భూగోళం మండిపోతున్నది!
జెనీవా: ఈ ఏడాది భూగోళం మరింతగా మండిపోతున్నది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్నది. వాతావరణ మార్పులపై పారిస్ లో మరో వారంలో కీలక సదస్సు జరుగనున్న నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి వాతావరణ సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. 2015 సంవత్సరం అత్యంత వేడిమి నమోదైన సంవత్సరంగా రికార్డులకెక్కనుందని తెలిపింది.
'2015 అత్యంత వేడిమి నమోదైన సంవత్సరంగా రికార్డులకెక్కే అవకాశం కనిపిస్తున్నది. ఉష్ణోగ్రతల నమోదు మొదలైన నాటినుంచి ఈ సంవత్సరమే సముద్రాల టెంపరేచర్ అత్యధిక స్థాయిలో పెరిగింది' అని ప్రపంచ వాతావరణ సంస్థ అధిపతి మిచేల్ జరూద్ తెలిపారు. ఇది మన భూగోళానికి తీవ్ర ప్రతికూల విషయమని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఏడాది తొలి పదినెలల్లో భూమి, సముద్రాల్లో ఉష్ణోగ్రతలు అత్యధిక స్థాయిలో నమోదయ్యాయని, 2014లో నమోదైన అత్యధిక స్థాయిని అవి దాటాయని ఆయన వివరించారు. 19 శతాబ్దంతో పోల్చుకుంటే ఉపరితల ఉష్ణోగ్రతల సగటు అంతర్జాతీయంగా 1.0 డిగ్రీలు పెరిగిందని ప్రాథమిక వివరాలను బట్టి తెలుస్తున్నదని, ఇది అత్యంత కీలక విషయమని తెలిపారు.
నానాటికీ ఉష్ణోగ్రతలు పెరిగిపోయి భూగోళం మండిపోతున్న నేపథ్యంలో ఇప్పటికీ మన చేతుల్లో పరిష్కారం ఉందని, వాతావరణంలోకి విడుదలయ్యే గ్రీన్ హౌస్ వాయువులను నియంత్రించడమే ఇందుకు ఉన్న పరిష్కారమని ఆయన చెప్పారు.