'ఓయ్ సెక్సీ' అంటూ పిలిచాడని..!
కాలిఫోర్నియా బేస్డ్ ఫ్లైట్ లో అలస్కా ఎయిర్ లైన్స్ మహిళా సిబ్బందితో ఓ ప్యాసింజర్ దురుసుగా ప్రవర్తించాడన్న కారణంతో అతడిని విమానం నుంచి దింపివేశారు. భద్రత కోసం మహిళా ఉద్యోగిని సూచనలు, సలహాలు ఇస్తున్న సమయంలో ఓ ప్రయాణికుడు కాస్త దురుసుగా ప్రవర్తించాడు. ఓయ్ సెక్సీ.. అంటూ అసభ్యపదజాలంలో మహిళా సిబ్బందిని సంబోధించాడు. అక్టోబర్ 9న జరిగిన ఘటనపై అలస్కా ఎయిర్ లైన్స్ బుధవారం అధికారికంగా ప్రకటించింది.
సీటెల్ నుంచి బర్బాంక్ కు డిపార్టర్ అవడానికి రెడీగా ఉన్న ఫ్లైట్-520 నుంచి ఆ ప్యాసింజర్ ను కిందకి దింపివేసినట్లు ఎయిర్ లైన్స్ తెలిపింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న ఇతర సిబ్బంది ప్రవర్తన మార్చుకుంటే మంచిదని ఆ ప్రయాణికుడిని హెచ్చరించారు. సీటెల్-టకోమా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫ్లైట్ మరికాసేపట్లో బయలుదేరేందుకు సిద్ధంగా ఉంది. ఆ సమయంలో చోటుచేసుకున్న ఈ సంఘటనపై ఓ ప్యాసింజర్ అంబర్ నిల్సన్.. ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇద్దరు మహిళా ప్యాసింజర్ల మధ్యలో ఆ ప్రయాణికుడి సీట్ ఉంది. అతడి చేష్టలతో ఇద్దరు మహిళలు కూడా ఎంతో అసౌకర్యానికి లోనయ్యారు.
దాంతో పాటుగా ఫ్లైట్ మహిళా ఉగ్యోగినిని అసభ్య పదజాలంతో సంబోధించగా ఆమె అతడి వద్దకు వచ్చి కాస్త మర్యాదగా మాట్లాడాలని సూచించింది. 'నేను నీతో జస్ట్ ఫన్ చేశాను. నిన్ను ఓ ఆట ఆడుకుంటాను' అని ఆమెతో మరోసారి చెప్పాడు. ఈ విషయాన్ని ఎయిర్ లైన్స్ దృష్టికి తీసుకెళ్లగా అక్కడికొచ్చిన ఓ ఉద్యోగి ఆ ప్యాసింజర్ ను విమానం నుంచి దిగాలని చెప్పాడు. అయినా అతడిలో ఎలాంటి మార్పురాకపోగా.. తానేం తప్పు చేయలేదని, ఎలాంటి ఉల్లంఘన చర్యలకు పాల్పడలేదని వాదించాడు. చివరికి తన ప్రవర్తనకు మూల్యం చెల్లించుకుంటూ విమానం నుంచి దిగిపోవాల్సి వచ్చింది. సిబ్బందికి తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని ఎయిర్ లైన్స్ అధికారులు చెప్పారు.