టీనేజ్ మిలియనీర్లు.. | 5 Youngest Millionaires Around the World | Sakshi
Sakshi News home page

టీనేజ్ మిలియనీర్లు..

Published Sat, May 28 2016 11:25 AM | Last Updated on Mon, Sep 4 2017 1:08 AM

టీనేజ్ మిలియనీర్లు..

టీనేజ్ మిలియనీర్లు..

అద్భుతమైన ఆలోచనలను ఆచరణలో పెట్టి విజయం సాధించే సత్తా ఉండాలే కానీ వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు వయసుతో పనిలేదు.

అద్భుతమైన ఆలోచనలను ఆచరణలో పెట్టి విజయం సాధించే సత్తా ఉండాలే కానీ వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు వయసుతో పనిలేదు. అందరిలాగా చదువు.. మార్కులు, ర్యాంకులు అంటూ ఉండిపోకుండా.. తమలోని సృజనాత్మకతకు పదును పెట్టి వ్యాపార రంగంలో విజయపథాన నడిచిన బాలలు చాలామందే ఉన్నారు. బాల్యంలోనే వ్యాపారం ప్రారంభించి, విజయం సాధించిన కొందరు టీనేజర్ల గురించి తెలుసుకుందాం..
 
ఎరిక్ ఫిన్‌మన్..
అమెరికాకు చెందిన ఎరిక్ ఫిన్‌మన్ చిన్నప్పటినుంచి చదువులో చురుకుగానే ఉండేవాడు. అయితే పాఠశాలలో నిత్యం తోటి విద్యార్థుల నుంచి శారీరకంగా, మానసికంగా వేధింపులు ఎదుర్కొనేవాడు. దీంతో తరచూ అనేక పాఠశాలలు మారాల్సి వచ్చేది. చివరకు పదిహేనేళ్లు వచ్చేసరికి ఈ వేధింపులు భరించలేక పాఠశాలకు వెళ్లడమే మానేశాడు. అయితే విద్యార్జనకు మాత్రం దూరం కాలేదు. ఇంట్లోనే ఉండి కంప్యూటర్ సాయంతో వివిధ కొత్త కోర్సులు నేర్చుకున్నాడు. తను నేర్చుకున్న విషయాలతో బోటాంగిల్ (రోబోటిక్స్, యాంగిల్ల కలయికతో రూపొందింది) ప్రాజెక్టును చేపట్టాడు.

తనలాగే చాలామంది పాఠశాలల్లో వేధింపులకు గురవుతూ, చదువుపై దృష్టి సారించలేకపోతున్నారని, అలాంటివారికి ఇంటినుంచే చదువుకునే అవకాశం కల్పించాలనే లక్ష్యంతో బోటాంగిల్‌ను రూపొందించాడు. ఇదో ఆన్‌లైన్ ఎడ్యుకేషనల్ పోర్టల్. పదిహేనేళ్ల వయసులో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు వాళ్ల నాన్నమ్మ వెయ్యి డాలర్లు అందించింది. ఈ డబ్బుతో ఎరిక్ బోటాంగిల్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాడు. ఈ దశలో ఇది మంచి విజయం సాధించింది. దీనికి బిట్‌కాన్ సంస్థ ఆర్థిక తోడ్పాటును అందించింది. ఎరిక్‌కు లక్ష డాలర్లు అందించింది. ఈ తోడ్పాటుతో బోటాం గిల్‌ను మరింతగా అభివృద్ధి చేసేం దుకు ఎరిక్ ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సంస్థలో దాదాపు 20 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. టీనేజ్‌లోనే ఎరిక్ చేసిన ప్రయత్నం అతడ్ని లక్ష డాలర్ల సంస్థకు అధిపతిని చేసిం ది. భవిష్యత్‌లో మరింత వృద్ధి దిశగా ఎరిక్ యత్నిస్తున్నాడు.

 
ఎలినా మోర్స్..
లాలీపాప్స్ అంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అయితే వీటిని ఎక్కువగా తింటే దంతాలు పాడైపోతాయి. దంతాలు పాడవకుండా, ఆరోగ్యాన్నిచ్చే లాలిపాప్స్ తయారు చేయాలనే ఆలోచనతో రూపొందినవే జాలీపాప్స్. వీటిని రూపొందించింది ఎలినా మోర్స్. తనకెంతో ఇష్టమైన చెల్లికి, మంచి లాలీపాప్స్ అందించాలనే సంకల్పంతో ఏడేళ్ల వయస్సులో ఎలినా జాలీపాప్స్‌ని తయారు చేసింది.

ఫ్రూట్ ఫ్లేవర్‌లో ఉండే వీటిని దంతాలకు హాని కలిగించని పదార్థాలతో, బీట్‌రూట్ రసంతో తయారు చేసింది. 7,500 డాలర్ల పెట్టుబడితో ప్రారంభమైన జాలీపాప్‌ల తయారీ సంస్థ ప్రస్తుతం లక్షల డాలర్ల విలువ కలిగి ఉంది. జాలీపాప్స్ తయారీ ఎలినాకు వ్యాపారవేత్తగా ఎనలేని ఖ్యాతిని తెచ్చిపెట్టింది. అమెరికా ప్రథమ మహిళ మిచెల్లీ ఒబామా రెండు సార్లు ఎలినాను వైట్‌హౌస్‌కు ప్రత్యేక అతిథిగా కూడా ఆహ్వానించారు. అలా ప్రస్తుతం పదేళ్ల వయసు కలిగిన ఎలినా ఓ మిలియన్ డాలర్ల వ్యాపార సంస్థకు అధిపతిగా కొనసాగుతోంది.
 

ఇసబెల్లా రోస్ టేలర్..
ఫ్యాషన్ రంగంలో రాణించడానికి కావాల్సింది సృజనాత్మకత. దీనికి వయసుతో పనిలేదు. అందుకే అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన ఇసబెల్లా రోస్ టేలర్ ఫ్యాషన్ ప్రపంచంలో దూసుకుపోతోంది. దాదాపు మూడేళ్లక్రితం పన్నెండేళ్ల వయస్సులోనే తన పేరుమీద ఇసబెల్లా రోస్ టేలర్ పేరుతో డిజైనర్ వేర్ కలెక్షన్‌ను ప్రారంభించింది.

వివిధ రంగులు, గ్రాఫిక్స్, డిజైన్లతో ఇసబెల్లా రూపొందించిన దుస్తులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అమెరికాలో అత్యధిక మార్కెట్ కలిగిన యువ డిజైనర్‌గా ఇసబెల్లాకు ఫ్యాషన్ రంగంలో గుర్తింపు దక్కింది. ఇంట్లోనే విద్యనభ్యసించిన ఇసబెల్లా ఈ రంగంలో రాణించడంలో తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉంది. ప్రస్తుతం తన పేరు మీద విక్రయిస్తున్న దుస్తులతో టీనేజ్‌లోనే ఇసబెల్లా లక్షల డాలర్లు ఆర్జిస్తోంది.
 

బెల్లా వీమ్స్..
టీనేజ్‌లోనే వ్యాపార సంస్థను ప్రారంభించి విజయం సాధించిన వ్యాపారవేత్తల్లో బెల్లావీమ్స్ ఒకరు. అమెరికాలోని ఆరిజోనా ప్రాంతానికి చెందిన బెల్లాకు బ్రేస్‌లెట్లు, నెక్‌లెస్‌లు, లాకెట్లు వంటి ఆభరణాలు అంటే చాలా ఇష్టం. బెల్లా వీటిని సొంతంగానే తయారు చేసుకునేది. తనకు చిన్నప్పటి నుంచి కారు కొనుక్కోవాలని కోరిక. ఈ కోరికను తల్లిదండ్రులకు చెబితే కారు కొనుక్కునేందుకు ఒక్క డాలర్ కూడా ఇవ్వమని, సొంతంగా కష్టపడిన డబ్బులతోనే కొనుక్కోవాలని సూచించారు. ఎలాగైనా కారు కొనుక్కోవాలనే తన కోరికను నెరవేర్చుకోవడం కోసం తన ప్రతిభకు పదును పెట్టింది.


దాదాపు పద్నాలుగేళ్ల వయసులో (2010) తనకు తెలిసిన నగలు తయారు చేసి, ఓ సంస్థను స్థాపించింది. ఆ సంస్థ పేరు ఒరిగామి ఓల్. వినియోగదారులు కోరుకునే డిజైనర్ నగలను తయారు చేయడం ఈ సంస్థ ప్రత్యేకత. దీంతో ఒరిగామి ఓల్ పెద్ద విజయం సాధించింది. ప్రస్తుతం ఈ సంస్థ విలువ దాదాపు 250 మిలియన్ డాలర్లుగా ఉంది.
 

మేడిసన్ రాబిన్‌సన్..
ఆసక్తితో చేసే చిన్న ప్రయత్నాలు కూడా ఒక్కోసారి జీవితాన్ని మార్చేస్తాయి. అందుకు ఉదాహరణ మేడిసన్ రాబిన్‌సన్. ఆస్ట్రేలియాకు చెందిన మేడిసన్‌కు బీచ్‌లో ఆడుకోవడమన్నా, సముద్రపు జీవులన్నా చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే దాదాపు పదేళ్లక్రితం వయసులో సముద్రపు జీవుల స్ఫూర్తితో కొన్ని పాదరక్షలు రూపొందించింది. వీటిపై పలు జలచరా చిత్రాల్ని ముద్రించింది.

ఎలా మార్కెటింగ్ చేసుకోవాలో తెలియక ఓ రిటైల్ ట్రేడ్ ఎగ్జిబిషన్‌లో వీటిని ప్రదర్శించింది. ఆ డిజైన్లు చూసి ఆశ్చర్యపోయిన పలు పాదరక్షల తయారీ సంస్థలు మేడిసన్‌కు భారీ ఆర్డర్లు ఇచ్చాయి. దీంతో ఎనిమిదేళ్ల వయసులో మేడిసన్ తయారు చేసిన పాదరక్షలు ఆమెకు లక్షల డాలర్లు తెచ్చిపెట్టాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement