ఈ ఏడాది ఎండల తీవ్రత ఎక్కువ
న్యూఢిల్లీ: ఈసారి కూడా ఈ సీజన్‌లో ఎండలు మండిపోనున్నాయి. ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఎండలు సాధారణంగా ఉండేదానికన్నా కనీసం ఒక్క డిగ్రీ సెల్సియస్ ఎక్కువగా ఉంటాయని భారత మెట్రోలాజికల్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. ఎప్పుడూ వర్షాకాలాన్ని మాత్రమే అంచనా వేసే ఈ విభాగం మొట్టమొదటి సారిగా ఎండల తీవ్రతను అంచనావేసి బులెటిన్ విడుదల చేసింది.
ముఖ్యంగా ఉత్తరాదిలోని ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, సాధారణ ఉష్ణోగ్రతకన్నా కనీసం ఒక డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ బులెటిన్ తెలియజేస్తోంది. గతేడాది వేసవి గాలుల వల్ల దేశవ్యాప్తంగా 2,500 మంది మరణించారని, ఇక అలాంటి మరణాలు సంభవించకూడదనే ఉద్దేశంతో ఎండల తీవ్రతను కూడా ఎప్పటికప్పుడు అంచనావేసి అలర్ట్‌లను విడుదల చేయాలని నిర్ణయించామని భారత మెటరాలోజికల్ డిపార్ట్‌మెంట్ అధికారులు తెలిపారు.
తాము జారీచేసే హెచ్చరికల వల్ల ప్రజలు తగిన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడమే కాకుండా స్థానిక మున్సిపాలిటీలు, ఆరోగ్య కేంద్రాలు కూడా ముందుజాగ్రత్త చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని అధికారులు చెప్పారు. గడచిన జనవరి, ఫిబ్రవరి నెలల్లో కూడా సాధారణ ఉష్ణోగ్రతలు ఎక్కువగానే నమోదయ్యాయని వారన్నారు. గత 2015 సంవత్సరం 1901 సంవత్సరం తర్వాత అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన మూడవ సంవత్సరంగా నమోదైందని వారు చెప్పారు.