బెర్లిన్: జర్మనీ పార్లమెంటు దిగువసభ బుందేస్టాగ్‌కు ఆదివారం జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన ఏంజిలా మెర్కెల్ వరసగా నాలుగోసారి చాన్స్‌లర్ పదవి చేపట్టేందుకు అర్హత పొందారు. అయితే 33 శాతం ఓట్లు, 246 సీట్లు గెలిచిన ఆమె నేతృత్వంలోని క్రిస్టియన్ డెమోక్రాటిక్ యూనియన్ (సీడీయూ)–క్రిస్టియన్ సోషల్ యూనియన్ (సీఎస్‌యూ) కూటమి... సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత ఆధిక్యం పొందలేకపోయింది.
దీంతో ఫ్రీ డెమోక్రాటిక్ పార్టీ (ఎఫ్‌డీపీ), గ్రీన్ పార్టీలతో కలసి ఆమె అధికారం చేపట్టే అవకాశం ఉంది. ఎఫ్‌డీపీ 10.7% ఓట్లతో 80 సీట్లను, గ్రీన్ పార్టీ 8.9% ఓట్లతో 67 స్థానాలను గెలుచుకున్నాయి. సీడీయూ–సీఎస్‌యూ కూటమితోపాటు ఈ రెండు పార్టీల సీట్లను కలిపితే మెర్కెల్‌కు పూర్తి ఆధిక్యం లభిస్తుంది. మరోవైపు ఇన్నాళ్లూ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి, ఈ ఎన్నికల్లో మహా సంకీర్ణం నుంచి బయటకొచ్చి పోటీ చేసిన సోషల్ డెమోక్రటిక్ పార్టీ (ఎస్‌పీడీ) 20.5 శాతం ఓట్లు, 153 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది.
ప్రజలు తమను ప్రతిపక్షానికి పరిమితం చేసినందున ఆ పాత్రనే పోషిస్తామని మళ్లీ మెర్కెల్‌కు మద్దతిచ్చి ప్రభుత్వంలో చేరే ప్రశ్నే లేదని ఎస్‌పీడీ అధినేత మార్టిన్ షుల్జ్ చెప్పారు. అలాగే 12.6% ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచిన ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ (ఏఎఫ్‌డీ) పార్టీ తొలిసారి పార్లమెంటులో అడుగుపెట్టనుంది.
‘జమైకా’ సంకీర్ణానికే అవకాశం
మెర్కెల్‌తో కలసి సాగడానికి ఎస్పీడీ, ఏఎఫ్‌డీ, లెఫ్ట్ పార్టీలు విముఖత చూపుతున్నందున ప్రభుత్వంలో చేరడానికి అవకాశం ఉన్న పార్టీలు ఎఫ్‌డీపీ, గ్రీన్స్ మాత్రమే. సీడీయూ–సీఎస్‌యూ కూటమి, ఎఫ్‌డీపీ, గ్రీన్స్...ఈ మూడు పార్టీల రంగులు జమైకా జాతీయ జెండాలో ఉంటాయి. ఈ మూడు కలసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే దానిని జమైకా సంకీర్ణం అంటారు. అయితే ఎఫ్‌డీపీ, గ్రీన్స్ పార్టీలు పరస్పర శత్రువులు. దీంతో వారిని బుజ్జగించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మెర్కెల్‌కు కొంత సమయం పట్టనుంది. స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తన లక్ష్యమని మెర్కెల్ ఫలితాల అనంతరం చెప్పారు. ఎన్నికల్లో ప్రజలు తమకు అనుకూలంగా ఓటేశారనీ, తమను కాదని మరే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని ఆమె అన్నారు.
ఈసారి సభ్యులెంత మంది...
జర్మనీ ఫెడరల్ దిగువసభ బుందేస్టాగ్ సభ్యుల సంఖ్య స్థిరంగా ఉండదు. ప్రతి ఎన్నికల్లో వివిధ పార్టీలకు లభించే ఓట్ల ఆధారంగా స్థిర సీట్లకు కొన్ని సీట్లు కలుపుతారు. గత బుందేస్టాగ్‌లో మొత్తం 631 మంది సభ్యులుండగా, ఈసారి ఆ సంఖ్య 709కి పెరుగుతుంది. ఈ లెక్కన చాన్స్‌లర్‌గా ఎన్నికవడానికి మెర్కెల్‌కు 355 మంది సభ్యుల మద్దతు అవసరమౌతుంది. బుందేస్టాగ్‌లోని మొత్తం సభ్యుల్లో 299 మంది నియోజకవర్గాల నుంచి ఎన్నికైనవారైతే, దామాషా పద్ధతిలో మరో 299 మంది సభ్యులుగా నియమితులైనవారుంటారు.
వారినే (598 మంది) రెగ్యులర్ సభ్యులంటారు. వారేగాక వివిధ పార్టీలకు మొదటి ఓటు(నియోజకవర్గాల్లో) సీట్లలో వచ్చిన ఓట్లు, రెండో ఓట్ల(దామాషా ఓట్లు) వివరాల ఆధారంగా హేంగోవర్, బ్యాలెన్స్ సీట్ల ప్రతినిధులుగా మరి కొంత మంది సభ్యులుగా చేరతారు. ఈ నాలుగు పద్ధతుల్లో బుందేస్టాగ్ సభ్యులయ్యేవారి సంఖ్య ఈసారి 709 ఉంటుంది. చాన్స్‌లర్‌గా దేశాధ్యక్షుడు నియమించాలంటే కనీసం 312 మంది సభ్యుల మద్దతు అవసరం. నియామకం తర్వాత కొత్త చాన్సలర్‌కు మెజారిటీ (355) ఉన్నదీ లేనిదీ తేల్చడానికి ఓటింగ్ జరుగుతుంది.
ప్రస్తుత పాలక కూటమి పార్టీలు సీడీయూ, సీఎస్‌యూలకు గత ఎన్నికలతో పోల్చితే 65 సీట్లు తగ్గాయి. పాలక కూటమి నుంచి వైదొలగుతున్న ప్రధాన ప్రతిపక్షం ఎస్‌పీడీ(సోషల్ డెమొక్రాట్లు) 40 సీట్లు కోల్పోయింది. కిందటిసారి ఒక్క సీటూ సాధించని ఏఎఫ్‌డీ 94 సీట్లు కైవసం చేసుకుంది. ప్రతిపక్షంలోనే కొనసాగుతున్న లెఫ్ట్ పార్టీకి అదనంగా 5 సీట్లు లభించగా, గ్రీన్ పార్టీ మరో నాలుగు సీట్లు సంపాదించింది.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్