అమెరికా అధ్యక్షుడు ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్, దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై జరుగుతోన్న దర్యాప్తులో డెమోక్రాట్లతో ఎఫ్‌బీఐ, న్యాయ విభాగం కుమ్మక్కయ్యాయని ఆరోపిస్తూ ట్రంప్ పార్టీకి చెందిన రిపబ్లికన్లు ఎఫ్‌బీఐపై ‘మెమో’ విడుదల చేశారు. ఎఫ్‌బీఐ వద్దని వారిస్తోన్నా వినకుండా ట్రంప్ ఈ మెమోను ఆమోదించి హౌస్ ఇంటెలిజెన్స్ కమిటీలకు పంపారు. మెమోరాండంలో వెల్లడైన వివరాలు సిగ్గుచేటని ట్రంప్ అన్నారు.
రష్యా జోక్యంపై విచారణలో ట్రంప్ ప్రచార బృందానికి చెందిన మాజీ సలహాదారుడి విషయంలో అధికారులు కోర్టును తప్పు దారి పట్టించారని మెమోలో ఆరోపించారు. అందులోని అంశాల్ని పరిశీలిస్తే న్యాయశాఖ, ఎఫ్‌బీఐలకు చెందిన ఉన్నతస్థాయి అధికారులు తీసుకున్న నిర్ణయాల నైతికతపై ఆందోళన వ్యక్తమవుతోందని వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి సాండర్స్ అన్నారు. ప్రతినిధుల సభకు చెందిన ఇంటెలిజెన్స్ చైర్మన్ డెవిన్ న్యూనెస్ రూపొందించిన ఈ మెమోలో.. ‘ డెమోక్రాట్ల తరఫున బ్రిటిష్ నిఘా ప్రతినిధి క్రిస్టోఫర్ స్టీల్ రాసిన పరిశోధన వివరాల్ని దర్యాప్తులో ఎఫ్‌బీఐ వాడుకుంది’ అని ఆరోపించారు.
అధ్యక్షుడి జాతీయ భద్రతా బృందం నుంచి అందిన సమాచారం ఆధారంగా దీనిని రూపొందించినట్లు శాండర్స్ తెలిపారు. రిపబ్లికన్ సభ్యుడు డానా రోహ్రబచెర్ మాట్లాడుతూ.. మెమోతో వాస్తవాలు వెలుగుచూశాయని చెప్పారు. ‘పోలీసు, నిఘా విభాగాలు కూడా కొన్నిసార్లు రాజీపడతాయి. ఎప్పటికప్పుడు అలాంటి దుర్వినియోగం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అందుకే అన్ని ఫెడరల్ దర్యాప్తు విభాగాలపై అమెరికన్ చట్ట సభల పర్యవేక్షణ ఉండాలి’ అని అన్నారు. పారదర్శకత కోసం ట్రంప్ శ్రమిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ‘ఎఫ్‌బీఐ విచారణకు డెమోక్రాట్లు సాయపడ్డారు. గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకు చేసిన ప్రయత్నమే ఇది. ఇది వాటర్‌గేట్ కుంభకోణంతో పోల్చదగిన స్థాయిలో ఉంది’ అని అన్నారు. ఈ వ్యవహారంపై ఎఫ్‌బీఐ మాత్రం నోరు మెదపలేదు.
Comments
Please login to add a commentAdd a comment