సహోద్యోగులపై క్రాడిక్ విచక్షణారహితంగా కాల్పులు జరిపిన బహుళ అంతస్తుల ప్రభుత్వ భవంతి ఇదే, ఘటనాస్థలిలో రక్తసిక్తమైన ఉద్యోగి
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా మరోసారి నెత్తురోడింది. వర్జీనియా రాష్ట్రంలోని వర్జీనియా బీచ్ సిటీలో ఓ ఇంజనీర్ శుక్రవారం తుపాకీతో సహోద్యోగులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ దుర్ఘటనలో 12 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నిందితుడ్ని కాల్చిచంపారు. కాల్పులు జరిపిన వ్యక్తిని డ్వేన్ క్రాడిక్(40)గా గుర్తించారు.
ఈ విషయమై వర్జీనియా బీచ్ పోలీస్ చీఫ్ జేమ్స్ సెర్వెరా మాట్లాడుతూ.. నగర మున్సిపల్ శాఖలోని ప్రజాపనుల విభాగంలో గత 15 సంవత్సరాలుగా డ్వేన్ క్రాడిక్ ఇంజనీర్‌గా సేవలు అందిస్తున్నాడని తెలిపారు. అయితే తన విధుల పట్ల అసంతృప్తిగా ఉన్న డ్వేన్ క్రాడిక్.. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు(స్థానిక కాలమానం) సైలెన్సర్ అమర్చిన తుపాకీతో తన కార్యాలయం ఉన్న వర్జీనియా బీచ్ మున్సిపల్ సెంటర్ వద్దకు చేరుకున్నాడు. ఆఫీసులోకి వచ్చేముందు గేటుదగ్గర ఒకరిని తుపాకీతో కాల్చాడు. అనంతరం మున్సిపల్ శాఖ కార్యాలయాలున్న రెండో భవంతిలోకి దూసుకెళ్లాడు. ఆ భవంతిలోని మూడు అంతస్తుల్లోని సహోద్యోగులపై విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ ముందుకు సాగాడు.
గదుల్లో దాక్కున్న ఉద్యోగులు..
ఈ సందర్భంగా కాల్పుల శబ్దం విన్న కొందరు ఉద్యోగులు.. గది తలుపులు మూసేసి 911కు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, క్రాడిక్‌ను నిలువరించే ప్రయత్నం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో పోలీసులు డ్వేన్ క్రాడిక్‌ను కాల్చిచంపారు. క్రాడిక్ జరిపిన కాల్పుల్లో ఓ కాంట్రాక్టర్‌తో పాటు 11 మంది సహోద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. క్రాడిక్ ఈ హత్యలు ఎందుకు చేశాడు? సహోద్యోగులతో ఏమైనా గొడవపడ్డాడా? ఉన్నతాధికారులు మందలించారా? అన్న విషయమై పోలీసులు స్పష్టత ఇవ్వలేదు. ఇది వర్జీనియాబీచ్ చరిత్రలోనే అత్యంత దుర్దినమని నగర మేయర్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment