hottest year
-
వామ్మో 2023!
భూతాపం విషయంలో 2023 కనీవినీ ఎరగని రికార్డు సృష్టించింది. అత్యంత వేడిమి డిసెంబర్ నెల ముగియక ముందే 2023 రికార్డులకెక్కడం తెలిసిందే. అయితే చరిత్రలో ఇప్పటిదాకా అత్యధికంగా 1.48 డిగ్రీల సగటు ఉష్ణోగ్రత పెరుగుదల నమోదైన ఏడాదిగా 2023 నిలిచింది! 2016 నాటి రికార్డు కంటే ఇది ఏకంగా 0.17 డిగ్రీలు అధికం! అదే 1991–2020 మధ్య 20 ఏళ్ల సగటుతో పోలిస్తే ఏకంగా 0.6 డిగ్రీలు ఎక్కువ!! గతేడాదికి సంబంధించిన ఉష్ణోగ్రతల గణాంకాలను క్షుణ్నంగా విశ్లేషించిన మీదట యూరోపియన్ యూనియన్ వాతావరణ పర్యవేక్షణ సంస్థ కోపర్నికస్ మంగళవారం విడుదల చేసిన నివేదిక ఈ మేరకు పేర్కొంది. అంతేకాదు, 2023 రెండో అర్ధ భాగంలో దాదాపుగా ప్రతి రోజూ ఎండ తీవ్రతలో కొత్త రికార్డులు నెలకొల్పినట్టు తేల్చింది! ఇది నిజంగా భయానక పరిణామమేనని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు... – సాక్షి, నేషనల్ డెస్క్ 2023 నవంబర్ 17. భూ ఉష్ణోగ్రతలో ఏకంగా 2.06 డిగ్రీల పెరుగుదల నమోదైన తేదీ! మానవ చరిత్రలో ఉష్ణోగ్రతల పెరుగుదలను రికార్డు చేయడం మొదలు పెట్టినప్పటి నుంచీ అత్యధిక పెరుగుదల అదే! అలా మానవాళి చరిత్రలో ఓ దుర్దినంగా నవంబర్ 17న నిలిచిపోయింది. తర్వాత అదే నెలలో మరోసారి ఉష్ణోగ్రత పెరుగుదల 2 డిగ్రీలను దాటేసింది. దాంతో పర్యావరణవేత్తల్లో గగ్గోలు మొదలైంది. కానీ 2023 రెండో భాగంలో, అంటే జూలై నుంచి డిసెంబర్ దాకా ప్రతి రోజూ ఎండలు కనీవినీ ఎరగని రీతిలో ప్రపంచాన్ని అల్లాడించాయని కోపర్నికస్ తాజా నివేదిక తేల్చింది. పైగా 2023లో 1.48 డిగ్రీల సగటు ఉష్ణోగ్రత పెరుగుదల నమోదవడమూ భయపెట్టే పరిణామమే. భూ ఉష్ణోగ్రతలో పెరుగుదలను పారిశ్రామికీకరణనాటి తొలినాళ్లతో, అంటే 1850–1900 సంవత్సరాల మధ్య కాలపు సగటుతో పోల్చి చెబుతారు. అప్పటితో పోలిస్తే దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ 1.5 డిగ్రీల కంటే దిగువకు కట్టడి చేయాలన్నది 2015 నాటి పారిస్ ఒప్పందంలో ప్రపంచ దేశాలన్నీ సంయుక్తంగా చేసుకున్న తీర్మానం. కానీ 2023లో సగటు ఉష్ణోగ్రత పెరుగుదల దాదాపుగా ఆ లక్ష్మణరేఖను తాకింది. 1850తో పోలిస్తే గతేడాది ప్రతి రోజూ ఉష్ణోగ్రతలో 1 డిగ్రీ కంటే ఎక్కువ పెరుగుదల నమోదైంది! 2015లో తొలిసారిగా ఒక్క రోజు ఇలా 1 డిగ్రీ పెరుగుదల నమోదైతేనే ప్రపంచమంతా విస్మయపడింది. అది కాస్తా కేవలం ఏడేళ్లకే రోజువారీ పరిణామంగా మారిపోయింది. పైగా సగటు పెరుగుదలే దాదాపుగా 1.5 డిగ్రీలను తాకేసింది. గ్లోబల్ వారి్మంగ్ అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోతోందనేందుకు ఇంతకు మించిన తార్కాణం అవసరం లేదని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ లెక్కన 2024లో ఉష్ణోగ్రత సరికొత్త రికార్డులు సృష్టించి భూగోళాన్ని మరింత వినాశనం దిశగా నెట్టడం ఖాయమని తాజా నివేదికలో కోపర్నికస్ కూడా అంచనా వేయడం మరింత ఆందోళన కలిగిస్తోంది. జూన్‌లోపే సగటు భూతాపోన్నతి 1.5 డిగ్రీలను దాటేస్తే ఆశ్చర్యం లేదని అది అభిప్రాయపడింది. అదే జరిగితే భూమిపై కీలక పర్యావరణ వ్యవస్థల్లో చాలావరకు అంతటి తాపాన్ని తట్టుకోలేవు. అప్పుడిక ప్రపంచంలో ఒకవైపు తీవ్ర కరువులు, కార్చిచ్చులు, మరోవైపు భయంకరమైన తుపాన్లు నిత్య సమస్యలుగా మారిపోతాయి. గతేడాది అమెరికా, కెనడా, హవాయి, దక్షిణ యూరోప్‌ల్లో నిత్యం కార్చిచ్చులు చెలరేగడం, పలు దేశాలు కనీవినీ ఎరగని వరదలతో, గడ్డకట్టించే చలి పరిస్థితులతో అతలాకుతలం కావడం తెలిసిందే. వాతావరణ మార్పులు, ఎల్ నినో... 2023 ఇంతగా మండిపోవడానికి వాతావరణ మార్పులే ప్రధాన కారణమని కోపర్నికస్ నివేదిక స్పష్టం చేసింది. దానికి తోడు గతేడాది జూలైకల్లా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో నెలకొన్న ఎల్ నినో (కరువు) పరిస్థితులు పరిస్థితిని మరింత దిగజార్చినట్టు వివరించింది. ఫలితంగా పసిఫిక్ మొదలుకుని ప్రతి మహాసముద్రమూ ఎప్పుడూ లేనంతగా వేడెక్కినట్టు పేర్కొంది. 1991–2020 సగటుతో పోలిస్తే 2023లో సముద్రాల సగటు ఉష్ణోగ్రత పెరుగుదల ఏకంగా 0.44 డిగ్రీలుగా నమోదైంది! దాంతో మంచు ప్రాంతాలైన ఆర్కిటిక్, అంటార్కిటికాలపై దీని ప్రభావం విపరీతంగా పడటం మొదలైంది. అక్కడి మంచు ఎన్నడూ లేనంతగా కొన్నాళ్లుగా శరవేగంగా కరిగిపోతోంది. ఈ దెబ్బకు సముద్ర మట్టాలు ప్రమాదకరంగా పెరిగేలా కనిపిస్తున్నాయి. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా తీర ప్రాంత మహా నగరాలు చాలావరకు నీట మునుగుతాయి. అదే జరిగితే ప్రపంచంలో కనీసం మూడో వంతు జనాభా నిర్వాసితులుగా మారతారని అంచనా. ఊహించుకోవడానికే భయం కలిగే ఇలాంటి పరిణామాలెన్నో అతి త్వరలో జరిగేలా కనిపిస్తున్నాయని సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు. -
2023.. అత్యంత వేడి సంవత్సరం !
దుబాయ్: నెల రోజుల్లో ముగిసిపోనున్న 2023 ఏడాది.. చరిత్రలోనే అత్యంత వేడి సంవత్సరంగా రికార్డులకెక్కనుందని ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంఓ) గురువారం నివేదించింది. నివేదిక తాలూకు వివరాలు నేచర్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. పారిశ్రామిక విప్లవం ముందునాటి కాలంతో పోలిస్తే ఈ ఏడాది 1.4 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత పెరిగిందని డబ్ల్యూఎంఓ ప్రధాన కార్యదర్శి పిటేరీ టాలస్ చెప్పారు. ‘‘ఈ ఏడాది తొలినాళ్లలో పసిఫిక్ మహాసముద్ర ఉపరితర జలాలు వేడెక్కి సంభవించిన ‘ఎల్‌నినో’ పరిస్థితి కారణంగా వచ్చే ఏడాది సగటు ఉష్ణోగ్రత 1.5 డిగ్రి సెల్సియస్‌ను దాటనుంది. మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా వచ్చే నాలుగేళ్లు 1.5 డిగ్రీ సెల్సియస్ నమోదయ్యే వీలుంది. ఆ తర్వాత దశాబ్దంలో ఇది సర్వసాధారణ స్థితిగా నిలిచిపోయే ప్రమాదముంది’’ అని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. -
రికార్డు సృష్టించిన 2016
మరాకెచ్: అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరంగా 2016 రికార్డులకెక్కింది. ఈ మేరకు ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) మొరొకాన్ నగరంలో సోమవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మరింత అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది. నివేదిక ప్రకారం ఈ ఏడాది సాధారణ ఉష్ణోగ్రతల కంటే 1.2 డిగ్రీల సెల్సియస్ మేరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించింది. భారతదేశంలో రాజస్తాన్ లోని పలోడీలో ఈ ఏడాది మే నెలలో అత్యధికంగా 51 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు చెప్పింది. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ ముందస్తు హెచ్చరికలను గమనించి విపత్తు నిర్వహణను, వాతావరణాన్ని అంచనా వేసే విధానాలను మరింత ధృడపరుచుకోవాలని డబ్ల్యూఎంవో సూచించింది. ఈ ఏడాది వేడి గాలులు కూడా అత్యంత ఎక్కువగా వీచాయని తెలిపింది. -
రికార్డు సృష్టించిన 2016
-
ఈ ఏడాది ఎండల తీవ్రత ఎక్కువ
న్యూఢిల్లీ: ఈసారి కూడా ఈ సీజన్లో ఎండలు మండిపోనున్నాయి. ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఎండలు సాధారణంగా ఉండేదానికన్నా కనీసం ఒక్క డిగ్రీ సెల్సియస్ ఎక్కువగా ఉంటాయని భారత మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. ఎప్పుడూ వర్షాకాలాన్ని మాత్రమే అంచనా వేసే ఈ విభాగం మొట్టమొదటి సారిగా ఎండల తీవ్రతను అంచనావేసి బులెటిన్ విడుదల చేసింది. ముఖ్యంగా ఉత్తరాదిలోని ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, సాధారణ ఉష్ణోగ్రతకన్నా కనీసం ఒక డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ బులెటిన్ తెలియజేస్తోంది. గతేడాది వేసవి గాలుల వల్ల దేశవ్యాప్తంగా 2,500 మంది మరణించారని, ఇక అలాంటి మరణాలు సంభవించకూడదనే ఉద్దేశంతో ఎండల తీవ్రతను కూడా ఎప్పటికప్పుడు అంచనావేసి అలర్ట్‌లను విడుదల చేయాలని నిర్ణయించామని భారత మెటరాలోజికల్ డిపార్ట్మెంట్ అధికారులు తెలిపారు. తాము జారీచేసే హెచ్చరికల వల్ల ప్రజలు తగిన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడమే కాకుండా స్థానిక మున్సిపాలిటీలు, ఆరోగ్య కేంద్రాలు కూడా ముందుజాగ్రత్త చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని అధికారులు చెప్పారు. గడచిన జనవరి, ఫిబ్రవరి నెలల్లో కూడా సాధారణ ఉష్ణోగ్రతలు ఎక్కువగానే నమోదయ్యాయని వారన్నారు. గత 2015 సంవత్సరం 1901 సంవత్సరం తర్వాత అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన మూడవ సంవత్సరంగా నమోదైందని వారు చెప్పారు. -
భూగోళం మండిపోతున్నది!
జెనీవా: ఈ ఏడాది భూగోళం మరింతగా మండిపోతున్నది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్నది. వాతావరణ మార్పులపై పారిస్ లో మరో వారంలో కీలక సదస్సు జరుగనున్న నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి వాతావరణ సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. 2015 సంవత్సరం అత్యంత వేడిమి నమోదైన సంవత్సరంగా రికార్డులకెక్కనుందని తెలిపింది. '2015 అత్యంత వేడిమి నమోదైన సంవత్సరంగా రికార్డులకెక్కే అవకాశం కనిపిస్తున్నది. ఉష్ణోగ్రతల నమోదు మొదలైన నాటినుంచి ఈ సంవత్సరమే సముద్రాల టెంపరేచర్ అత్యధిక స్థాయిలో పెరిగింది' అని ప్రపంచ వాతావరణ సంస్థ అధిపతి మిచేల్ జరూద్ తెలిపారు. ఇది మన భూగోళానికి తీవ్ర ప్రతికూల విషయమని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఏడాది తొలి పదినెలల్లో భూమి, సముద్రాల్లో ఉష్ణోగ్రతలు అత్యధిక స్థాయిలో నమోదయ్యాయని, 2014లో నమోదైన అత్యధిక స్థాయిని అవి దాటాయని ఆయన వివరించారు. 19 శతాబ్దంతో పోల్చుకుంటే ఉపరితల ఉష్ణోగ్రతల సగటు అంతర్జాతీయంగా 1.0 డిగ్రీలు పెరిగిందని ప్రాథమిక వివరాలను బట్టి తెలుస్తున్నదని, ఇది అత్యంత కీలక విషయమని తెలిపారు. నానాటికీ ఉష్ణోగ్రతలు పెరిగిపోయి భూగోళం మండిపోతున్న నేపథ్యంలో ఇప్పటికీ మన చేతుల్లో పరిష్కారం ఉందని, వాతావరణంలోకి విడుదలయ్యే గ్రీన్ హౌస్ వాయువులను నియంత్రించడమే ఇందుకు ఉన్న పరిష్కారమని ఆయన చెప్పారు.