విమానం వాష్రూమ్లో బంగారుకొండ!
పణాజి: ఒక వేళ మీరుగానీ ఆ విమానంలో ప్రయాణించి ఉంటే.. అందులోని వాష్ రూమ్ లోకి వెళ్లుంటే.. ఆ మూలన ఉన్న చిన్నపాటి బంగారుకొండను చూసి అదిరిపోయేవారు. ఒకటికాదు, రెండు కాదు ఏకంగా ఏడు కేజీల బంగారమది. ఓనరంటూ ఎవ్వరూలేని, ఓ నలుపు రంగు బ్యాగ్ లో దాగున్న ఆ బంగారాన్ని గోవా అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఖతార్ నుంచి వచ్చిన ఖతార్ ఎయిర్ వేస్ విమానం వాష్ రూమ్ లో లభించిన బంగారం ఎక్కడ్నుంచి వచ్చిందో ప్రస్తుతానికి ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. విమానం సిబ్బందేమో 'మాకు తెలియదంటే మాకు తెలియదు' అని తడుముకోకుండా చెబుతున్నారు.
ఏదైనా విమానం ల్యాండ్ అయ్యాక, మళ్లీ టేకాఫ్ అయ్యే ముందు దానిని క్షుణ్నంగా తనిఖీ చేయడం అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లోనూ రోజూ జరిగేదే. అలా బుధవారం ఖతార్ నుంచి వచ్చిన విమానాన్ని తనిఖీ చేస్తుండగా టాయిలెట్ లో ఒక మూలన బంగారు ఆభరణాలతో నిండిన బ్యాగ్ దొరికింది అధికారులకు. బయటికి తీసుకొచ్చి తూస్తే వాటి బరువు 7.12 కిలోలుఉంది. విలువ ఎంతుందనేది లెక్కలుకట్టాక చెబుతామని, ఆలోపు ఈ బ్యాగ్ ఎవరిదో కనిపెడతామని చెప్పారు గోవా డివిజన్ కస్టమ్స్ కమిషనర్ అన్పజఖన్.