
అమెరికా నుంచి సాక్షి ప్రతినిధి: ‘‘అమెరికాలో 93 వేలకు పైగా పరిశ్రమలను నడుపుతోంది ప్రవాస భారతీయ మహిళలే. కానీ వీళ్ల రెవెన్యూ వాటా 2.9 శాతం మాత్రమే. అమెరికాలో మొత్తం 36 శాతం మహిళా పారిశ్రామికవేత్తలున్నారు. అయితే వీళ్లకు దక్కుతున్న కాంట్రాక్టులు చాలా తక్కువ..’’అని అమెరికా విమెన్ చాంబర్ ఆఫ్ కామర్స్ సీఈవో, సహ వ్యవస్థాపకురాలు మార్గట్ డార్ఫ్‌మన్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో 28 నుంచి జరగనున్న అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సు నేపథ్యంలో వాషింగ్టన్‌లోని ఫారిన్‌ప్రెస్ బిల్డింగ్‌లో ఆమె తాజాగా భారత మీడియా బృందంతో మాట్లాడారు.
అమెరికా ప్రభుత్వం నుంచి మహిళా పారిశ్రామికవేత్తలకు అందుతున్న కాంట్రాక్టులు ఐదు శాతం కూడా లేవని చెప్పారు. ‘‘నిజానికి మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ కాంట్రాక్టులు ఇవ్వాలని 2000లో ఓ బిల్లు కూడా పాసయింది. కానీ దాన్ని అమలు చేయడంలో పాలనా విభాగం విఫలమైంది. దాంతో మేం కోర్టులో ఓ పిటిషన్ వేసి 2005లో విజయం సాధించాం. అయినా కాంట్రాక్టులు అంతంత మాత్రమే దక్కుతున్నాయి. వారికి ఎక్కువ కాంట్రాక్టులు దక్కేలా ఇంకా కృషి చేస్తున్నాం. మా సంస్థ ఏర్పాటు లక్ష్యం కూడా అదే..’’అని ఆమె వివరించారు.
కాంట్రాక్టులు, స్టార్టప్స్‌లకు పెట్టుబడులు కల్పించడం, ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ శాఖలను సంప్రదించే వీలు కల్పించడం, స్త్రీ విద్య, కెరీర్ ప్రమోషన్స్ వాటిపై ప్రధాన దృష్టి సారించినట్లు తెలిపారు. ఏ దేశానికి చెందిన మహిళలకైనా తమ సహకారం ఉంటుందని, పెట్టుబడులను సమకూర్చడం నుంచి ప్రభుత్వం నుంచి కాంట్రాక్టులు పొందే దాకా అన్ని రకాల సాయం అందిస్తామని చెప్పారు.
‘ఫెమిగ్రెంట్స్’నడుపుతోంది మన హైదరాబాదీనే
యూఎస్ విమెన్ చాంబర్ ఆఫ్ కామర్స్ మాదిరే మహిళా పారిశ్రామికవేత్తల కోసం పనిచేసే ఇతర సంస్థలు కూడా అమెరికాలో ఉన్నాయి. వాటిల్లో ఒకటి ఫెమిగ్రెంట్స్. దీన్ని ఇకా అలీవియాతో కలసి మన హైదరాబాద్‌కు చెందిన లావణ్య పోరెడ్డి నిర్వహిస్తున్నారు. ఇది కాక సిలీకాన్ వ్యాలీలోనే విమెన్ స్టార్టప్ ల్యాబ్ ఒకటి ఉంది. దీనికి జపాన్‌కు చెందిన అరి హోరీ సీఈఓగా ఉన్నారు. ‘‘సిలికాన్ వ్యాలీలో మనీ, పవర్ అన్నిటినీ కంట్రోల్ చేసేది పురుషులే. ఇక్కడున్న వెంచర్ కాపిటలిస్టుల్లో 90 శాతం మంది పురుషులే’’అని హోరీ పేర్కొన్నారు.