![రికార్డు సృష్టించిన 2016](/styles/webp/s3/article_images/2017/09/4/81479181494_625x300.jpg.webp?itok=4R-TJlTP)
రికార్డు సృష్టించిన 2016
మరాకెచ్: అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరంగా 2016 రికార్డులకెక్కింది. ఈ మేరకు ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) మొరొకాన్ నగరంలో సోమవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మరింత అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది. నివేదిక ప్రకారం ఈ ఏడాది సాధారణ ఉష్ణోగ్రతల కంటే 1.2 డిగ్రీల సెల్సియస్ మేరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించింది.
భారతదేశంలో రాజస్తాన్ లోని పలోడీలో ఈ ఏడాది మే నెలలో అత్యధికంగా 51 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు చెప్పింది. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ ముందస్తు హెచ్చరికలను గమనించి విపత్తు నిర్వహణను, వాతావరణాన్ని అంచనా వేసే విధానాలను మరింత ధృడపరుచుకోవాలని డబ్ల్యూఎంవో సూచించింది. ఈ ఏడాది వేడి గాలులు కూడా అత్యంత ఎక్కువగా వీచాయని తెలిపింది.