వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రావెల్ బ్యాన్ జాబితాలోకి కొత్తగా ఉత్తర కొరియా సహా మూడు దేశాలను చేర్చారు. ఆరు ముస్లిం దేశాల (లిబియా, సూడాన్, ఇరాన్, సిరియా, యెమెన్, సోమాలియా) ప్రజలకు అమెరికాలోకి ప్రవేశంపై అనేక ఆంక్షలు విధిస్తూ ట్రంప్ ఈ ఏడాది మార్చిలో నిషేధ ఉత్తర్వులు తీసుకురావడం తెలిసిందే. ఆ ఆజ్ఞల గడువు ఆదివారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో ట్రంప్ కొత్తగా మరో మూడు దేశాలపై కూడా నిషేధం విధిస్తూ ఆదివారమే ఉత్తర్వులిచ్చారు.
అయితే సూడాన్‌ను నిషేధిత జాబితా నుంచి తొలగించారు. క్షిపణి, అణు పరీక్షలతో రెచ్చిపోతున్న ఉత్తర కొరియాతోపాటు, వెనిజులా, చాద్ దేశాలపై కూడా ఆయన తాజాగా ట్రావెల్ బ్యాన్ విధించారు. దీంతో ప్రస్తుతం అమెరికా నిషేధాజ్ఞలు ఎదుర్కొంటున్న మొత్తం దేశాల సంఖ్య 8కి చేరింది. హోంలాండ్ భద్రతా విభాగం జరిపిన సమీక్షల అనంతరం, అమెరికా ప్రజల రక్షణ కోసమే ఈ చర్యలు తీసుకుంటున్నామని ట్రంప్ వెల్లడించారు.
గత ప్రభుత్వాలు తీసుకొచ్చిన విఫల విధానాలను తాము కొనసాగించలేమనీ, అమెరికా ప్రజల భద్రతే తనకు అత్యంత ప్రాధాన్య అంశమని ట్రంప్ పేర్కొన్నారు. కొత్త ఉత్తర్వులు అక్టోబరు 18 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నిషేధాజ్ఞలు షరతులతో కూడుకున్నవి. అమెరికా పౌరుల భద్రత కోసం ఆయా దేశాలు అమెరికాతో కలసి పనిచేస్తే నిషేధాన్ని ఎత్తివేస్తారు. కొత్త ఉత్తర్వుల్లో ఇరాక్ ప్రజలను పూర్తిగా నిషేధించకుండా, వారు అదనపు తనిఖీలను ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
కాగా, ట్రంప్ తాజా ఉత్తర్వులపై అమెరికాలోని పలు స్వచ్ఛంద సంస్థలు మండిపడ్డాయి. అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ (ఏసీఎల్‌యూ), ఆసియన్ అమెరికన్స్ అడ్వాన్సింగ్ జస్టిస్ (ఏఏఏజే), కౌన్సిల్ ఆన్ ఆమెరికన్ ఇస్లామిక్ రిలేషన్స్, నేషనల్ ఇమిగ్రేషన్ లా సెంటర్ తదితర సంఘాలు నిషేధాన్ని తీవ్రంగా ఖండించాయి. ఇది ముస్లిం ఆధిక్య దేశాల నుంచి వచ్చే వలసదారులు, శరణార్థులు, పర్యాటకులపై వివక్షను కొనసాగించడమేనని ఏఏఏజే ప్రతినిధి విమర్శించారు.