వామ్మో 2023!  | 2023 was world hottest year on record | Sakshi
Sakshi News home page

వామ్మో 2023! 

Published Wed, Jan 10 2024 2:23 AM | Last Updated on Wed, Jan 10 2024 2:23 AM

2023 was world hottest year on record - Sakshi

భూతాపం విషయంలో 2023 కనీవినీ ఎరగని రికార్డు సృష్టించింది. అత్యంత వేడిమి డిసెంబర్‌ నెల ముగియక ముందే 2023 రికార్డులకెక్కడం తెలిసిందే. అయితే చరిత్రలో ఇప్పటిదాకా అత్యధికంగా 1.48 డిగ్రీల సగటు ఉష్ణోగ్రత పెరుగుదల నమోదైన ఏడాదిగా 2023 నిలిచింది! 2016 నాటి రికార్డు కంటే ఇది ఏకంగా 0.17 డిగ్రీలు అధికం! అదే 1991–2020 మధ్య 20 ఏళ్ల సగటుతో పోలిస్తే ఏకంగా 0.6 డిగ్రీలు ఎక్కువ!!

గతేడాదికి సంబంధించిన ఉష్ణోగ్రతల గణాంకాలను క్షుణ్నంగా విశ్లేషించిన మీదట యూరోపియన్‌ యూనియన్‌ వాతావరణ పర్యవేక్షణ సంస్థ కోపర్నికస్‌ మంగళవారం విడుదల చేసిన నివేదిక ఈ మేరకు పేర్కొంది. అంతేకాదు, 2023 రెండో అర్ధ భాగంలో దాదాపుగా ప్రతి రోజూ ఎండ తీవ్రతలో కొత్త రికార్డులు నెలకొల్పినట్టు తేల్చింది! ఇది నిజంగా భయానక పరిణామమేనని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు...     – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

2023 నవంబర్‌ 17. భూ ఉష్ణోగ్రతలో ఏకంగా 2.06 డిగ్రీల పెరుగుదల నమోదైన తేదీ! మానవ చరిత్రలో ఉష్ణోగ్రతల పెరుగుదలను రికార్డు చేయడం మొదలు పెట్టినప్పటి నుంచీ అత్యధిక పెరుగుదల అదే! అలా మానవాళి చరిత్రలో ఓ దుర్దినంగా నవంబర్‌ 17న నిలిచిపోయింది. తర్వాత అదే నెలలో మరోసారి ఉష్ణోగ్రత పెరుగుదల 2 డిగ్రీలను దాటేసింది. దాంతో పర్యావరణవేత్తల్లో గగ్గోలు మొదలైంది. కానీ 2023 రెండో భాగంలో, అంటే జూలై నుంచి డిసెంబర్‌ దాకా ప్రతి రోజూ ఎండలు కనీవినీ ఎరగని రీతిలో ప్రపంచాన్ని అల్లాడించాయని కోపర్నికస్‌ తాజా నివేదిక తేల్చింది.

పైగా 2023లో 1.48 డిగ్రీల సగటు ఉష్ణోగ్రత పెరుగుదల నమోదవడమూ భయపెట్టే పరిణామమే. భూ ఉష్ణోగ్రతలో పెరుగుదలను పారిశ్రామికీకరణనాటి తొలినాళ్లతో, అంటే 1850–1900 సంవత్సరాల మధ్య కాలపు సగటుతో పోల్చి చెబుతారు. అప్పటితో పోలిస్తే దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ 1.5 డిగ్రీల కంటే దిగువకు కట్టడి చేయాలన్నది 2015 నాటి పారిస్‌ ఒప్పందంలో ప్రపంచ దేశాలన్నీ సంయుక్తంగా చేసుకున్న తీర్మానం. కానీ 2023లో సగటు ఉష్ణోగ్రత పెరుగుదల దాదాపుగా ఆ లక్ష్మణరేఖను తాకింది.

1850తో పోలిస్తే గతేడాది ప్రతి రోజూ ఉష్ణోగ్రతలో 1 డిగ్రీ కంటే ఎక్కువ పెరుగుదల నమోదైంది! 2015లో తొలిసారిగా ఒక్క రోజు ఇలా 1 డిగ్రీ పెరుగుదల నమోదైతేనే ప్రపంచమంతా విస్మయపడింది. అది కాస్తా కేవలం ఏడేళ్లకే రోజువారీ పరిణామంగా మారిపోయింది. పైగా సగటు పెరుగుదలే దాదాపుగా 1.5 డిగ్రీలను తాకేసింది. గ్లోబల్‌ వారి్మంగ్‌ అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోతోందనేందుకు ఇంతకు మించిన తార్కాణం అవసరం లేదని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ లెక్కన 2024లో ఉష్ణోగ్రత సరికొత్త రికార్డులు సృష్టించి భూగోళాన్ని మరింత వినాశనం దిశగా నెట్టడం ఖాయమని తాజా నివేదికలో కోపర్నికస్‌ కూడా అంచనా వేయడం మరింత ఆందోళన కలిగిస్తోంది.

జూన్‌లోపే సగటు భూతాపోన్నతి 1.5 డిగ్రీలను దాటేస్తే ఆశ్చర్యం లేదని అది అభిప్రాయపడింది. అదే జరిగితే భూమిపై కీలక పర్యావరణ వ్యవస్థల్లో చాలావరకు అంతటి తాపాన్ని తట్టుకోలేవు. అప్పుడిక ప్రపంచంలో ఒకవైపు తీవ్ర కరువులు, కార్చిచ్చులు, మరోవైపు భయంకరమైన తుపాన్లు నిత్య సమస్యలుగా మారిపోతాయి. గతేడాది అమెరికా, కెనడా, హవాయి, దక్షిణ యూరోప్‌ల్లో నిత్యం కార్చిచ్చులు చెలరేగడం, పలు దేశాలు కనీవినీ ఎరగని వరదలతో, గడ్డకట్టించే చలి పరిస్థితులతో అతలాకుతలం కావడం తెలిసిందే. 

వాతావరణ మార్పులు, ఎల్‌ నినో... 
2023 ఇంతగా మండిపోవడానికి వాతావరణ మార్పులే ప్రధాన కారణమని కోపర్నికస్‌ నివేదిక స్పష్టం చేసింది. దానికి తోడు గతేడాది జూలైకల్లా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో నెలకొన్న ఎల్‌ నినో (కరువు) పరిస్థితులు పరిస్థితిని మరింత దిగజార్చినట్టు వివరించింది. ఫలితంగా పసిఫిక్‌ మొదలుకుని ప్రతి మహాసముద్రమూ ఎప్పుడూ లేనంతగా వేడెక్కినట్టు పేర్కొంది. 1991–2020 సగటుతో పోలిస్తే 2023లో సముద్రాల సగటు ఉష్ణోగ్రత పెరుగుదల ఏకంగా 0.44 డిగ్రీలుగా నమోదైంది! దాంతో మంచు ప్రాంతాలైన ఆర్కిటిక్, అంటార్కిటికాలపై దీని ప్రభావం విపరీతంగా పడటం మొదలైంది.

అక్కడి మంచు ఎన్నడూ లేనంతగా కొన్నాళ్లుగా శరవేగంగా కరిగిపోతోంది. ఈ దెబ్బకు సముద్ర మట్టాలు ప్రమాదకరంగా పెరిగేలా కనిపిస్తున్నాయి. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా తీర ప్రాంత మహా నగరాలు చాలావరకు నీట మునుగుతాయి. అదే జరిగితే ప్రపంచంలో కనీసం మూడో వంతు జనాభా నిర్వాసితులుగా మారతారని అంచనా. ఊహించుకోవడానికే భయం కలిగే ఇలాంటి పరిణామాలెన్నో అతి త్వరలో జరిగేలా కనిపిస్తున్నాయని సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement