‘జోనల్’ గందరగోళం తొలగించాలి
- జిల్లాల పునర్విభజన, స్థానిక రిజర్వేషన్లపై చర్చ అవసరం
- ప్రొఫెసర్ కోదండరాం
హైదరాబాద్ : జిల్లాల పునర్విభజన, స్థానిక రిజర్వేషన్ల మార్పు అంశాలపై లోతైన చర్చ, అధ్యయనం అవసరమని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్, తెలంగాణ విద్యావంతుల వేదిక గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మా పని మేం చేస్తాం అంటే కుదరదని, ఇది ప్రజాస్వామ్య దేశమని.. ప్రజలకు తెలియాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. జోనల్ వ్యవస్థతో ఇప్పటికే ప్రజల్లో తీవ్ర గందరగోళం ఏర్పడిందని, దీనిపై ప్రభుత్వం ఓ స్పష్టత ఇచ్చి గందరగోళాన్ని పోగొట్టాలన్నారు.ఇందుకు కేబినెట్ కమిటీ, అధికారుల కమిటీలు వం టివి వేసి సమాజంలో ఉన్న అపోహలను తొలగించాలని సీఎం కేసీఆర్‌కు సూచిం చారు. ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ‘తెలంగాణ విద్యా వంతుల వేదిక’ రూపొందించిన ‘మరో ఉదయం’ పుస్తకాన్ని ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ రామచంద్రమూర్తి, ప్రొఫెసర్ హరగోపాల్‌తో కలసి కోదండరాం ఆవిష్కరించారు.
పాలన ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి
ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పాలనా వ్యవస్థలో ప్రజల్ని భాగస్వాములను చేయాలని, ఆ పాలన పారదర్శకంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలన్నారు. స్థానిక రిజర్వేషన్లపై 1970లో సుప్రీంకోర్టులో వాదోపవాదాలు జరిగాయని, ఆ తర్వాత శ్రీకృష్ణ కమిటీ దీనిపై నివేదికను ఇచ్చిందని, వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ప్రాజెక్టులు కట్టేటప్పుడు ఆలోచనా, ప్రజాభిప్రాయ సేకరణ చాలా అవసరమని, దుబారాగా నిధులు ఖర్చు చేస్తే అది రాజ్యాంగ స్ఫూర్తి కాదన్నారు. ‘సాక్షి’ ఈడీ రామచంద్రమూర్తి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థ ఎలా కొనసాగుతుందనే విషయాన్ని ప్రజలు పరిశీలించాలన్నారు.
ఏపీతో పోలిస్తే తెలంగాణ ప్రజలు పోరాటంలో ముందుంటున్నారన్నారు. ఏపీలో రాజధాని పేరిట 32 వేల ఎకరాలు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే ఎలా ఉద్యమించాలనే విషయం వారికి అంతుపట్టట్లేదని, కానీ మల్లన్నసాగర్ విషయంలో ఇక్కడ ప్రజలంతా రోడ్డెక్కి ప్రభుత్వాన్ని ప్రశ్నించారని చెప్పారు. ప్రొ.హరగోపాల్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంగా ఉండి ఉంటే నయీమ్ ముఖ్యమంత్రి అయ్యి ఉండేవాడని, అతడిని పెంచి పోషించింది గత పాలకులేనని ఆరోపించారు. ప్రొఫెసర్ రమా మెల్కొటే, విద్యావంతుల వేదిక అధ్యక్షుడు గురజాల రవీందర్‌రావు, ప్రధా న కార్యదర్శి తిప్పర్తి యాదయ్య, అడ్వొకేట్ జేఏసీ నాయకుడు ప్రహ్లాద, మహిళా విభాగం కన్వీనర్ రమాదేవి ప్రసంగించారు.