ఒబామా స్నేహ హస్తం
భూమ్యాకాశాలు రెండింటా భద్రతా బలగాలు డేగకళ్లతో పహారా కాస్తున్న ఢిల్లీలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీసమేతంగా అడుగుపెట్టారు. సోమవారం జరగబోయే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాలుపంచుకోబోతున్న తొలి అమెరికా అధ్యక్షుడిగానే కాదు...ఆ పదవిలో ఉంటూ రెండోసారి భారత్ సందర్శించిన తొలి నేతగా కూడా ఒబామా నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. అటు ప్రధాని నరేంద్ర మోదీ కూడా ప్రొటోకాల్‌ను కాదని స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి ఒబామా దంపతులకు స్వాగతం పలికారు. ఇరు దేశాలూ సాన్నిహిత్యం కోసం, పరస్పర సహకారం కోసం ఎంతగా ఆరాటపడుతున్నాయో వీటినిబట్టే తెలుసుకోవచ్చు. మోదీ అధికారంలోకొచ్చాక అధినేతలిద్దరిమధ్యా న్యూయార్క్‌లో గత సెప్టెంబర్‌లో శిఖరాగ్ర సదస్సు జరిగింది. ఆ సందర్భంగా పలు రంగాలకు సంబంధించిన అవగాహన ఒప్పందాలు కుదిరాయి. అందులో ప్రతిష్టంభన ఏర్పడిన పౌర అణు ఒప్పందంపై మరిన్ని చర్చలు జరగాలనుకోవడం దగ్గరనుంచి అంతరిక్ష రంగంలో సహకారం, వాణిజ్య సౌలభ్య ఒప్పందానికి అంగీకారంవంటి అంశాలవరకూ ఎన్నో ఉన్నాయి. ఇరు దేశాల వాణిజ్యం గత దశాబ్దం కాలంలో అయిదు రెట్లు పెరిగి అదిప్పుడు 10,000 కోట్ల డాలర్లకు చేరుకుంది. 2020 నాటికి దాన్ని 50,000 కోట్ల డాలర్లకు పెంపొందింపజేయాలన్న ఆశలున్నాయి. 2010 నవంబర్‌లో ఒబామా మన దేశానికొచ్చారు. అయితే, ఆ తర్వాత ఇరుదేశాలమధ్యా సంబంధాలు క్షీణించలేదుగానీ పెరగాల్సినంతగా పెరిగిన దాఖలాలు లేవు. పెపైచ్చు మన దౌత్య అధికారిణి దేవయాని ఖోబ్రగడే విషయంలో అమెరికా పోలీసు అధికారులు అతిగా వ్యవహరించిన తీరు ఎన్నో సమస్యలు తెచ్చిపెట్టింది.
ఈ నేపథ్యంలో రెండు దేశాలూ పరస్పరం ప్రయోజనాలున్నాయని భావించిన రంగాల్లో భాగస్వామ్యం పెంపొందించుకోవడం మొదలుకొని పటిష్టమైన స్నేహసంబంధాలను ఏర్పర్చుకోవడంవరకూ ఎన్నో అంశాల ఎజెండాతో ఒబామా వచ్చారు. హైదరాబాద్ హౌస్‌లో మోదీ, ఒబామాల మధ్య రెండు దేశాల ప్రతినిధి బృందాల సమక్షంలోనూ, అటు తర్వాత ఏకాంతంగానూ చర్చలు సాగాయి. ఈ చర్చల పర్యవసానంగా అధినేతలిద్దరిమధ్యా పరస్పర అవగాహన పెరిగిన సూచనలు కనిపించాయి. సంయుక్తంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారిద్దరూ మాట్లాడిన తీరు దీన్ని ప్రతిఫలించింది. పౌర అణు ఒప్పందం విషయంలో ఏర్పడిన అడ్డంకులు తొలగిపోయాయని ఇద్దరూ ప్రకటించారు. అలాగే రక్షణ రంగంలో ఉన్న ఇరుదేశాల భాగస్వామ్యాన్ని మరో పదేళ్లు పొడిగించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ఇక స్మార్ట్ సిటీలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, యూపీ, రాజస్థాన్‌లతో ఒప్పందాలు కూడా కుదిరాయి. వీటితోపాటు ఉగ్రవాదుల కదలికలపై పరస్పరం సమాచారాన్ని పంచుకోవాలని... అమెరికాలో పనిచేస్తున్న వేలాదిమంది భారత వృత్తిరంగ నిపుణులకు ప్రయోజనం చేకూర్చే సామాజిక భద్రతా ఒప్పందం కుదరడానికి వీలుగా ఇరుదేశాలూ చర్చించుకోవాలని నిర్ణయించారు.
అణు ఒప్పందం విషయంలో అడ్డంకులు తొలగినట్టు చెప్పడం మినహా అందుకు సంబంధించిన వివరాలేవీ మోదీ, ఒబామాలు వెల్లడించలేదు. ఆ ఒప్పందానికి ఏర్పడిన ప్రతిబంధకాలు చిన్నవేమీ కాదు. ఇరు దేశాలమధ్యా పౌర అణు ఒప్పందం కుదిరి ఆరున్నరేళ్లు దాటుతున్నది. ఆ ఒప్పందం కుదరడానికి అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ తన ప్రభుత్వాన్నే పణంగా పెట్టారు. అయితే, యూపీఏ రెండో దశ పాలనలో ఆ ఒప్పందానికి అనుగుణంగా తీసుకొచ్చిన అణు పరిహార చట్టం విషయంలో అమెరికాకు తీవ్ర అభ్యంతరాలున్నాయి. ముఖ్యంగా అణు విద్యుత్ ప్రాజెక్టులో ఏదైనా ప్రమాదం సంభవించిన పక్షంలో అణు రియాక్టర్‌ను సరఫరాచేసిన సంస్థనుంచి గరిష్టంగా రూ. 1,500 కోట్లు వసూలు చేయాలని నిర్దేశిస్తున్న ఆ చట్టంలోని సెక్షన్ 17(బీ) తమకు సమ్మతం కాదని అమెరికా అంటున్నది. అలాంటివన్నీ అణు విద్యుత్ ప్రాజెక్టు నిర్వహిస్తున్న సంస్థే చూసుకోవాలని చెబుతున్నది. అణు రియాక్టర్ల డిజైన్, అందులో వాడే పరికరాల నాణ్యత మొదలైనవి సాధారణంగా ప్రమాదాలకు కారణమవుతాయి గనుక వాటిని సరఫరా చేసిన సంస్థ బాధ్యత లేదనడం సరికాదన్నది మన ప్రభుత్వం వాదన. కనుకనే ఆ సెక్షన్ తొలగించడం సాధ్యపడదని స్పష్టంచేసింది. మరోపక్క భారత్‌కు సరఫరా అయ్యే అణు ఇంధనం రియక్టర్లకే చేరుతున్నదో లేదో పర్యవేక్షించడానికి అంగీకరించాలని అమెరికా కోరుతున్నది. ఈ విషయంలో అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ(ఐఏఈఏ) భద్రతా ప్రమాణాల మేరకు పనిచేస్తామన్నది మన వాదన. ఇప్పుడు కుదిరిందంటున్న అవగాహన ఏమిటో వెల్లడైతే తప్ప ఈ విషయాల్లో ఎవరెంత రాజీపడ్డారో తెలిసే అవకాశం లేదు.
ఇక అమెరికా-చైనాలమధ్య కుదిరిన వాతావరణ ఒప్పందాన్ని చూపి ఆ విషయంలో మన దేశంపై కూడా ఒబామా ఒత్తిడి తెస్తారన్న అంచనాలు మొదటినుంచీ ఉన్నాయి. ఈ అంశం చర్చల్లో ప్రధానంగానే ప్రస్తావనకొచ్చిన సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది పారిస్‌లో జరగబోయే శిఖరాగ్ర సదస్సులో ఒక ఒప్పందం కుదరగలదన్న ఆశాభావాన్ని వ్యక్తంచేయడం మినహా మోదీ దీని గురించి అదనంగా ఏమీ చెప్పలేదు. ఇదే సమయంలో స్వచ్ఛ ఇంధనాన్ని వినియోగించడానికి అనువైన సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడుల లభ్యతలో సహకరించడానికి అమెరికా ముందుకొచ్చింది. వర్ధమాన దేశాలు కూడా తమతో సమానంగా కర్బన ఉద్గారాలను తగ్గించుకోవాలని చాన్నాళ్లనుంచి అమెరికా వాదిస్తున్నది. ఈ విషయంలో ఒబామా తాజా ప్రతిపాదనలేమిటో, మోదీ స్పందనేమిటో వెల్లడికావాల్సి ఉంది. ఇక ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే అంశంలో మరింత సహకరించుకోవాలని రెండు దేశాలూ నిర్ణయించుకోవడం ఎన్నదగినది. అమెరికా ఒత్తిడి పర్యవసానంగా జమా- ఉత్ -దవా(జేయూడీ)ను నిషేధించాలని ఈమధ్యే పాకిస్థాన్ నిర్ణయించింది. ఈ విషయంలో అమెరికా మరింత కృషి చేస్తే ఉపఖండంలో శాంతిసుస్థిరతలు ఏర్పడతాయి. మొత్తానికి ఒబామా పర్యటన పర్యవసానంగా ఇరుదేశాల సంబంధాలూ మరింత ఎత్తుకు ఎదిగితే అది ఇద్దరికీ లాభదాయకమే.