self criticism
-
overthinkers club: అతిగా ఆలోచన ఆనందానికి శత్రువు
‘నేను చేసింది తప్పేమో’ ‘నేను చేసిన పని వల్ల ఇలా అవుతుందేమో’ ‘వాళ్లు అలా చేస్తే ఏం చేయాలి?’ ‘నా పరువు పోతుందేమో’... చిన్న చిన్న కారణాలకు కూడా ఎంతో ఆలోచిస్తూ బాధ పడుతూ ఉంటారు కొందరు. దీనిని ‘ఓవర్‌థింకింగ్’ అంటారు మానసిక నిపుణులు. ‘ఇలాంటివారిని ఒకచోట చేర్చి ఆలోచనలు పంచుకుంటే ధైర్యం వస్తుంది’ అంటుంది వర్షా విజయన్. ఈమె మొదలు పెట్టిన ‘ఓవర్‌థింకర్స్ క్లబ్’ ఇలాంటి క్లబ్‌ల అవసరాన్ని తెలియచేస్తోంది. ‘ఓ మీరూ అంతేనా?’ అంది ఒక మహిళ ఆ పార్క్‌కు వచ్చిన మరో మహిళతో. తిరువనంతపురానికి చెందిన 27 ఏళ్ల వర్షా విజయన్ ‘ఓవర్‌థింకర్స్ క్లబ్’ను ప్రారంభించింది. ఇదేదో ఒక భవంతో, క్లినిక్కో కాదు. పార్కులో కొంతమంది కలవడమే. సోషల్ మీడియా ద్వారా ఈ క్లబ్ గురించి ఆమె ప్రచారం చేసింది. ‘ప్రతి దానికీ తీవ్రంగా ఆలోచించే మనం ఈ ఆలోచనల నుంచి బయటపడదాం రండి’ అనే ఆమె పిలుపునకు స్పందించిన స్త్రీ, పురుషులు రకరకాల వయసుల వాళ్లు వారానికి ఒకసారో నెలలో రెండుసార్లు కలవసాగారు. ‘జీవితంలో మార్పులు సహజం. కాని జరగబోయే మార్పు గురించి చదువు, ఉద్యోగం, వివాహం, విడాకులు, పిల్లల ఆరోగ్యం లేదా తల్లిదండ్రుల చివరి రోజులు... వీటి గురించి రోజుల తరబడి ఆలోచిస్తూ ఉంటారు కొందరు. ఆ ఆలోచనలు పాజిటివ్ వైపు కాకుండా నెగెటివ్ వైపుగా వెళ్లడంతో ఆందోళన చెందుతుంటారు. దాని వల్ల డిప్రెషన్ వస్తుంది. అన్నింటికీ మించి ఏ నిర్ణయమూ జరక్క ఏ పనీ ముందుకు కదలదు. వర్తమానంలో ఉండే ఆనందాన్ని అనుభవించక ఎప్పుడో ఏదో నష్టం జరుగుతుందేమోనన్న ఆందోళనతో బాధ పడుతుంటారు ఓవర్‌థింకర్లు’ అంటుంది వర్షా విజయన్. ఆలోచన.. అతి ఆలోచన ‘ఆలోచన మంచిదే. కాని అతి ఆలోచన మంచిది కాదు’ అంటుంది వర్షా విజయన్. ఓవర్‌థింకర్ల క్లబ్‌కు హాజరైన వారు ఒకరి మాటల్లో మరొకరు తెలుసుకునే విషయం ఏమిటంటే తమ చేతుల్లో లేని వాటి గురించి కూడా అధికంగా ఆలోచించడం. ఉదాహరణకు ఎప్పుడో పెట్టుకున్న శుభకార్యం రోజు వాన పడితే... వాన పడితే... వాన పడితే అని ఆలోచించడం. వానను ఆపడం మన చేతుల్లో లేదు. పడితే పడుతుంది... లేకపోతే లేదు. పడినప్పుడు అందుకు తగ్గ సర్దుబాట్లతో పనులు అవసరం అవుతాయి. అలా అనుకుని వదిలేయాలిగాని అదే పనిగా ఆలోచించడం ఆరోగ్యం కాదు. దాని వల్ల ఇవాళ్టి ఆనందాలు మిస్ అవుతాయి. ధ్యాస మళ్లించాలి ఓవర్‌థింకర్లు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మెరుగ్గా ఉండొచ్చు అంటుంది వర్షా విజయన్ ► అతిగా ఆలోచించే చాలా విషయాలు పడే భయాలు దాదాపుగా నిజం కావు. పిల్లల్ని స్కూల్‌బస్ ఎక్కించాక దానికి ప్రమాదం జరిగితే.. ప్రమాదం జరిగితే అని ఆలోచించడం మంచిది కాదు. అలా లక్షసార్లలో ఒకసారి జరుగుతుంది. ఆ ఒకసారి గురించి అతి ఆలోచన చేయకూడదు ► ఎక్కువ ఆత్మవిమర్శ చేసుకోకుండా ఏదో ఉన్నంతలో బెస్ట్ చేద్దాం... చేశాం అని ముందుకెళ్లాలి. ఏదో ఒక మేరకు సంతృప్తి చెంది పని జరిగేలా చూడాలి ► ఆలోచనలు శ్రుతి మించుతుంటే స్నేహితులతో మాట్లాడాలి. చెప్పుకోవాలి. కొత్త పనులేవైనా నేర్చుకుని ధ్యాస మళ్లించాలి ∙సోషల్ మీడియాలో పనికిమాలిన పరిజ్ఞానం, వీడియోలు తగ్గించాలి ► ఈ క్షణంలో ఉండటం ప్రాక్టీస్ చేయాలి. అందుకు యోగా ఉపయోగపడుతుంది ► అన్ని మనం అనుకున్నట్టుగా జరగవు అనే వాస్తవాన్ని యాక్సెప్ట్ చేయాలి. సమస్య ఎదురైనప్పుడు చూసుకుందాంలే అనుకుని ధైర్యంగా ఉండాలి. ఓవర్‌థింకర్ల లక్షణాలు ► ఆత్మవిమర్శ అధికంగా చేయడం ► ఒక పని పూర్తిగా లోపరహితంగా చేయాలనుకోవడం (పర్ఫెక్షనిజం) ► జరిగిపోయిన ఘటనలు, మాటలు తలచుకుని వాటిలో ఏమైనా తప్పులు జరిగాయా, పొరపాట్లు జరిగాయా, వాటి పర్యవసానాలు ఏమిటి అని తల మునకలు కావడం ► ప్రయాణాల్లో ప్రమాదాలు ఊహించడం ► శుభకార్యాలప్పుడు అవి సరిగ్గా జరుగుతాయో లేదోనని ఆందోళన చెందడం ► చిన్న చిన్న సమస్యలకు కూడా పెద్ద పర్యవసానాలు ఊహించడం ► ఎవరికీ చెప్పుకోక ఆ ఆందోళనల్లోనే రోజుల తరబడి ఉండటం. -
కేసీఆర్ ఆత్మవిమర్శ చేసుకోవాలి: గట్టు
వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఈ రెండేళ్ల పాలనపై ఆత్మవిమర్శ చేసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. గురువారం తెలంగాణ ఆవిర్భావ వేడుకలు లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. త్రివర్ణపతాకాన్ని ఎగురవేసిన అనంతరం అమరవీరులకు నివాళులు అర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి మాట్లాడుతూ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం భారీ ప్రకటనలు గుప్పించి పలు పథకాలపై ప్రచారం చేసుకుందన్నారు. అందులో ఏ ఒక్కటి కూడా పూర్తి కాలేదని విమర్శించారు. రైతు రుణమాఫీ 50% కూడా పూర్తికాకుండానే పూర్తి చేసినట్లు చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రం ఏర్పడటం 60 ఏళ్ల ఆకాంక్ష అయితే.. ఇందుకు 1,100 మంది ఆత్మబలిదానాలు చేసుకున్నారని అన్నారు. తీరా చూస్తే 300 మందిని కూడా గుర్తించే పరిస్థితి లేదన్నారు. అమరులను స్వాతంత్య్ర సమరయోధులుగా గుర్తిస్తామన్నారని చెప్పారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి కె. శివకుమార్, జె. మహేందర్‌రెడ్డి, మతిన్, బ్రహ్మానందరెడ్డి, విజయ్‌ప్రసాద్, రమా ఓబుల్‌రెడ్డి, వెల్లాల రాంమోహన్, గ్రేటర్ అద్యక్షుడు బొడ్డు సాయినాథ్‌రెడ్డి, రఘురాంరెడ్డి, మహిళా అధ్యక్షురాలు అంబికా సాగర్, సేవాదళ్ అధ్యక్షుడు బంగారు వెంకటరమణ, దుబ్బాక గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీలో చేరికలు: ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన యువకులు పెద్ద సంఖ్యలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు మతిన్ ఆధ్వర్యంలో సయ్యద్ నౌసల్, సయ్యద్ కరీం, చంద్రశేఖర్, సురేందర్, రోహిత్ తదితరులతో పాటు భారీ సంఖ్యలో యువకులు పార్టీలో చేరారు. వీరందరికీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి ఘనంగా ఆహ్వానించారు. -
ఆత్మ విమర్శ ఎక్కడ?
సరిగా 71 ఏళ్లక్రితం తమ దేశం సృష్టించిన అణు విలయానికి సర్వనాశనమైన హిరోషిమా పట్టణాన్ని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సందర్శించారు. అణుబాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయిన దాదాపు లక్షన్నర మంది ప్రజానీకం స్మృతికి నివాళులర్పించడంతోపాటు ఆ దుర్మార్గాన్ని కళ్లారా చూసిన కొందరు వ్యక్తుల్ని ఆయన పలకరించారు. వారిని హత్తుకున్నారు... ఓదార్చారు. ఆధిపత్యం కోసం, గెలుపు కోసం సంపన్న దేశాల మధ్య సాగిన పోటీ పర్యవసానంగానే ఇంత దారుణం చోటు చేసుకున్నదని ఆవేదనచెందారు. మానవాళి చరిత్రనూ, దాంతో పెనవేసుకున్న ఘర్షణలు, యుద్ధాలు వగైరాలన్నిటినీ ఆయన పూసగుచ్చారు. ఒక్క మాటలో ‘క్షమాపణ’ మినహా ఒబామా అన్నీ చెప్పారు. ఇది క్షమాపణ చెప్పడానికి ఉద్దేశించిన పర్యటన కాదంటూ ముందే వైట్‌హౌస్ ప్రకటించింది. ఈ పర్యటనపై ఇంటా బయటా ప్రశంసలతోపాటు విమర్శలూ వెల్లువెత్తాయి. అమెరికా అధ్యక్షుడి ‘పెద్ద మనసు’ను కీర్తించినవారున్నారు. మానవేతిహాసంలోనే అత్యంత ఘోర దురంతానికి కారణమైనా ‘సారీ’ చెప్పడానికి నోరు రాలేదని ఆగ్రహించినవారున్నారు. అమెరికా, జపాన్‌లు రెండూ తమ దురుద్దేశాలను కొనసాగించడానికి ఈ సందర్భాన్ని ఉపయోగించుకున్నాయని చైనా అధికార వార్తా సంస్థ జిన్హువా ఆరోపిస్తే... ఇలాంటి ‘సిగ్గుమాలిన’ పర్యటనలతో అమెరికా పరువు తీస్తున్నారని ‘న్యూయార్క్ పోస్టు’ వాపోయింది. తను చెప్పదలచుకున్న సంగతి తనకే స్పష్టంగా తెలీనప్పుడు కవి తన చేతగానితనాన్నీ, అర్ధ అస్పష్టతనీ ఛందస్సు చీరల వెనకా, అలంకారాల మధ్యా, కఠిన పదాల బురఖాలలో దాచి మోసగించజూస్తాడని విఖ్యాత కథకుడు చలం అంటాడు. ఒబామా హిరోషిమాలో అలాంటి పనే చేశారా? ఆనాటి అమెరికా దుర్మార్గం జాడలు కప్పిపుచ్చాలని చూశారా? ఎందుకంటే...రెండో ప్రపంచ యుద్ధంలో అన్నివిధాలా అప్పటికే దెబ్బతిని ఉన్న జపాన్ను సమీప భవిష్యత్తులో కోలుకోలేకుండా చేయడం కోసం...తన అమ్ములపొదిలో ఉన్న అణు బాంబులు సృష్టించగల మారణ హోమాన్ని ‘వాస్తవికంగా’ పరీక్షించడం కోసం అమెరికా ఇంతటి దారుణానికి తెగించిందని చరిత్రకారులు చెబుతారు. హిరోషిమా తర్వాత మరో మూడు రోజులకు నాగసాకి పట్టణంలో కూడా ఇలాంటి దాడికే అమెరికా పాల్పడింది. ఈ రెండు ఉదంతాల్లోనూ లక్షన్నరమంది జనం ప్రాణాలు కోల్పోయారు. మరిన్ని లక్షలమంది జీవితాంతం నరకయాతన చవిచూశారు. ఆనాటి దాడి ప్రభావంతో ఆ రెండు పట్టణాల్లో ఇప్పటికీ అంగవైకల్యంతో జన్మిస్తున్న వారున్నారు. భావోద్వే గాలతో నిండిన ఒబామా ప్రసంగంలో క్షమాపణ ప్రసక్తి లేకపోవడం సంగతలా ఉంచి... కనీసం అణ్వస్త్రాల తగ్గింపు గురించిగానీ, అందుకోసం అమెరికా తన వంతుగా చేయదల్చుకున్నదేమిటనిగానీ లేకపోవడం అన్యాయమని చాలామందికి అనిపించడంలో తప్పులేదు. చరిత్రలో జరిగిపోయిన వాటిని సరిదిద్దలేకపోయినా, అవి మళ్లీ పునరావృతం కాకుండా చూడటం సాధ్యమే. కనీసం ఆ దిశగా ఒక్క అడుగైనా ముందుకేయడానికి సంసిద్ధత ప్రదర్శిం చకపోవడమంటే ఆ తప్పు తిరిగి జరగడానికి ఆస్కారం కల్పించినట్టే. మారడానికి సిద్ధంగా లేమని ఒప్పుకోవడమే. అయితే ఒబామా వర్తమాన స్థితిని కూడా అర్ధం చేసుకోవాలి. అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముంచుకొస్తున్నాయి గనుక అమెరికన్ల పరిభాషలో ఆయన నిస్సహాయ లేదా నిరర్ధక అధ్యక్షుడు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం ఆయనకు అసాధ్యం. అందువల్లే హిరోషిమా వెళ్లడమే ఒక సాహ సోపేత నిర్ణయంగా భావించ మని కొందరు చెబుతున్నారు. ఆధిపత్యం కోసమో, వనరుల దోపిడీ కోసమో దేశాల మధ్య సాగే యుద్ధాలు మౌలికంగా ఆయా దేశాల సైన్యాల మధ్య సాగే సాయుధ ఘర్షణలు. జనావాస ప్రాంతాలను ఈ ఘర్షణలు తాకరాదని, పౌరులకు ప్రాణాంతకం కానీయరాదని అంతర్జాతీయ నియమాలున్నా చాలా సందర్భాల్లో వాటిని ఎవరూ పట్టించు కోవడం లేదు. ఈనియమాల ఉల్లంఘనలో అమెరికాది అగ్రస్థానమని ప్రపంచం మూలమూలనా నిరూపణవుతోంది. అది ఇరాక్ కావొచ్చు...సోమాలియా కావొచ్చు... అప్ఘానిస్తాన్ కావొచ్చు. అవి క్షిపణులు కావొచ్చు...బాంబులు కావొచ్చు... ద్రోన్ దాడులు కావొచ్చు- అతి తరచుగా బలవుతున్నది సామాన్య పౌరుల ప్రాణాలే. ఈ దేశాలన్నిటా సాగించిందీ, సాగిస్తున్నదీ దురాక్రమణే తప్ప యుద్ధం కాదు. రెండో ప్రపంచ యుద్ధ సమయానికి జపాన్ దురాక్రమణ ఉన్మాదం ఏ స్థాయిలో ఉన్నదో... దాని సైన్యాలు చైనాలోనూ, కొరియాలోనూ, ఇతరచోట్లా సాగించిన దురంతాలెలాంటివో అందరికీ తెలుసు. దాన్ని దారికి తీసుకురావడం అవసరమని అందరూ భావించినా అందుకు ఆ దేశ ప్రజల్ని మట్టుబెట్టడమే మార్గమని ఎవరూ అనుకోలేదు. అమెరికా ఇప్పుడు దేశదేశాల్లో సాగిస్తున్న దాడుల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నవారు సైతం అందుకు ఆ దేశ ప్రజల్ని బాధ్యులుగా చేయరు. వియత్నాంలో 60వ దశకంలో అమెరికా సృష్టించిన మారణహోమాన్ని నిలువ రించడం చైతన్యవంతులైన అమెరికా ప్రజలవల్లనే సాధ్యమైంది. ఇప్పుడు కూడా అలాంటి చైతన్యమే అమెరికా దూకుడును నిలవరించగలదని అందరూ అనుకుం టున్నారు. చరిత్రకు సంబంధించిన ఎరుక ఇందుకు దోహదపడుతుంది. హిరోషిమా, నాగసాకి పట్టణాలపై జరిగిన అణ్వస్త్ర దాడుల గురించి అమెరికా ప్రజానీకం వైఖరిలో ఎంతో మార్పు వచ్చిందని ఈమధ్యే నిర్వహించిన ఒక సర్వే అంటున్నది. వ్యతిరేకులకూ, అనుకూలురకూ మధ్య స్వల్ప తేడాయే ఉన్నా ఆ దాడులు తప్పేనని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారని చెబుతున్నది. పదేళ్లక్రితం ఇలాంటి సర్వేయే జరిపినప్పుడు అత్యధికులు ఆ దాడుల్ని సమర్ధించారు. చరిత్ర శిథిలాలపై హిరోషిమా పునర్నిర్మితమైంది. వర్తమాన ప్రపంచ అత్యాధునిక నగరాల్లో అదొకటి. 12 లక్షలమంది జనాభా గల ఆ నగరంలో ఇప్ప టికీ 50,000మంది బాంబు దాడి బాధితులున్నారు. కానీ అన్ని దేశాలూ జపాన్‌లా కాలేవు. అన్ని నగరాలూ హిరోషిమాగా చివురించలేవు. పచ్చని జీవితాన్ని ధ్వంసం చేయడం లిప్తకాలంలో చేయొచ్చుగానీ...దాన్ని పునర్నిర్మించడం, మళ్లీ జవజీవాల్ని అందించడం అంత సులభం కాదు. మరిన్ని హిరోషిమాలు రాకూడదనుకుంటే నిష్కర్షగా, నిజాయితీగా, స్వచ్ఛంగా మాట్లాడటం అవసరం. కేవల భావోద్వేగాలు, ఉత్ప్రేక్షలు, పరోక్ష ఒప్పుకోళ్లవల్ల పెద్దగా ఫలితం ఉండదు.