ఆ 6గురు జూన్ 1 లోపే ఎందుకు చనిపోయారు?
ఆ 6గురు జూన్ 1 లోపే ఎందుకు చనిపోయారు?
Published Wed, May 28 2014 3:42 PM | Last Updated on Wed, Sep 5 2018 2:14 PM
చైనాలో ఆరుగురు వృద్ధులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకుంటూ చేసుకుంటూ 'మమ్మల్ని పూడ్చి పెట్టండి. మా శవాలను కాల్చొద్దు' అని లేఖ రాసి చనిపోయారు. అంతే కాదు. తాము జూన్ 1 కి ముందే చనిపోతున్నాం కనక తమను కాల్చడానికి వీల్లేదు అని కూడా వారు చెప్పుకున్నారు.
అసలు సమస్యేమిటంటే చైనాలో మృతులను ఖననం చేయడం, వారి జ్ఞాపకార్థం సమాధి కట్టడం ఆచారం. తరతరాలుగా ఈ ఆచారం కొనసాగుతోంది. అయితే జనాభా విపరీతంగా పెరిగిపోవడంతో చనిపోయిన ప్రతివారినీ పూడ్చిపెడితే ఆఖరికి దేశంలో అంగుళం కూడా మిగిలే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే చైనా జూన్ 1 తరువాత నుంచి సమాధి చేయడాన్ని పూర్తిగా నిషేధించింది.
ఈ వార్త వినగానే ఆరుగురు వృద్ధులు తమకు సమాధులుండవేమోనని భయపడ్డారు. అందుకే జూన్ 1 లోపే చనిపోతే సమాధులుంటాయని మే 28 నే ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ సంఘటన అన్ హుయ్ ప్రాంతంలోని ఆంకింగ్ నగరంలో జరిగింది.
చనిపోయిన వారిలో 83 ఏళ్ల ఝెంగ్ షిఫాంగ్ అనే ఆమె ముందుగానే తన శవపేటికను తయారు చేసి ఉంచుకుంది. కానీ ఆ శవపేటికను అధికారులు కొత్త చట్టాల మేరకు ధ్వంసం చేశారు. దీంతో ఆమె పొడుచుకుని ఆత్మహత్య చేసుకుంది. ఒక మహిళ బావిలోకి దుంకి చనిపోతే, మిగతా వారు విషం తాగారు.
చైనాలో సమాధులను నేలమట్టం చేసే ఉద్యమాన్ని ప్రభుత్వం చేపట్టింది. దీని పట్ల ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. రెండేళ్ల క్రితం 4 లక్షల సమాధులను ప్రభుత్వం నేలమట్టం చేసింది. అయితే తీవ్ర ప్రజావ్యతిరేకత నేపథ్యంలో అప్పట్లో ఈ సమాధి విధ్వంస ఉద్యమం ఆగిపోయింది.
Advertisement
Advertisement