుందన్నారు. అందులో ఏ ఒక్కటి కూడా పూర్తి కాలేదని విమర్శించారు. రైతు రుణమాఫీ 50% కూడా పూర్తికాకుండానే పూర్తి చేసినట్లు చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రం ఏర్పడటం 60 ఏళ్ల ఆకాంక్ష అయితే.. ఇందుకు 1,100 మంది ఆత్మబలిదానాలు చేసుకున్నారని అన్నారు.
తీరా చూస్తే 300 మందిని కూడా గుర్తించే పరిస్థితి లేదన్నారు. అమరులను స్వాతంత్య్ర సమరయోధులుగా గుర్తిస్తామన్నారని చెప్పారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి కె. శివకుమార్, జె. మహేందర్‌రెడ్డి, మతిన్, బ్రహ్మానందరెడ్డి, విజయ్‌ప్రసాద్, రమా ఓబుల్‌రెడ్డి, వెల్లాల రాంమోహన్, గ్రేటర్ అద్యక్షుడు బొడ్డు సాయినాథ్‌రెడ్డి, రఘురాంరెడ్డి, మహిళా అధ్యక్షురాలు అంబికా సాగర్, సేవాదళ్ అధ్యక్షుడు బంగారు వెంకటరమణ, దుబ్బాక గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీలో చేరికలు: ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన యువకులు పెద్ద సంఖ్యలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు మతిన్ ఆధ్వర్యంలో సయ్యద్ నౌసల్, సయ్యద్ కరీం, చంద్రశేఖర్, సురేందర్, రోహిత్ తదితరులతో పాటు భారీ సంఖ్యలో యువకులు పార్టీలో చేరారు. వీరందరికీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి ఘనంగా ఆహ్వానించారు.