సరిగా 71 ఏళ్లక్రితం తమ దేశం సృష్టించిన అణు విలయానికి సర్వనాశనమైన హిరోషిమా పట్టణాన్ని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సందర్శించారు. అణుబాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయిన దాదాపు లక్షన్నర మంది ప్రజానీకం స్మృతికి నివాళులర్పించడంతోపాటు ఆ దుర్మార్గాన్ని కళ్లారా చూసిన కొందరు వ్యక్తుల్ని ఆయన పలకరించారు. వారిని హత్తుకున్నారు... ఓదార్చారు. ఆధిపత్యం కోసం, గెలుపు కోసం సంపన్న దేశాల మధ్య సాగిన పోటీ పర్యవసానంగానే ఇంత దారుణం చోటు చేసుకున్నదని ఆవేదనచెందారు. మానవాళి చరిత్రనూ, దాంతో పెనవేసుకున్న ఘర్షణలు, యుద్ధాలు వగైరాలన్నిటినీ ఆయన పూసగుచ్చారు. ఒక్క మాటలో ‘క్షమాపణ’ మినహా ఒబామా అన్నీ చెప్పారు. ఇది క్షమాపణ చెప్పడానికి ఉద్దేశించిన పర్యటన కాదంటూ ముందే వైట్‌హౌస్ ప్రకటించింది.
ఈ పర్యటనపై ఇంటా బయటా ప్రశంసలతోపాటు విమర్శలూ వెల్లువెత్తాయి. అమెరికా అధ్యక్షుడి ‘పెద్ద మనసు’ను కీర్తించినవారున్నారు. మానవేతిహాసంలోనే అత్యంత ఘోర దురంతానికి కారణమైనా ‘సారీ’ చెప్పడానికి నోరు రాలేదని ఆగ్రహించినవారున్నారు. అమెరికా, జపాన్‌లు రెండూ తమ దురుద్దేశాలను కొనసాగించడానికి ఈ సందర్భాన్ని ఉపయోగించుకున్నాయని చైనా అధికార వార్తా సంస్థ జిన్హువా ఆరోపిస్తే... ఇలాంటి ‘సిగ్గుమాలిన’ పర్యటనలతో అమెరికా పరువు తీస్తున్నారని ‘న్యూయార్క్ పోస్టు’ వాపోయింది.
తను చెప్పదలచుకున్న సంగతి తనకే స్పష్టంగా తెలీనప్పుడు కవి తన చేతగానితనాన్నీ, అర్ధ అస్పష్టతనీ ఛందస్సు చీరల వెనకా, అలంకారాల మధ్యా, కఠిన పదాల బురఖాలలో దాచి మోసగించజూస్తాడని విఖ్యాత కథకుడు చలం అంటాడు. ఒబామా హిరోషిమాలో అలాంటి పనే చేశారా? ఆనాటి అమెరికా దుర్మార్గం జాడలు కప్పిపుచ్చాలని చూశారా? ఎందుకంటే...రెండో ప్రపంచ యుద్ధంలో అన్నివిధాలా అప్పటికే దెబ్బతిని ఉన్న జపాన్‌ను సమీప భవిష్యత్తులో కోలుకోలేకుండా చేయడం కోసం...తన అమ్ములపొదిలో ఉన్న అణు బాంబులు సృష్టించగల మారణ హోమాన్ని ‘వాస్తవికంగా’ పరీక్షించడం కోసం అమెరికా ఇంతటి దారుణానికి తెగించిందని చరిత్రకారులు చెబుతారు. హిరోషిమా తర్వాత మరో మూడు రోజులకు నాగసాకి పట్టణంలో కూడా ఇలాంటి దాడికే అమెరికా పాల్పడింది. ఈ రెండు ఉదంతాల్లోనూ లక్షన్నరమంది జనం ప్రాణాలు కోల్పోయారు.
మరిన్ని లక్షలమంది జీవితాంతం నరకయాతన చవిచూశారు. ఆనాటి దాడి ప్రభావంతో ఆ రెండు పట్టణాల్లో ఇప్పటికీ అంగవైకల్యంతో జన్మిస్తున్న వారున్నారు. భావోద్వే గాలతో నిండిన ఒబామా ప్రసంగంలో క్షమాపణ ప్రసక్తి లేకపోవడం సంగతలా ఉంచి... కనీసం అణ్వస్త్రాల తగ్గింపు గురించిగానీ, అందుకోసం అమెరికా తన వంతుగా చేయదల్చుకున్నదేమిటనిగానీ లేకపోవడం అన్యాయమని చాలామందికి అనిపించడంలో తప్పులేదు. చరిత్రలో జరిగిపోయిన వాటిని సరిదిద్దలేకపోయినా, అవి మళ్లీ పునరావృతం కాకుండా చూడటం సాధ్యమే. కనీసం ఆ దిశగా ఒక్క అడుగైనా ముందుకేయడానికి సంసిద్ధత ప్రదర్శిం చకపోవడమంటే ఆ తప్పు తిరిగి జరగడానికి ఆస్కారం కల్పించినట్టే. మారడానికి సిద్ధంగా లేమని ఒప్పుకోవడమే. అయితే ఒబామా వర్తమాన స్థితిని కూడా అర్ధం చేసుకోవాలి. అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముంచుకొస్తున్నాయి గనుక అమెరికన్‌ల పరిభాషలో ఆయన నిస్సహాయ లేదా నిరర్ధక అధ్యక్షుడు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం ఆయనకు అసాధ్యం. అందువల్లే హిరోషిమా వెళ్లడమే ఒక సాహ సోపేత నిర్ణయంగా భావించ మని కొందరు చెబుతున్నారు.
ఆధిపత్యం కోసమో, వనరుల దోపిడీ కోసమో దేశాల మధ్య సాగే యుద్ధాలు మౌలికంగా ఆయా దేశాల సైన్యాల మధ్య సాగే సాయుధ ఘర్షణలు. జనావాస ప్రాంతాలను ఈ ఘర్షణలు తాకరాదని, పౌరులకు ప్రాణాంతకం కానీయరాదని అంతర్జాతీయ నియమాలున్నా చాలా సందర్భాల్లో వాటిని ఎవరూ పట్టించు కోవడం లేదు. ఈనియమాల ఉల్లంఘనలో అమెరికాది అగ్రస్థానమని ప్రపంచం మూలమూలనా నిరూపణవుతోంది. అది ఇరాక్ కావొచ్చు...సోమాలియా కావొచ్చు... అప్ఘానిస్తాన్ కావొచ్చు. అవి క్షిపణులు కావొచ్చు...బాంబులు కావొచ్చు... ద్రోన్ దాడులు కావొచ్చు- అతి తరచుగా బలవుతున్నది సామాన్య పౌరుల ప్రాణాలే. ఈ దేశాలన్నిటా సాగించిందీ, సాగిస్తున్నదీ దురాక్రమణే తప్ప యుద్ధం కాదు. రెండో ప్రపంచ యుద్ధ సమయానికి జపాన్ దురాక్రమణ ఉన్మాదం ఏ స్థాయిలో ఉన్నదో... దాని సైన్యాలు చైనాలోనూ, కొరియాలోనూ, ఇతరచోట్లా సాగించిన దురంతాలెలాంటివో అందరికీ తెలుసు.
దాన్ని దారికి తీసుకురావడం అవసరమని అందరూ భావించినా అందుకు ఆ దేశ ప్రజల్ని మట్టుబెట్టడమే మార్గమని ఎవరూ అనుకోలేదు. అమెరికా ఇప్పుడు దేశదేశాల్లో సాగిస్తున్న దాడుల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నవారు సైతం అందుకు ఆ దేశ ప్రజల్ని బాధ్యులుగా చేయరు. వియత్నాంలో 60వ దశకంలో అమెరికా సృష్టించిన మారణహోమాన్ని నిలువ రించడం చైతన్యవంతులైన అమెరికా ప్రజలవల్లనే సాధ్యమైంది. ఇప్పుడు కూడా అలాంటి చైతన్యమే అమెరికా దూకుడును నిలవరించగలదని అందరూ అనుకుం టున్నారు. చరిత్రకు సంబంధించిన ఎరుక ఇందుకు దోహదపడుతుంది. హిరోషిమా, నాగసాకి పట్టణాలపై జరిగిన అణ్వస్త్ర దాడుల గురించి అమెరికా ప్రజానీకం వైఖరిలో ఎంతో మార్పు వచ్చిందని ఈమధ్యే నిర్వహించిన ఒక సర్వే అంటున్నది. వ్యతిరేకులకూ, అనుకూలురకూ మధ్య స్వల్ప తేడాయే ఉన్నా ఆ దాడులు తప్పేనని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారని చెబుతున్నది. పదేళ్లక్రితం ఇలాంటి సర్వేయే జరిపినప్పుడు అత్యధికులు ఆ దాడుల్ని సమర్ధించారు.
చరిత్ర శిథిలాలపై హిరోషిమా పునర్నిర్మితమైంది. వర్తమాన ప్రపంచ అత్యాధునిక నగరాల్లో అదొకటి. 12 లక్షలమంది జనాభా గల ఆ నగరంలో ఇప్ప టికీ 50,000మంది బాంబు దాడి బాధితులున్నారు. కానీ అన్ని దేశాలూ జపాన్‌లా కాలేవు. అన్ని నగరాలూ హిరోషిమాగా చివురించలేవు. పచ్చని జీవితాన్ని ధ్వంసం చేయడం లిప్తకాలంలో చేయొచ్చుగానీ...దాన్ని పునర్నిర్మించడం, మళ్లీ జవజీవాల్ని అందించడం అంత సులభం కాదు. మరిన్ని హిరోషిమాలు రాకూడదనుకుంటే నిష్కర్షగా, నిజాయితీగా, స్వచ్ఛంగా మాట్లాడటం అవసరం. కేవల భావోద్వేగాలు, ఉత్ప్రేక్షలు, పరోక్ష ఒప్పుకోళ్లవల్ల పెద్దగా ఫలితం ఉండదు.
ఆత్మ విమర్శ ఎక్కడ?
Published Tue, May 31 2016 1:18 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement