పారిస్ వాతావరణ శిఖరాగ్ర సదస్సులో రెండు వారాలపాటు ఏకధాటిగా సాగిన చర్చలు, వాదోపవాదాల అనంతరం శనివారం 196 దేశాలు ఒక ఒప్పందానికొచ్చాయి. ఇది చరిత్రాత్మకమని పలు దేశాధినేతలంటున్నారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా ఇంకొంచెం ముందుకెళ్లి ఇది అమెరికా నాయకత్వం సాధించిన విజయంగా చెప్పుకున్నారు. ఒప్పందం చూసినవారు కూడా ఇదంతా నిజమేనని నమ్ముతారు. ఎందుకంటే 31 పేజీల ఆ ఒప్పందంలో అందుకు బోలెడు దాఖలాలున్నాయి. భూతాపంలో పెరుగుదలను 2 డిగ్రీల సెల్సియస్కన్నా తక్కువ స్థాయికి పరిమితం చేయాలని, దాన్ని 1.5 డిగ్రీల సెల్సియస్కే తగ్గించడానికి ప్రయత్నించాలని అది చెబుతున్నది.
దీర్ఘకాలంలో అన్ని దేశాలూ కర్బన ఉద్గారాల ఊసేలేని ఆర్థిక వ్యవస్థల ఏర్పాటుకు కృషి చేయాలని పిలుపునిచ్చింది. 2050-2100 మధ్యకల్లా ధనిక, పేద తేడా లేకుండా దేశాలన్నీ దీన్ని సాధించితీరాలన్నది. ఉద్గారాల తగ్గింపు అంశంలో ఏ దేశం తీరు ఎలా ఉన్నదో అయిదేళ్లకోసారి సమీక్షించాలని కూడా నిర్ణయించింది. అంతేకాదు...దేశాలన్నిటికీ ఉమ్మడి బాధ్యతను కట్టబెడుతూనే ధనిక, బీద దేశాల వ్యత్యాసాన్ని కూడా ఒప్పందం పరిగణనలోకి తీసుకుంది. ఇన్ని అనుకూలాంశాలున్నాయి గనుక పారిస్ ఒప్పందం ఒక ముందడుగేనని చాలామంది చెబుతున్నారు. కానీ ఉద్గారాల తగ్గింపునకు వివిధ దేశాలిచ్చిన స్వచ్ఛంద హామీలనన్నటినీ గుదిగుచ్చినా భూతాపం 2 డిగ్రీల సెల్సియస్లోపు ఉండే అవకాశం లేదని శాస్త్రవేత్తలంటున్నారు.
ఏం చేయాలన్న విషయంలో మాత్రమే పారిస్లో అవగాహన కుదిరింది. ఎలా చేయాలో, అందుకు నిర్దిష్టంగా అనుసరించవలసిన కార్యాచరణేమిటో స్పష్టం చేసి, దాన్ని సాధించని పక్షంలో ఎలాంటి చర్యలుంటాయో ఒప్పందం చెప్పి ఉంటే వేరుగా ఉండేది. అందువల్ల అందరికీ భరోసా ఏర్పడేది. ఒప్పందానికి చట్టబద్ధత లేకపోతే సంపన్న దేశాలు దానికి కట్టుబడి ఉంటాయని నమ్మేదెలా? లాభాపేక్ష తప్ప ధరిత్రి క్షేమం పట్టని సంపన్న దేశాలు భారీయెత్తున వాతావరణంలోకి కర్బన ఉద్గారాలను విడుదల చేస్తున్నాయి. ప్రపంచాన్ని చుట్టుముట్టిన కర్బన కాలుష్యంలో వాటి వాటా 70 శాతం పైబడేనని వివిధ గణాంకాలు చెబుతున్నాయి.
పారిశ్రామిక విప్లవం తర్వాత 1850 మొదలుకొని 2011 వరకూ విడుదలైన కర్బన ఉద్గారాల్లో అమెరికా వాటా 27 శాతం, యూరోప్ దేశాల భాగం 28 శాతం అని ఆ గణాంకాలు వివరిస్తున్నాయి. చైనా 11 శాతం, రష్యా 8 శాతం కాలుష్యానికి కారణమయ్యాయి. మన దేశం వాటా 3 శాతం మించలేదు. పర్యావరణ ధ్వంసానికి తామే ప్రధాన కారకులమన్న స్పృహను ప్రదర్శించి అందుకు తగినట్టుగా పెద్దయెత్తున కోత విధించుకోవాల్సింది పోయి సంపన్న దేశాలు పేచీకి దిగాయి. అందరికీ సమానంగా బాధ్యతలు పంచాలని డిమాండ్ చేశాయి.
మరోవైపు కాలుష్యాన్ని వడబోసే సాంకేతిక పరిజ్ఞానాన్ని వర్ధమాన దేశాలకు ఉదారంగా అందించేందుకు సైతం అవి ముందుకు రావడంలేదు. కర్బన ఉద్గారాలపై విధించే కోతలోనూ అవి వ్యాపార ప్రయోజనాలను వెదుక్కుంటున్నాయి. కోత కారణంగా వర్ధమాన దేశాల్లో పరిశ్రమల స్థాపనకు వీలు కుదరని స్థితి ఏర్పడితే తమ సరుకులకు గిరాకీ ఏర్పడుందని...స్థాపించాలని నిర్ణయించుకుంటే తమ కాలుష్య వడబోత టెక్నాలజీకి మంచి ధర వస్తుందని అవి లెక్కలేసుకుంటున్నాయి. పారిస్ ఒప్పందంలో టెక్నాలజీ ఊసెత్తకుండా 2020 తర్వాత పేద దేశాల కోసం ఏటా 10,000 కోట్ల డాలర్లు నిధులు సమకూరుస్తామని, భవిష్యత్తులో దీన్నింకా పెంచుతామని అవి తెలిపాయి.
నిజానికి ఈ డబ్బంతా మళ్లీ ఆ దేశాలకే చేరుతుంది. ఎందుకంటే 2022 నాటికి పుష్కలంగా పునరుత్పాదక ఇంధన వనరులు అందుబాటులో ఉంటే తప్ప కర్బన ఉద్గారాలకు కోత పడటం సాధ్యం కాదు. మళ్లీ ఆ టెక్నాలజీ సైతం సంపన్న దేశాలవద్దే ఉంది గనుక దాన్ని డబ్బు పోసి కొనుక్కొనక తప్పని స్థితి పేద దేశాలకుంటుంది. కనుక పేద దేశాల కోసం నిధులతోపాటు వివిధ రకాల సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చడానికి ధనిక దేశాలు ఏం చేయబోతాయో పారిస్ ఒప్పందం స్పష్టంగా చెప్పి ఉంటే కాస్తయినా ఉపయోగం ఉండేది. అలాగే భూతాపోన్నతివల్ల సముద్ర మట్టానికి తక్కువ ఎత్తులో ఉండే దేశాల్లోని ప్రజలు పెద్దయెత్తున వలస పోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అలాంటి సందర్భాల్లో ధనిక దేశాలు తీసుకోవాల్సిన బాధ్యతల గురించి కూడా ఒప్పందం ప్రస్తావించలేదు.
ఈ లోటుపాట్లు గమనిస్తే పారిస్లో రాజకీయంగా ఆలోచించి నిర్ణయాలు చేశారే తప్ప మానవాళికి ఎదురుకాబోయే సవాళ్లు, వాటిని ఎదుర్కొనవలసిన తీరుతెన్నులపై శాస్త్రీయ అవగాహనతో దృష్టిపెట్టలేదని అర్ధమవుతుంది. శిలాజ ఇంధనాలు రోజురోజుకూ అడుగంటుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో రాబోయే కాలం సౌరశక్తిదే. దానివైపుగా కదలాలని చెప్పడం బాగానే ఉన్నా అది ఎంత వేగంగా జరగాలి...దానికి దేశాలన్నీ ఏం చేయాలన్న దిశా నిర్దేశం లేదు. ప్రధాని నరేంద్ర మోదీ పదే పదే ప్రస్తావించిన 'వాతావరణ న్యాయం' అనే పదం ఒప్పందంలోని పీఠికకే పరిమితమైంది తప్ప ఇతరచోట్ల దానికి అనుగుణమైన ప్రతిపాదనలు లేవు. వచ్చే ఏప్రిల్నుంచి అమల్లోకి రాబోయే పారిస్ ఒప్పందం కార్యాచరణ ఎలా ఉన్నదో చూడటానికి 2018లో వాతావరణ మార్పులకు సంబంధించిన కమిటీ సమావేశమవుతుంది. ఆపై మరో రెండేళ్లకు ఒత్తిళ్లు మొదలవుతాయి.
ఈలోగా ప్రస్తుత ఒప్పందానికి అనుగుణంగా ప్రతి దేశమూ తమ చట్టాలను సవరించుకుని తగిన కట్టుదిట్టాలు చేసుకోవాల్సి ఉంటుంది. 2030కల్లా సౌరశక్తితోసహా మొత్తంగా 200 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన వనరులు సమీకరిస్తామని మన దేశం లోగడే లక్ష్య నిర్దేశం చేసుకుంది. కనుక ఆ రంగంలో భారీయెత్తున పెట్టుబడులు అవసరమవుతాయి. సంపన్న దేశాలు పారిస్లో ముఖం చాటేసిన నేపథ్యంలో ఇదంతా ఏమేరకు సాధ్యమవుతుందో వేచిచూడాలి. పారిస్ శిఖరాగ్ర సదస్సుకు ముందు కర్బన ఉద్గారాల్లో తమ దేశం రెండో స్థానంలో ఉన్నదని అమెరికా అధ్యక్షుడు ఒబామా అంగీకరించారు. దాన్ని పరిష్కరించుకుంటామన్న హామీ కూడా ఇచ్చారు. కానీ ప్రస్తుత ఒప్పందం ఆ విషయంలో ఆశావహంగా లేదు. 1992 నాటి రియో డి జెనైరో సదస్సుతో పోలిస్తే అమెరికాతో సహా ప్రపంచ దేశాలన్నీ ఎలాగైతేనేం ఒక ఒప్పందానికి రాగలిగాయని సంబరపడితే పడొచ్చుగానీ మంచి ఫలితాలు రావాలంటే ఆచరణలో అది మరింత పదునెక్కాలి.