
కారు బాంబు పేలుడులో 40 మంది మృతి
పెషావర్: పాకిస్థాన్‌లోని పెషావర్ నగరం వారం రోజుల వ్యవధిలో మూడోసారి భారీ పేలుడుతో దద్దరిల్లింది. ఆదివారం చారిత్రక కిసా ఖ్వామీ మార్కెట్‌లో ఓ కారులో ఉంచిన శక్తిమంతమైన బాంబు పేలడంతో 40 మంది మృతి చెందగా, 80 మందికిపైగా గాయపడ్డారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది ఉన్నారు. నిలిపి ఉన్న కారులో దుండగులు 220 కేజీల పేలుడు పదార్థాలు ఉంచి రిమోట్ కంట్రోల్‌తో పేల్చేశారని పోలీసులు చెప్పారు.
పేలుడు ధాటికి 50 దుకాణాలు, పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. పెళ్లి కోసం చార్‌సద్దా జిల్లా నుంచి నగరానికి వచ్చిన 13 మంది సభ్యుల కుటుంబంలోని 9 మంది ఈ దుర్ఘటనలో అసువులు బాశారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, నలుగురు పిల్లలు ఉన్నారు. నిలిపి ఉన్న ఓ కారును అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లాలని పోలీసు అధికారి ఒకరు ఓ డ్రైవర్‌కు చెప్పాక బాంబు పేలినట్లు అధికారులు తెలిపారు. పేలుడు తమ పని కాదని తాలిబన్లు ప్రకటించారు.