43 మంది తాలిబాన్ ఉగ్రవాదులు హతం
కాబూల్: ఆఫ్గనిస్తాన్ భద్రతా బలగాలు 'థండర్ 14' పేరుతో చేపట్టిన జాయింట్ ఆపరేషన్‌లో 43 మంది తాలిబాన్ ఉగ్రవాదులు హతమయ్యారు. కుందుజ్ ప్రావిన్స్‌లోని తాలిబాన్ ఉగ్రవాదులపై చేపట్టిన ఈ ఆపరేషన్లో భద్రతా బలగాలకు ఎయిర్ ఫోర్స్ సహకరించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో మరో 15 మంది ఉగ్రవాదులు తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు.
తాలిబాన్ ఉగ్రవాదులు శనివారం ఖాన్ అబాద్ జిల్లాను తమ ఆధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నించారు. కుందుజ్ పట్టణానికి సమీపంలో ఉన్న ఈ వ్యూహాత్మక జిల్లాను భద్రతా బలగాలు వెంటనే తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయని మీడియా సంస్థ 'జిన్హువా' తెలిపింది. ఈ ఆపరేషన్‌లో తాలిబాన్ డిస్ట్రిక్ట్ గవర్నర్ హుస్సేన్ సైతం మృతి చెందినట్లు వెల్లడించింది. కుందుజ్ ప్రాంతంలో పట్టుకోసం తాలిబాన్‌లు ప్రయత్నిస్తుండటంతో గత రెండు మాసాల నుంచి ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.